కరోనా కల్లోల్లాన్ని తట్టుకుని నిలబడిన మానవుడిని చూస్తుంటే.. ఒక పాత సినిమాలోని పాట గుర్తొస్తుంది. ‘మానవుడే మహనీయుడు.. శక్తియుతుడు.. యుక్తిపరుడు..’ ఇలా సాగే ఈ మాట మన నేటి మనోధైర్యాన్ని ప్రతిబింబిస్తుంది.
మానవుని మనుగడకే సవాలు విసిరింది కరోనా.. మానవ జాతి తుడిచిపెట్టుకుపోతుందేమో అన్నంతగా వణికించింది మానవ లోకాన్ని. కానీ ఎటువంటి పరిస్థితులనైనా మానవుడు తట్టుకుని నిలబడగలడని కరోనా కారణంగా మరోసారి నిరుపితమైంది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే.. చోలుటెకా బ్రిడ్జ్ కథ గుర్తొస్తుంది. కరోనాను మానువుడు తట్టుకుని నిలబడడానికి.. ఒక మానవ నిర్మితమైన బ్రిడ్జ్‌కి ఏంటి సంబంధం అనుకుంటున్నారా? మరి చోలుటెకా కథ తెలుసుకుందాం రండి.
ప్రకృతి దిశ మారినా.. చలించని తత్వం..
హోండురస్ దేశంలో చోటుటెకా నదిపై రవాణాకు అనుగుణంగా 484 మీటర్ల పోడవుతో చోలుటెకా బ్రిడ్జ్‌ను నిర్మించారు. ఇది మానవ నిర్మణాల్లో ఓ అద్భుతమని చెప్పాలి. దీని నిర్మాణం 1998లో పూర్తయింది. ఇది నిర్మించిన అదే సంవత్సరంలో హరికేన్ అక్కడి ప్రాంతాన్ని అతలాకుతలం చేసింది. దాదాపు 7 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. బ్రిడ్జ్‌లు, రోడ్లు, ఇళ్లు.. ఇలా లెక్కే లేకుండా ఆ ప్రాంతమంతా దాదాపు తడిచిపెట్టుకుపోయింది.. సమస్త సంపద సర్వనాశనమయింది. ఈ హరికేన్ దాటికి.. చివరికి నది కూడా తన గమనాన్ని మార్చుకోకతప్పలేదు. ప్రస్తుతం చోలుటెకా నది బ్రిడ్జి కింద కాకుండా దాన్ని పక్కాగా పారుతుంది. దీని బట్టి తెలుస్తుందిగా హరికేన్ ఆ ప్రాంతాన్ని ఎంతగా వణికిచ్చిందో.. కానీ ఇంతటి ప్రళయానకి కూడా చెక్కు చెదరకుంగా నిలబడిన మానవ నిర్మితం ‘చోలుటెకా బ్రిడ్జి’.
ఇది వినగానే.. ఏంటి నిజమా అనిపిస్తుంది కదా.. వినడానికే చాలా ఆశ్చర్యం కలిగిస్తున్న విషయమైనా.. ఇది నిజం.. నదిని సైతం తన దాటికి దిశ మార్చుకునేలా చేసిన ఓ హరికేన్.. ఓ మానవ నిర్మితాన్ని కదిలించలేకపోయింది. బ్రిడ్జి చుట్టుపక్కల మునుపు రోడ్లు, ప్రకృతి ఉండేదనే అనవాలు లేకుండా తుడిచిపెట్టేసింది హరికేన్. కానీ బ్రిడ్జి మాత్రం తొణకలేదు బెనకలేదు. కేవలం కాస్త పాక్షికంగా మాత్రమే దెబ్బతినింది. ఆ తర్వాత 2002 లో కొన్ని మరమ్మత్తులు చేశారు. ఇప్పటికీ ఈ బ్రిడ్జి ఎన్నో విపత్తులకు సాక్ష్యంగా నిలిచి ఉంది.
ప్రళయాన్ని మించింది.. మానసిక స్థైర్యం
ప్రకృతి ప్రళయాన్ని, ప్రకోపాన్ని మానవుడు నిలువరించగలడా.. సమస్యే లేదు.. ప్రకృతి విలయాన్ని నిలువరించగలగడం అసాధ్యం. కానీ హఠాత్తుగా మీద పడిన పరిణామాలని తట్టుకుని స్థిరంగా నిలబడి విజయం సాధించగలడు అనడానికి ‘చోలుటెకా బ్రిడ్జ్’ కథే ఓ ఉదాహరణ. ఇప్పుడు మానవుడికి కావాల్సింది కూడా అదే మానసిక స్థైర్యం, మనో నిబ్బరం.
ప్రకృతి విపత్తులు, భయంకర వ్యాధులు మానవుడికి ఇది ప్రధమం కాదు. ఇలాంటివి ఎన్నో తట్టుకున్నాడు, అన్నింటికి నిలిచి గెలిచిన వాడు మానవుడు. కానీ, నేటి కరోనా అందుకు కొద్దిగా భిన్నమైన సవాలు విసిరిందనే చెప్పాలి. కాలు బయటపెట్టాలంటేనే వణికిపోయేలా చేసింది కరోనా.. అది ఒకటి-రెండు రోజులు కాదు.. కొన్ని నెలలపాటు అదే పరిస్థితి కొనసాగింది.
ప్రకృతి ప్రకోపాన్ని మానవుడు నిలువరించలేకపోవచ్చు.. ప్రస్తుత మన పరిస్థితికి ఈ బ్రిడ్జ్ కథ చక్కగా సరిపోతుంది. మనిషి ఆత్మస్థైర్యంతో నిలబడి ఎదురించి పోరాడిన నాడు ప్రకృతి సైతం ఆ హరికేన్‌లా వచ్చి వెళ్లిపోవాల్సిందే తప్పించి బ్రిడ్జ్‌లా మనోధైర్యంతో నిలబడే మానవజాతిని పెకలించడం ఎన్ని విపత్తులకైనా అసాధ్యమనేది మరోసారి నిరూపించాడు మానవుడు.
Must Read ;- వామ్మో ఏలియన్స్.. మానవాళికి పెవిలియన్ బాటేనా?