ఎందరున్నా నిన్నటి బిగ్ బాస్ షోకి మాత్రం యూట్యూబ్ సెలబ్రిటీ గంగవ్వే హైలైట్
ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనాలకు వేదిక అయింది రియాల్టీ షో ‘బిగ్ బాస్’. గత మూడు సీజన్స్ ను విజయవంతంగా పూర్తి చేసుకొని.. ఇప్పుడు నాలుగో సీజన్ ను కూడా మొదలు పెట్టేసింది బిగ్ బాస్ . గత సీజన్ లో షో ను మంచి రక్తి కట్టించి.. హైయెస్ట్ రేటింగ్ కు దోహదపడిన అక్కినేని నాగార్జునే నాలుగో సీజన్ కు కూడా హోస్టింగ్ చేస్తున్నారు. నిన్న సాయంత్రం 6 గంటలకు మొదలైన ఈ షో బిగినింగ్ కు నాగ్ ముసలి పాత్ర ప్రేక్షకులకు మంచి వినోదం అందించింది. కోవిడ్ 19 నిబంధనల్ని పక్కాగా పాటిస్తూ .. తగు జాగ్రత్తలు తీసుకొని మరీ ఈ షో వేదికను మరింత కలర్ ఫుల్ గా తీర్చిదిద్దారు నిర్వాహకులు.
గత మూడు సీజన్స్ ను ప్రేక్షకులు బ్రహ్మాండంగా ఆదరించిన నేపథ్యంలో ఈ సీజన్ కు మరింత గ్లామర్ ను యాడ్ చేశారు. అలాగే కొన్ని సర్ ప్రైజుల్ని కూడా సిద్దం చేశారు. షో కంటెస్టెంట్స్ లో మధ్య వయసువారున్నారు. యంగ్ స్టర్స్ ఉన్నారు, హ్యండ్సమ్ హాంక్స్ ఉన్నారు. ఎందరున్నా నిన్నటి బిగ్ బాస్ షోకి మాత్రం యూట్యూబ్ సెలబ్రిటీ గంగవ్వే హైలైట్ గా నిలిచింది. నిన్నటి నుంచీ ఆమె పేరే తెగ మారుమోగుతోంది. నిన్నటి ఓటింగ్ లో 17000 ఓట్లతో గంగవ్వ ముందంజలో ఉన్నట్లు తెలిసింది. ఆమెను ఎలాగైనా గెలిపించాలని నెటిజన్లు గట్టిగా అనుకుంటున్నారని తెలిసింది. ఇదే సందర్భంలో నాగార్జున, గంగవ్వల ఏజ్ ఫ్యాక్టర్స్ మీద కూడా చర్చజరుగుతోంది.
ఈ షో హోస్టు నాగార్జునకు 61 సంవత్సరాలు, గంగవ్వకు 57 సంవత్సరాలు. ఎంత వ్యత్యాసం ఉందో చూశారా?… నాగ్ ఇంకా వయసులో ఉన్నట్లుంటే ఆమె మాత్రం ముసలిదైపోయింది. ఆమె గ్రామీణ నేపథ్యం, సామాజిక పరిస్థితులు ఆమె వయసును మరింత పెంచాయి. గంగవ్వ ఎవరో యూట్యూబ్ ను తరచుగా చూసేవారికి బాగా తెలుసు. అలాగే తెలంగాణా వాసులకీ బాగా సుపరిచితం. అయితే కొందరికి ఆమె గురించి అంతగా అవగాహనలేదు. ఎప్పుడూ వివిధ రంగాల్లోని ఫేమస్ పెర్సనాలిటీస్ ను రంగంలోకి దింపే బిగ్ బాస్ నిర్వాహకులు …ఈ సారి ఈ ముసలావిడను ఎందుకు తీసుకొచ్చారు? అనే సంగతి కొందరికి అర్ధం కాలేదు.
ఇంతకీ గంగవ్వ ఎవరు? ఆమె తెలంగాణాలోని ఒక మారుమూల పల్లెటూరికి చెందిన మహిళ. కూలిపనులు చేసుకుంటూ ఊరిదాటి ఎప్పుడూ బైటికి వెళ్ళడం ఎరుగని స్త్రీ. అలాంటి ఆమె ‘మై విలేజ్ షో’ అనే ఒక యూట్యూబ్ షో ద్వారా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది . తెలంగాణా పల్లె సంస్రృతికి ప్రతిబింబంగా కనిపించే ఆ అమాయక వృద్ధురాలికి ఒక్క అక్షరం ముక్క కూడా రాదు. అయినప్పటికీ.. తన వాక్చాతుర్యంతో .. సోషల్ మీడియాలో వేలాది అభిమానుల్ని సంపాదించుకుంది.
ఆమెకు 8 మంది మనవళ్ళు , మవవరాళ్ళు. తాగుడుకు బానిసైన భర్త.. 15 ఏళ్ళుగా దుబాయ్ లో ఉద్యోగం చేస్తూ అక్కడే చనిపోయాడని తెలుసుకుంది ఆమె. ఎన్నో కష్టాల్ని దిగమింగుకొని కూలిపనులు చేసుకుంటూ జీవితాన్ని గడిపిన గంగవ్వను యూట్యూబ్ ఒక్కసారిగా స్టార్ ను చేసేసింది. తన అప్పులన్నిటినీ తీర్చేసింది. నిలకడగా ఆదాయం వస్తూండడంతో..త్వరలోనే ఇల్లు కూడా కట్టుకుంటానని చెబుతోంది.
అలాంటి గంగవ్వ బిగ్ బాస్ లో ఎన్నిరోజులు ఉంటుందో తెలియదు కానీ. .ఆమె అభిమాన గణాన్ని బట్టి చూస్తే .. ఆమే గెలుస్తుందని కొందరు చర్చించుకుంటున్నారు. అయితే షో లో ఇచ్చే టాస్కుల్ని ఆమె ఎలా పూర్తి చేస్తుందో చూడాలనే ఆసక్తి చాలా మందిలో ఉంది . మరి బిగ్ బాస్ 4 షోను గంగవ్వ ఎలా రక్తి కట్టిస్తుందో చూడాలి. ఈ షోలో ఎదురయ్యే టాస్క్ లను ఆమె ఎంతవరకు తట్టుకుంటుందో చూడాలి.











