జగన్ ను సొంత సామాజికవర్గ నేతలె నమ్మడం లేదా? వైసీపీ మళ్ళీ అధికారంలోకి వచ్చేది లేదని వారంతా ఫిక్స్ అయిపోయారా ?జగన్ తీరుతో విసిగిపోయిన రెడ్డి సామాజికవర్గం నాయకులు తిరుగుబాటు జెండా ఎగరవేస్తున్నారా ? ముందు జాగ్రత్తగా ఇప్పటి నుంచే వేరే దారులు వేతుక్కుంటున్నారా ? ఇంతకీ జగన్ ను వ్యతిరేకిస్తున్న ఆ నేతలు ఎవరు ?
జగన్ ను సొంత రెడ్డి సామాజిక వర్గ నేతలె నమ్మడం లేదనే చర్చ జోరుగా సాగుతోంది. గత ఎన్నికల్లో జగన్ విజయం కోసం అహర్నిశలు కృషి చేసిన వారే ఇప్పుడు ఆయనపై తిరుగుబాటు జెండా ఎగరవేస్తున్నట్లుగా కనిపిస్తోంది. మూడేళ్ళ పాలనతో జగన్ పై ఏర్పడిన ప్రజావ్యతిరేకతతో వైసీపీ మళ్ళీ అధికారంలోకి రాదని ఫిక్స్ అయిన ఆ సామాజికవర్గానికి చెందిన నాయకులు ఇప్పటి నుంచే వేరే దారులు వెతుక్కుంటున్నారని టాక్.
ముఖ్యంగా 2024లో వైసీపీ అధికారాన్ని కొల్పవడం ఖాయమని, ఇక రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వయానే అనే నిర్ణయానికి వచ్చిన కొందరు రెడ్డి సామాజిక వర్గ నాయకులు ఎన్నికలకు రెండేళ్ళు ఉంటుండగానే ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం. టిడిపి అధికారంలోకి వస్తే తాము ఎమ్మెల్యేలుగా గెలిచినా ఓడినా తమకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా చూసుకుంటున్నారట.ఈ క్రమంలోనే టిడిపితో గొడవలు వద్దంటూ పలువరు రెడ్డి సామాజికవర్గ మంత్రులు, ఎమ్మెల్యేలు తమ అనుచరులకు గట్టిగానే చెబుతున్నారట.
వీరిలో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ప్రధమ స్థానంలో ఉన్నారనే చర్చ జోరందుకుంది. ప్రధానంగా ఇటీవల ఒక సందర్భంలో రాచమల్లు మాట్లాడుతూ తాను సాక్షిని చూడనని, తనకు ఈనాడు అంటేనే అభిమానమని ప్రకటించారు.కాగా, ఈ ప్రకటన వైసీపీలో తీవ్ర దుమారమే రేపిందట.దీంతో రాచమల్లు టిడిపిలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారంటూ జగన్ మీడియా ప్రచారం చేయడం మొదలు పెట్టేసింది.అదేసమయంలో ప్రొద్దుటూరులో రాచమల్లుకి వ్యతిరేకంగా పనిచేస్తున్న వైసీపీ వర్గం తిరుగుబాటు జెండా ఎగురవేస్తోందట.
ఇక ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలపై వేధింపులకు పాల్పడొద్దని.. వారిని ఇబ్బందులకు గురి చేయొద్దని నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తమ పార్టీ నేతలకు సూచించడం వైసీపీలో కలకలం రేపిందట. ప్రత్యర్థులను శత్రువులుగా చూడొద్దని హితవు పలికిన కోటంరెడ్డి..వారిని రాజకీయాల్లో పోటీదారులుగా మాత్రమే చూడాలని కోరడం పై విస్మయం చెందిన వైసీపీ నేతలు దీని మర్మమేటంటూ చెవులు కొరుక్కుంటున్నారట. మరోవైపు ప్రతిపక్షం పై చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సైలెన్స్ పైనా వైసీపీ శ్రేణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి.నువ్వు గెలుస్తావు, వైసీపీ రావడం కలే అని చెవిరెడ్డికి గురువులాంటి వ్యక్తి హితబోథ చేయడంతో టిడిపి పట్ల మెతక వైఖరి వాహిస్తున్నారని.. ఆ మధ్య చంద్రబాబు కాన్వాయ్‌లో వెళ్తుంటే లేచి మరీ నమస్కరించడం కూడా అందులో భాగమే అనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో టిడిపి టికెట్ ప్రకటించగా వైసీపీలో చేరి ఎంపీగా గెలిచిన నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి కూడా ప్రతిపక్ష టిడిపి పై ఎక్కడా ఒక్క మాట తూలడంలేదట. ఇలా ఉదాహరణలు తీసుకుంటే ప్రతీ జిల్లాలోనూ రెడ్డి సామాజికవర్గ వైసీపీ ఎమ్మెల్యేలు విపక్షంపై సాఫ్ట్‌కార్నర్‌తోనే పోతున్నాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
కాగా, ప్రస్తుతం వైసీపీ నుంచి ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి మాత్రమే తెలుగుదేశం పార్టీ పై విరుచుకుపడుతున్నారు.వీరు జగన్ ఎటు దూకితే అటు రెడ్లు అని అందుకే జగన్ వద్ద మెప్పు కోసం వీరు ఆ విధంగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.ఇదిలా ఉంటే ఇప్పటికే వైసీపీలోని రెడ్డి సామాజికవర్గ ఎమ్మెల్యేలు ప్రతిపక్ష టిడిపి అధికారంలోకి రావడం ఖాయమని, ఇప్పటి నుంచే మంచిగా ఉండాలనే లెక్కల్లో ఉంటే..ఇతర సామాజిక వర్గ వైసీపీ ఎమ్మెల్యేలు మాత్రం జగన్ వద్ద మెప్పు కోసమో లేక మరే ఇతర కారణాల చెతనో కానీ.. అవసరం ఉన్నా, లేకున్నా ప్రతిపక్షం పై బూతులతో చెలరేగిపోతున్నారు. ప్రతిపక్షంపై వీరు ప్రయోగిస్తున్న భాష, హావభావాలు చూస్తూ..వైసీపీలో రెడ్డి ఎమ్మెల్యేలు వీరి భవిష్యత్తేంటో పాపం అనుకుంటూ వారిలో వారు చర్చించుకుంటునారట.
మొత్తం మీద జగన్ ఏకపక్ష నిర్ణయాల కారణంగానే గత ఎన్నికల్లో వెన్నుదన్నుగా నిలిచిన సొంత సామాజికవర్గ నేతలు ఇప్పుడు తిరుగుబాటు జెండా ఎగరువేస్తున్నారని, జగన్ పై ప్రజాల్లోనే కాదు సొంత పార్టీలోనూ వ్యతిరేకత నిండుకుందని, రాబోయే ఎన్నికల్లో అది వైసీపీ కి ప్రతికూలంగానూ, టిడిపికి అనుకూలంగానూ మారబోతోందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.