నవ్యాంధ్రప్రదేశ్ లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సర్కారుపై అంతకంతకూ వ్యతిరేకత పెరుగుతోంది. ఇటీవల జగన్ తన సొంత సర్వే సంస్థతో చేయించుకున్న సర్వేలో వచ్చిన ఫలితాలను చూసి వైసీపీ నేతల్లో దడ మొదలైన సంగతి తెలిసిందే. గత నెల చివరలో వెల్లడైన ఈ సర్వేలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే… ఏకంగా 60 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు పరాజయం తప్పదట. మరో 20 మందికి టఫ్ ఫైట్ ఎదురు కానుందని ఆ సర్వే వెల్లడించిది. ఇక ఓడిపోయే అవకాశాలున్న 60 మంది ఎమ్మెల్యేల్లో ఏకంగా 9 మంది మంత్రులున్నట్లుగా కూడా ఆ సర్వే తేల్చేసింది. ఈ సర్వేలో వచ్చిన ఫలితాలకు కారణాలేమిటన్న కోణంలో జగన్ అండ్ కో ఆరా తీస్తున్న నేపథ్యంలో ఇప్పుడు లోకల్ యాప్ సర్వే పేరిట ఎంట్రీ ఇచ్చిన మరో సర్వే వైసీపీ శిబిరాన్ని మరింత ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. ఓటమిపాలయ్యే ఛాన్సు ఉన్న మంత్రుల సంఖ్య ఈ సర్వేలో 9 నుంచి 11కు చేరిపోయింది. మొత్తంగా సమయం పెరిగే కొద్దీ ఓటమిపాలయ్యే వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మంత్రుల సంఖ్య పెరిగిపోతుండటం ఆ పార్టీని పెను కలవరానికి గురి చేసేదేనని చెప్పక తప్పదు.
రెండేళ్లలోనే 4 శాతం ఓట్లు లాస్
2019 ఎన్నికల్లో వైసీపీకి 49.95 శాతం ఓట్లు వచ్చాయి. అంటే.. వైసీపీకి 50 శాతం మేర.. అంటే.. మొత్తం ఓట్లలో సగం మేర ఓట్లు వచ్చినట్లు లెక్క. ఇక విపక్ష టీడీపీకి కేవలం 39.99 శాతం మేర ఓట్లు వచ్చాయి. 151 సీట్లతో అదికారంలోకి వచ్చిన వైసీపీకి, కేవలం 23 సీట్లతో విపక్షానికి పరిమితమైపోయిన టీడీపీకి వచ్చిన ఓట్ల మధ్య తేడా కేవలం 10 శాతం మాత్రమే. ఈ 10 శాతం ఓట్ల తేడాతోనే ఈ రెండు పార్టీలకు దక్కిన సీట్లలో భారీ వ్యత్యాసం చాలా స్పష్టంగానే కనిపిస్తోంది. తాజా సర్వేలో వైసీపీ ఓట్ షేరింగ్ ఏకంగా 4 శాతం మేర పడిపోయిందట. ఈ సర్వేలో వైసీపీకి దక్కిన ఓట్ షేరింగ్ 46.5 శాతానికి పడిపోయిందట. అంటే.. దాదాపుగా 4 శాతం మేర ఓట్లను వైసీపీ కోల్పోయిందన్న మాట. అధికారం చేపట్టి తర్వాత ఇంకా రెండున్నరేళ్ల సమయం కూడా గడవకముందే.. వైసీపీ తన ఓట్లను 4 శాతం మేర కోల్పోయిందంటే.. వచ్చే రెండున్నరేళ్లకు పైగా ఉన్న సమయంలో ఆ పార్టీ ఇంకెంత మేర ఓట్లను కోల్పోతుందన్న దానిపై ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి. ఇప్పుడు కోల్పోయిన 4 శాతం ఓట్లతో వైసీపీకి ఎమ్మెల్యే సీట్లు భారీగా పడిపోవడం ఖాయమే. ఎన్నికల్లోగా మరింత మేర ఓటు షేరింగ్ పడిపోతున్న నేపథ్యంలో వైసీపీ ఓటమి దిశగానే సాగుతోందని చెప్పక తప్పదు.
ఆ 11 మంది మంత్రులు ఎవరు?
ఎలాగూ తమ సొంత సర్వేలోనే 60 మంది ఎమ్మెల్యేలు, వారిలో 9 మంది మంత్రులు ఓడిపోతారని తేలడంతో ఇప్పుడు వచ్చిన కొత్త సర్వేను జగన్ అంతగా పట్టించుకోవడం లేదనే చెప్పాలి. ఎందుకంటే.. తాను చేయించుకున్న సర్వేలోనే ఓటమి దిశగా సాగుతున్నామని తేల్చేసుకున్న జగన్ దిద్దుబాటు చర్యలకు దిగారు. ఈ క్రమంలో కొత్తగా వచ్చిన సర్వేలో ఓటమిపాలయ్యే మంత్రుల సంఖ్య మరింతగా పెరగడం ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇక ఓడిపోయే మంత్రుల జాబితాను కూడా ఈ సర్వే వెల్లడించింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. జగన్ కేబినెట్ లో మంత్రులుగా కొనసాగుతున్న వెల్లంపల్లి శ్రీనివాస్, మేకతోటి సుచరిత, తానేటి వనిత, పాముల పుష్పశ్రీవాణి, చెరుకువాడ శ్రీరంగనాధరాజు, గుమ్మనూరు జయరామ్, మాలగుండ్ల శంకరనారాయణ, పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్, సీదిరి అప్పలరాజు, పినిపే విశ్వరూప్, అవంతి శ్రీనివాస్‌లు ఓడిపోతారట. ఈ జాబితాలో జగన్ కు అత్యంత సన్నిహితులుగా పేరున్న అనిల్, వెలంపల్లి, పుష్ఫ శ్రీవాణి ఉండటం గమనార్హం. మొత్తంగా గత నెలలో ఓ సర్వే, ఇప్పుడు ఇంకో సర్వే వైసీపీ దిగజారిపోతున్న వైనాన్ని తేల్చేయడంతో ఏపీలో ఆసక్తికర విశ్లేషణలు మొదలయ్యాయి.











