స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో చీరాల నియోజకవర్గంలో వైసీపీ అధినేతకు కొత్త తలనొప్పులు ప్రారంభం అయ్యాయి. చీరాలలో టీడీపీ నుంచి వైసీపీ తీర్థం పుచ్చుకున్న ఎమ్మెల్యే కరణం బలరాంతో పాటు, వైసీపీ నాయకుడు ఆమంచి కృష్ణమోహన్, ఎమ్మెల్సీ సునీత వర్గాలు ఎవరికి వారే అన్న విధంగా వ్యవహరిస్తున్నారు. దీంతో కొన్ని గ్రామాల్లో మూడు గ్రూపుల నాయకుల మధ్య సమన్వయం లోపించింది. ఎవరికి వారే అన్న చందంగా తయారయ్యారు. చీరాల నియోజకవర్గంలో వైసీపీ నేతల మధ్య గ్రూపు తగాదాలు, టీడీపీకి లాభిస్తుందని సీఎం జగన్మోహన్‌రెడ్డి ఆందోళన చెందుతున్నారని తెలుస్తోంది. దీనిపై ప్రకాశం జిల్లా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో క్యాంపు కార్యాలయంలో సీఎం సుదీర్ఘంగా చర్చించినట్టు తెలుస్తోంది.
Must Read ;- వైసీపీ ఇంటర్నల్ ఫైట్: ఒకే ఒరలో మూడు కత్తులు..?
చీరాలలో ఎవరికి వారే..
చీరాల నియోజకవర్గంలో కొన్ని పంచాయతీల ఎన్నికలు వాయిదా పడ్డాయి. వేటపాలెం మండలం రామన్నపేటలో బలరాం వర్గీయులు, ఆమంచి వర్గీయులు నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో ఈ ఇద్దరి నేతల మధ్య నామినేషన్ల విషయంలో రగడ చోటు చేసుకుంది. ఇదే విషయాన్ని మంత్రి బాలినేని సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి కూడా తీసుకువెళ్లారని తెలుస్తోంది. ఆమంచి, కరణం ఎట్టి పరిస్థితుల్లో కలసి పనిచేసే అవకాశాలు కనిపించడం లేదని బాలినేని సీఎంకు వివరించారని సమాచారం. వారిద్దరి మధ్య మాటలు కూడా లేవని ఆయన సీఎంకు చెప్పారట. దీంతో చీరాల నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికలు ఏదో ఒకలాగా గట్టెక్కినా, త్వరలో జరగబోయే మున్సిపల్, జడ్పీ ఎన్నికల్లో వైసీపీకి గడ్డు పరిస్థితులు తప్పేలా లేవని తెలుస్తోంది.
వారిని కలపడం సాధ్యం కాదా?
చీరాలలో కరణం, ఆమంచి, సునీత వర్గాలను కలపడం సాధ్యపడేలా కనిపించడం లేదు. ముగ్గురు నేతలు కూడా ఎవరికి వారే అన్న విధంగా వ్యవహరిస్తున్నారు. సోషల్ మీడియాలో తమ తమ అభ్యర్థులకు మద్దతు ఇస్తున్నట్టు ప్రచారం చేసుకుంటున్నారు. కానీ ముగ్గురు నేతలూ కలసి ఒక అభ్యర్థిని నిలిపి గెలిపించే కార్యక్రమం చేయడం లేదని మంత్రి బాలినేని సీఎంకు వివరించారు. ముగ్గురు నేతల అభిప్రాయాలు ఒకసారి తీసుకోవాలని సీఎం భావిస్తున్నారని సమాచారం. ఆ తరవాత కరణం బలరాంకు కుదిరితే అద్దంకి ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది. దీని ద్వారా ఇద్దరు ప్రధాన నాయకుల మధ్య వైరానికి తెరపడినట్టవుతుందని వైసీపీ అధినేత భావిస్తున్నారట.
ప్రకాశంలో అందరూ బిజీగా ఉన్నారట..
ప్రకాశం జిల్లాలో 90 శాతం స్థానిక సంస్థలను వైసీపీ కైవసం చేసుకుంటుందని మంత్రి బాలినేని సీఎంకు భరోసా ఇచ్చినట్టు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు గెలుపొందిన నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించారు. అద్దంకిలో వైసీపీ ఇన్‌ఛార్జి చైతన్య, ఆయన తండ్రి గరటయ్య స్థానిక ఎన్నికల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారని మంత్రి బాలినేని సీఎంకు వివరించారని సమాచారం. ఇక కనిగిరి, గిద్దలూరు నియోజకవర్గాల్లో ఒకే సామాజికవర్గం వారిలో ఉన్న తీవ్రమైన అసంతృప్తిని దృష్టిలో ఉంచుకుని అక్కడ ఎమ్మెల్యేలు సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాలని సీఎం ఆదేశించారని తెలుస్తోంది. ఏది ఏమైనా చీరాల వ్యవహారం వైసీపీ అధినేతకు మింగుడు పడని వ్యవహారంలా తయారైందనే చెప్పవచ్చు.
Also Read ;- ఒత్తిళ్లు, వేధింపులు.. ఆర్థిక మూలాలే వైసీపీ టార్గెట్