ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లోనూ తెలుగు మాధ్యమాన్ని తీసివేసే దిశగా జగన్ సర్కారు కదులుతుంటే.. తెలంగాణలో కేసీఆర్ సర్కారు సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. ప్రత్యేకించి పదో తరగతి పరీక్షలను సమూలంగా ప్రక్షాళన చేసిన కేసీఆర్ సర్కారు.. మొత్తం టెన్త్ పబ్లిక్ పరీక్షల రూపు రేఖలను మార్చేసింది. ప్రస్తుతం టెన్త్ విద్యార్థులు మొత్తం 11 పేపర్ల పరీక్షలకు హాజరు అవుతుండగా.. ఇకపై ఆ 11 పేపర్లను 6 పేపర్లకు కుదిస్తూ కేసీఆర్ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తెలంగాణ విద్యా శాఖ సోమవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది.
6 సబ్జెక్టులకు 6 పేపర్లే
సవరించిన టెన్త్ పరీక్షల విధానంలో విద్యార్థులు అభ్యసించే ఆరు సబ్జెక్టులకు ఇకపై ఆరు పేపర్లు మాత్రమే పరీక్షల్లో ఉంటాయి. టెన్త్ విద్యార్థులకు ఇతర తరగతుల్లో మాదిరే మూడు భాషలతో పాటు మూడు ఇతరత్రా సబ్జెక్టులు ఉన్న సంగతి తెలిసిందే. తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషా సబ్జెక్టులతో పాటుగా గణితం, సామాజిక శాస్త్రం(సోషల్), సామాన్య శాస్త్రం (సైన్స్) సబ్జెక్టులున్నాయి. అయితే హిందీ మినహా మిగిలిన ఐదు సబ్జెక్టుల్లోని పాఠ్యాంశాలను రెండు విభాగాలుగా విడదీసి.. ఈ ఐదు సబ్జెక్టులకు గానూ 10 పేపర్లలో పరీక్ష నిర్వహిస్తున్నారు. అయితే ఇకపై ఈ తరహా విధానాన్ని రద్దు చేస్తూ.. 6 సబ్జెక్టులకు 6 పేపర్లలో మాత్రమే పరీక్షను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
స్టూడెంట్స్ ఏమంటారో..?
టెన్త్ సిలబస్ చాలా పెద్దదేనని చెప్పాలి. ఏదో తకగతి వరకు ఆరు సబ్జెక్టులకు ఆరు పేపర్లతోనే పరీక్షలు నిర్వహిస్తున్నా.. పదో తరగతి పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేసేలా 8వ తరగతి నుంచే 11 పేపర్ల పరీక్షా విధానాన్ని అలవాటు చేస్తూ పాఠ్య ప్రణాళికను మార్చివేసిన సంగతి తెలిసిందే. 8వ తరగతిలో కొంత మేర మార్పున్నా.. 9 వ తరగతిలోకి వచ్చేసరికి టెన్త్ సిలబస్‌ను పోలిన మాదిరే పాఠ్య ప్రణాళిక, పరీక్షా విధానం ఉంటోంది. సైన్స్‌ను బయలాజికల్, ఫిజికల్ సైన్సగా.. సోషల్ నున హిస్టరీ, పొలిటికల్ సైన్స్‌గా. మార్చివేయడంతో పాటుగా మ్యాథ్స్, ఇంగ్లీష్, తెలుగులోని పాఠ్యాంశాలను రెండుగా విడదీసి బోధన చేస్తున్నారు. పరీక్షలు కూడా అందుకనుగుణంగానే జరుగుతున్నాయి. మరి పాఠ్య ప్రణాళికను అలాగే పెట్టేసి పరీక్షా విధానాన్ని మాత్రమే మారుస్తారా? లేదంటే పాఠ్య ప్రణాళికను కూడా పూర్తిగా మార్చేస్తారా? అన్న దానిపై క్లారిటీ లేదు. అంతేకాకుండా ఈ కొత్త పరీక్షా విధానంపై అటు విద్యార్థులు గానీ, ఇటు తల్లిదండ్రులు గానీ ఎలా రియాక్ట్ అవుతారన్న విషయంపై భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి.
Must Read ;- కూతురి దెబ్బకు కేసీఆర్ దిగొచ్చారే












