Reason Behind Minister Malla Reddy Fires On Revanth Reddy:
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డిపైకి టీఆర్ఎస్ నేతలు వరుసపెట్టి దూకుతున్నారు. సవాళ్లు విసురుతున్నారు. రాజీనామాలకు డిమాండ్ చేస్తున్నారు. వీటన్నింటినీ మించి టీఆర్ఎస్ నేత, మంత్రి మల్లారెడ్డి ఏకంగా రేవంత్ రెడ్డిపైకి తొడగొట్టి మరీ సవాల్ విసిరారు. అప్పటిదాకా మల్కాజిగిరి ఎంపీగా సాగిన మల్లారెడ్డి.. 2018 ఎన్నికల్లో లోక్ సభ బరిని వదిలి అసెంబ్లీ బరిలోకి దిగారు. మేడ్చల్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించి.. కేసీఆర్ కేబినెట్ లో మంత్రిగానూ పదవి దక్కించుకున్నారు. రాజకీయాల్లోకి రాకముందు విద్యా సంస్థల అధినేతగా మంచి పేరు సంపాదించుకున్న మల్లారెడ్డి.. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అందరికీ టార్గెట్ అయిపోయారు. మల్లారెడ్డిపై వస్తున్నన్ని విమర్శలు కేసీఆర్ కేబినెట్ లోని ఏ మంత్రిపైనా రాలేదంటే అతిశయోక్తి కాదేమో. ఇలాంటి నేపథ్యంలో బుధవారం నాడు ఏకంగా రేవంత్ రెడ్డిపైకి ఓ రేంజిలో విరుచుకుపడిన మల్లారెడ్డి.. రేవంత్ పైకి తొడగొట్టి రాజీనామా చేద్దాం రమ్మంటూ సవాల్ చేశారు. అయినా రేవంత్ పైకి మల్లారెడ్డి ఈ మేర విరుచుకుపడటానికి గల కారణాలేమిటన్నది ఇప్పుడు వెల్లడైపోయింది.
రేవంతే కెలికేశారట
టీపీసీసీ చీఫ్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి తనదైన శైలి దూకుడు పెంచిన సంగతి తెలిసిందే. వరుసబెట్టి సభలు నిర్వహిస్తున్న రేవంత్.. మంగళవారం నాడు కేసీఆర్ దత్తత గ్రామం మూడు చింతలపల్లెకు వెళ్లి అక్కడ 24 గంటల దీక్షకు దిగారు. మంగళవారం దీక్ష ప్రారంభించిన రేవంత్.. బుధవారం దీక్ష విమరిస్తున్న సమయంలో మాట్లాడిన సందర్భంగా మల్లారెడ్డి ప్రస్తావన తీసుకొచ్చారట. ఈ సందర్భంగా భూకబ్జాదారుడిగా మల్లారెడ్డిని అభివర్ణించిన రేవంత్.. మల్లారెడ్డిని ఓ మంత్రి అని కూడా చూడకుండా ఘాటు వ్యాఖ్యలు చేశారట. ఈ సందర్భంగా రేవంత్ ఏమన్నారంటే.. ‘‘నేను దీక్ష చేపట్టి 24 గంటలైంది. పాలు అమ్మేవాళ్లు రాలేదు. నీళ్లు అమ్మే వాళ్లు రాలేదు. భూములు కబ్జాలు చేసే వాళ్లు రాలేదు. జోకర్ మల్లన్న కూడా రాలే. ఈ భూమ్మీద జోకర్లను చూశాం. బ్రోకర్లను చూశాం. కానీ.. పాల మల్లిగాడు సగం జోకర్.. సగం బ్రోకర్. వేదికలెక్కి జోకర్ లా మాట్లాడతారు. వేదిక దిగితే భూముల బ్రోకర్ లా మాట్లాడతాడు. ఎవరు భూములు అమ్మినా.. కొన్నా ఈ పాల మల్లిగాడికి కమిషన్ ఇవ్వాల్సిందే’’ అంటూ రేవంత్ ఓ రేంజిలో ఘాటు వ్యాఖ్యలు చేశారట.
అందుకే మల్లారెడ్డి ఫైరింగ్
మంత్రిగా ఉన్న తనపై రేవంత్ రెడ్డి ఇంతలా వ్యాఖ్యలు చేసిన కారణంగానే.. మల్లారెడ్డి కూడా తాను మంత్రిని అన్న విషయాన్ని మరిచిపోయి మరీ రేవంత్ పైకి తొడగొట్టారట. మామూలుగానే మంత్రి మల్లారెడ్డి మాటలు ఓ రేంజిలో ఉంటాయి. తనదైన స్లాంగ్ తో మాట్లాడే మల్లారెడ్డి.. తన ప్రత్యర్థులను విమర్శించే సమయంలో ఉగ్ర రూపాన్నే దాలుస్తారు. అలాంటిది తనను మల్లిగాడు, పాల మల్లిగాడు.. జోకర్, బ్రోకర్ అంటూ తిడితే.. మల్లారెడ్డి ఊరుకుంటారా? అందుకే రేవంత్ చేసిన వ్యాఖ్యలు తన చెవిన పడినంతనే. రంగంలోకి దిగిపోయిన మల్లారెడ్డి.. రేవంత్ పై విరుచుకుపడ్డారు. రాయలేని తిట్లు తిట్టేశారు. అప్పటికీ కోపం చల్లారక ఏకంగా తొడ గొట్టేశారు. రాజీనామా చేద్దాం రమ్మంటూ సవాల్ చేశారు. బుధవారం విసిరిన ఈ సవాల్ ను గురువారం మరోమారు గుర్తు చేసిన మల్లారెడ్డి.. రేవంత్ కు ధైర్యముందా? ఉంటే డెడ్ లైన్ ఇంకా ముగియలేదు. రాజీనామా చేద్దాం రండి.. అంటూ మరోమారు సవాల్ విసిరారు.
Must Read ;- రేవంత్ దెబ్బకు కేసీఆర్ బయటకొచ్చారా?