ఆంధ్ర ప్రదేశ్ లో జగన్ రెడ్డి, ఆయన పార్టీ నాయకుల ధన దాహంతో తీవ్ర స్థాయిలో ప్రకృతి విధ్వంసానికి పాల్పడుతున్నారని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మండిపడ్డారు.మంగళగిరిలోని టిడిపి కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర వ్యాప్తంగా పిండి అవుతున్న కొండల పై ఏర్పాటు చేసిన ఫోటో ఎక్సిబిషన్ ను చంద్రబాబు సందర్శించారు. ఈ సంధర్భంగా రాష్ట్రంలో వైసీపీ నేతలు చేస్తున్న ఆగడాలపై ఆయన ధ్వజమెత్తారు.
జగన్ పాలనలో ప్రభుత్వ పెద్దలు అధికారాన్ని అడ్డుపెట్టుకుని కొండలను అడ్డగోలుగా తవ్వేయడం.. అడవులను నరికివేయడం.. అక్రమంగా ఖనిజ సంపదను తవ్వుకుపోవడం వంటివి గతంలో ఎన్నడూ లేనివిధంగా చేస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సంపదకు ట్రస్టీగా ఐదేళ్లపాటు వ్యవహరించాల్సిన రాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దలు తామే దోచుకోవడం రాష్ట్రం చేసుకున్న దౌర్భాగ్యమని ఆయన దుయ్యబట్టారు.
‘రుషికొండ విశాఖ నగరానికి మణిహారం అని.. పచ్చని ప్రకృతితో నగరానికి శోభనిచ్చేదని.. అలాంటి రుషికొండను ఇప్పుడు అడ్డగోలుగా తవ్వేసి బోడికొండగా మార్చేశారని బాబు అన్నారు. తవ్వకం ఆపాలని ఎన్జీటీ ఆదేశిస్తే.. జగన్ సర్కార్ దానిపై సుప్రీంకోర్టుకు వెళ్లారని తెలిపారు. రుషికొండ తవ్వకం ఒక్క విశాఖ సమస్యే కాదని.. మన భావితరాల సమస్యగా పరిగణించి..దానిని పరిశీలించేందుకు తాను అక్కడకు వెళ్తానంటే అడ్డుకున్నారు గానీ కొండ నాశనాన్ని అడ్డుకోగలిగారా? అని ఆయన ప్రశ్నించారు.
అదేవిధంగా కర్నూలు జిల్లాలో రవ్వలకొండను విశ్వబ్రాహ్మణ సామాజిక వర్గం వారు పవిత్రంగా భావిస్తారని..వైసీపీ నేతలు ఆ కొండను కూడా తవ్వేశారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అక్రమ తవ్వకాలు జరిపిన వారిని వదిలేసి తవ్వకాలను చూసేందుకు వెళ్లినవారిపై కేసులు పెట్టిందని అన్నారు. మన్యంలోని భమిడికలొద్ది నుంచి రోజూ వెయ్యి లారీల్లో లేటరైట్ ఖనిజాన్ని అక్రమంగా తవ్వి భారతీ సిమెంట్స్‌కు పంపిస్తున్నారని ఆయన విమర్శించారు.
తన నియోజకవర్గం కుప్పం పరిధిలోని శాంతిపురంలో విలువైన గ్రానైట్ కొండలను అక్రమంగా తవ్వేస్తున్నారని..తాను చూడటానికి వెళ్తే రౌడీయిజంతో అడ్డుకోవాలని చూశారని అన్నారు. వాస్తవానికి ఆ స్థలాన్ని యూనివర్సిటీకి ఇచ్చి అందులో మూలికల మొక్కలు పెంచాలని తమ ప్రభుత్వ హయంలో అనకుంటే..ఇప్పుడు ఆ వర్సిటీ రిజిస్ట్రారే దగ్గరుండి మరీ అక్రమ తవ్వకాలు జరిపిస్తున్నారన్నారు. ఎప్పుడెప్పుడు ఎంత తవ్విందీ గూగుల్ మ్యాప్స్‌లో వస్తాయని..అక్రమాలు చేస్తున్న వారు తప్పించుకుంటామనుకోవద్దని చంద్రబాబు హెచ్చరించారు.