సినిమాని మనం ప్రేమిస్తే.. సినిమా మనల్ని ప్రేమిస్తుంది. షెట్టి త్రయం చేసింది అదే. రిషబ్ షెట్టి, రాజ్ బి షెట్టి, రక్షిత్ షెట్టి.. వీరే ఆ త్రయం. యావత్ భారత్ దేశంలో నిన్నటి దాకా రిషబ్ షెట్టి పేరు తెలిసింది కొందరికే.
కాంతారా సినిమాతో రిషబ్ షెట్టి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యారు. హిట్.. సూపర్ హిట్.. సూపర్ డూపర్ హిట్… ఇక దీని తర్వాత ఏమీ ఉండవేమో అనుకుంటాం.. వీటి తర్వాత చాలా కొత్త పదాలు అవసరం ఉందని ఇప్పుడు అనిపిస్తోంది. కాంతారా విజయంతో ఇప్పుడు చర్చించాల్సిన అవసరం వస్తోంది. రిషబ్ షెట్టి ఏ స్థాయి హీరోనో చర్చించాల్సిన రోజు వచ్చింది. మన ప్రయాణం ఎక్కడ మొదలు పెట్టామో ఎవరికీ తెలియకపోవచ్చు.. మనం గమ్యం చేరుకున్నాక ఆ మొదటి ప్రయాణం గురించి అందరికీ తెలిసిపోతుంది.
రిషబ్ షెట్టి, రాజ్ బి షెట్టి, రక్షిత్ షెట్టిల విషయంలో జరిగింది అదే. వీరు ముగ్గురూ విడి విడిగా నటించిన కాంతారా, చార్లీ 777, గరుడ గమన వృషభ వాహన చిత్రాలు ఓ కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించాయి. నిన్నటి దాకా కేజీఎఫ్ ఈరోజు కాంతారా సక్సెస్ తో అందరూ ‘ఎవరు వారు ఎచటి వారు ఇటు వచ్చిన కన్నడి వారు’ అనుకుంటున్నారు.
పేర్లలో ఉన్న పోలిక చూసి వీరు ముగ్గురూ అన్నదమ్ములేమో అనుకుంటారు.. కానీ కాదు. కన్నడ చిత్ర పరిశ్రమలో ఇప్పుడు వీరు ముగ్గురిదే హవా. ఒకే ఏడాదిలో ముగ్గురూ మూడు హిట్లు ఇచ్చారు. కేజీఎఫ్ దెబ్బతో కన్నడ చిత్ర పరిశ్రమ రూటు మారింది. తమ సొంత కథలకే ప్రయారిటీ ఇస్తున్నారు.
ఈ ముగ్గురిదీ రక్త సంబంధం కాకపోయినా సినిమా సంబంధం ఏర్పడింది. ఒకరి సినిమాలో ఇంకొకరు నటించడం, ఒకరి సినిమాకి ఒకరు సహకారం అందించుకోవడం లాంటివి చేస్తుంటారు. రాజ్ బీ శెట్టి హీరోగా నటించి దర్శకత్వం వహించిన గరుడ గమన వృషభ వాహన సినిమా పెద్ద హిట్. ఇందులో రిషబ్ శెట్టి కూడా ఓ కీలకపాత్ర పోషించాడు. రక్షిత్ శెట్టి హీరోగా నటించిన చార్లీ 777 సినిమా అంతే పెద్ద హిట్. ఇప్పుడు రిషబ్ వంతు వచ్చింది. కాంతారా చిత్రంతో అతను ఎంతో ఎదిగిపోయాడు. పైగా దీనికి కథ, దర్శకత్వంతో పాటు హీరోగా చేసి కొత్త రికార్డు సృష్టించాడు. ఈ ముగ్గురూ దక్షిణ కన్నడ వాసులు. షార్ట్ ఫిలిమ్స్ తో రక్షిత్ కెరీర్ ప్రారంభమైంది. ఆ తర్వాత దర్శకుడిగా 2014లో ఉలిదవరు కందంటేతో పరిచయమయ్యాడు. క్రైమ్ డ్రామా కిర్రాక్ పార్టీతో రిషబ్ షెట్టి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. అంతకుముందు నటుడిగా రక్షిత్ తో స్క్రీన్ పంచుకున్నాడు. రిషబ్, రాజ్ ల బంధం 2017లో ఏర్పడింది. తన సర్కారీకి డైలాగులు రాయమనడంతో రాజ్ ఆ ప్రయత్నం చేశాడు. ఈ ముగ్గురూ యక్షగానం, రంగస్థల నృత్య నాటకం,ఇతర స్థానిక కళారూపాల చుట్టూ పెరిగారు.
