ఒక వాట్సాప్ స్టేటస్ వీడియో హింసకు దారితీసింది.వెయ్యిమంది పోలీస్ స్టేషన్ మీద దాడి చేయడానికి కారణమయ్యింది. ఈ ఘటన కర్ణాటకలోని హుబ్లిలో చోటుచేసుకుంది. హుబ్లి నగరానికి చెందిన ఓ యువకుడు ఓ ప్రార్ధనా మందిరం పై కాషాయ జెండా ఎగురవేస్తున్నట్టుగా ఎడిట్ చేయబడిన ఒక వీడియో ను తన వాట్సాప్ స్టేటస్ గా పెట్టుకున్నాడు. కాగా గంటల వ్యవధిలోనే ఆ వివాదాస్పద వీడియో వైరల్ గా మారింది.దీంతో వీడియో ని స్టేటస్ గా పెట్టిన యువకుడిని అరెస్ట్ చేయాలంటూ కొందరు వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సదరు యువకుడిపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు.
ఇదిలా ఉంటే వివాదాస్పద వీడియోను స్టేటస్‌గా పెట్టుకున్న యువకుడిని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఓ వర్గానికి చెందిన సుమారు వెయ్యి మంది అర్ధరాత్రి వేళ హుబ్లి పోలీస్ స్టేషన్ ను ముట్టడించారు. అంతటితో ఆగకుండా పోలీస్ స్టేషన్ పై, పోలీసులపై రాళ్ల దాడికి పాల్పడ్డారు.ఈ దాడిలో పోలీసుల వాహనాలను ధ్వంసం కాగా సీఐ సహా 12 మంది పోలీసులకు గాయాలయ్యాయి. వారిలో నలుగురు పోలీసులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
దీంతో అప్రమత్తమైన పోలీసులు అదనపు బలగాలను రప్పించి పరిస్థితిని అదుపు చేయడంతో పాటు, నగరంలో 144 సెక్షన్ విధించారు.సీసీటీవీ పుటేజీ ఆధారంగా దాడికి పాల్పడిన వారిలో 45 మందిని అరెస్ట్ చేశారు. అనంతరం ఆ వివాదాస్పద వీడియోను స్టేటస్‌గా పెట్టుకున్న యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.