ఒకే ఒక ఎన్నిక. ఇక దీని తర్వాత బహుశా మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు తప్పితే.. ఇంకోటి ఉండకపోవచ్చు. కేవలం ఖమ్మం, వరంగల్ వంటి కార్పొరేషన్ల ఎన్నికలు మాత్రమే ఉంటాయి. అవి ఆయా ప్రాంతాలకే పరిమితం అవుతాయి. కాని ఇప్పుడు జరుగుతున్న నాగార్జునసాగర్ ఉప ఎన్నిక మాత్రం రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. దుబ్బాకలో ఓటమి, గ్రేటర్‌లో ఎదురుదెబ్బల తర్వాత గులాబీ ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపుతో ఉత్సాహంగా బరిలోకి దిగుతోంది. మరోవైపు కాంగ్రెస్ తన అస్థిత్వం కోసం స్ట్రగుల్ పడుతోంది. బీజేపీ కొత్తగా పాగా వేయాలని వ్యూహాలు రచిస్తోంది. ఈ మూడు పార్టీల నడుమ నాగార్జునసాగర్ రాజకీయం హీటెక్కిపోయింది.
గురవయ్య యాదవ్ అయితేనే ఎదుర్కోగలడని..
నాగార్జునసాగర్ ఉప ఎన్నిక రాజకీయాలను బాగానే ప్రభావితం చేస్తోంది. టీఆర్ఎస్ ఏమీ తేలిగ్గా తీసుకోవడం లేదని అర్ధమవుతోంది. అందుకే దివంగత నోముల నర్సింహయ్య కుమారుడు భగత్‌నే పోటీకి పెట్టాలనుకున్నా.. దుబ్బాక అనుభవం నీడలా వెంటాడుతూనే ఉండటంతో… గురవయ్య యాదవ్‌నే అభ్యర్ధిగా పెట్టాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. గురవయ్య యాదవ్ అయితే మంచి సౌండ్ పార్టీ.. ఒకప్పుడు జానారెడ్డిపై గెలిచిన రామ్మూర్తి యాదవ్‌కి అల్లుడు. జానారెడ్డిని బలమైన అభ్యర్ధిగా టీఆర్ఎస్ ఫీలవుతోంది. అందుకే గురవయ్య యాదవ్ అయితేనే ఎదుర్కోగలడని డిసైడ్ అయింది. రేపో మాపో ఆయన పేరు అనౌన్స్ చేయబోతోంది. నోముల భగత్‌కు వేరే పదవి ఏదైనా ఆఫర్ ఇవ్వాలని కేసీఆర్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
గిరిజనుల ఓట్లు బాగా ఉండటంతో..
ఇక బీజేపీ అయితే డాక్టర్ రవినాయక్‌ను అభ్యర్ధిగా రంగంలోకి దింపబోతోంది. ఆ నియోజకవర్గంలో గిరిజనుల ఓట్లు బాగానే ఉండటంతో.. రవినాయక్‌ను బీజేపీ ఎంచుకుంది. రవినాయక్ ఇప్పటికే యాక్టివ్‌గా ప్రచారంలో తిరుగుతున్నారు. బీజేపీలో యాక్టివ్ గానే ఉన్నారు. అయితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చి.. టీఆర్ఎస్‌కు మేలు చేయడానికే రవినాయక్ ఉపయోగపడతారా అనే టాక్ కూడా వస్తోంది.
అందరి కంటే ముందే కాంగ్రెస్ రంగంలో..
ఇక జానారెడ్డి ఇప్పటికే నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. అందరి కంటే ముందే కాంగ్రెస్ రంగంలోకి దిగటంతో ఆ అడ్వాంటేజ్ ప్రచారంలో కనపడుతోంది. మరోవైపు టీఆర్ఎస్, బీజేపీలు ఇప్పటి వరకు అభ్యర్ధులను ఫైనల్ చేయడానికే టైమ్ తీసుకోవడంతో… అది కూడా కాంగ్రెస్‌కు ప్లస్ అయింది. కాకపోతే టీఆర్ఎస్ మాత్రం అధికారపార్టీ గాను.. స్థానికంగా బలంగా ఉండటంతో… గెలుపుపై కాన్ఫిడెన్స్‌గా ఉంది. పైగా బలమైన సామాజికవర్గం యాదవులకే టిక్కెట్ ఇవ్వడంతో.. గెలుపు ఈజీయేనని వారనుకుంటున్నారు. మరి జానారెడ్డి సీనియారిటీ ఎంతవరకు పని చేస్తుందో చూడాలి.
మరోవైపు డాక్టర్ రవినాయక్ .. కాంగ్రెస్ ఓట్లకే చిల్లు పెట్టేలా ఉన్నారు. ఎందుకంటే గతం నుంచి గిరిజనులు సంప్రదాయకంగా కాంగ్రెస్ ఓటు బ్యాంక్. మెజారిటీ ఓట్లు.. టీఆర్ఎస్ వచ్చాక కూడా కాంగ్రెస్‌కే పడ్డాయి. ఇప్పుడు రవినాయక్ ఆ ఓట్లను లాక్కుంటే.. జానారెడ్డికి కష్టాలు తప్పవు.
Must Read ;- కాంగ్రెస్ VS టీఆర్‌ఎస్ మధ్యలో బీజేపీ.. సాగర్ ఈదేదెవరో..?