ఉడిపికి 40 కిలోమీటర్ల దూరంలోని కుందపురాలోని కెరడి గ్రామంలో యక్షగాన ప్రదర్శనలో సుబ్రమణ్య స్వామి పాత్రను పోషించినప్పుడు రిషబ్ ఆరో తరగతి చదువుతున్నాడు. వీరిలో చిన్నవాడైన రాజ్ మంగళూరుకు వెళ్లడానికి ముందు షిమోగా సమీపంలోని భద్రావతిలో పెరిగాడు. యక్షగానం, భూతకోలా, నృత్యం, సంగీతం వంటి అనేక కళలున్న మంగుళూరు అంటే తనకెంతో ఇష్టమంటాడు రాజ్. 2017 నుంచి వీరి ముగ్గురి మధ్య విడదీయరాని స్నేహబంధం ఏర్పడింది. రాజ్ లోని ప్రతిభను గమనించి తన సర్కారీకి డైలాగులు రాయమని రిషబ్ ప్రోత్సహించాడు. పది నిమిషాల్లో పది సన్నివేశాలకు డైలాగులు అలవోకగా రాసేశాడట రాజ్. రిషబ్, రక్షిత్ ల గురించి తెలుసుకోవలంటే ఇంకా వెనక్కి వెళ్లాల్సిందే. 2011-2012లో రక్షిత్ ఇంజినీరింగ్ చేసి సినిమాల్లో వేషాల కోసం కోసం ప్రయత్నిస్తున్నాడు. అదే సమయంలో బెంగళూరులోని ప్రభుత్వ ఫిల్మ్ అండ్ టీవీ ఇన్ స్టిట్టూట్ లో డైరెక్షన్ లో డిప్లొమ చేసిన రిషబ్ బెంగళూరులో బతుకు తెరువు కోసం అనేక పనులు చేసేవాడు. వాటర్ క్యాన్లు అమ్మడం మొదలుకుని రియల్ ఎస్టేట్ వ్యవహారాల వరకు చేసేవాడు.
అరవింద్ కౌశిక్ రూపొందించే తుగ్లక్ సెట్ లో వీరిద్దరూ కలుసకున్నారు. ఇందులో రక్షిత్ హీరోగా, రిషబ్ విలన్ గా నటించారు. తమ సినిమా విషయంలో ప్రేక్షకుల స్పందన ఎలా ఉందో తెలుసుకునేందుకు ప్రతిరోజూ త్రిభువన్ థియేటర్ కు వెళ్లి ముందు వరసలో కూర్చుని సినిమా చూసేవారట. 2014లో కల్ట్ క్లాసిక్ ఉలిదవరు కందంటేలో కలిసి పనిచేశారు. 2016లో కిర్రాక్ పార్టీ చేశారు. దీనికి ఇప్పుడు సీక్వెల్ కూడా వస్తోంది. ఉలిదవరు చిత్రానికి కొనసాగింపుగా రక్షిత్ ఇప్పుడు రిచర్డ్ ఆంథోనీ చేస్తున్నాడు. ఈ ముగ్గురిలోనూ ఎన్నో సారూప్యతలు ఉన్నాయి. వీరు రాస్తారు, నటిస్తారు, దర్శకత్వం వహిస్తారు. సినిమాకి వెలుపల మాత్రం ముగ్గురివీ వేర్వేరు దృక్కోణాలు. భారతీయ పురాణాలంటే రక్షిత్ కు ఎంతో ఇష్టం.. అందుకే అతను ఆధ్యాత్మిక వాది. ఇక రాజ్ విషయానికి వస్తే వంట చేయడం, క్రికెట్, వాలీబాల్ ఆడటం, కుక్కలతో ఎక్కువ సమయం గడపడం ఇష్టం. రిషబ్ కు ఇవేవీ ఉండవు. తనకు ఏది తోస్తే అది చేస్తాడు.
రక్షిత్ తన చార్లీ 777 సినిమాలో ధర్మ పాత్రతో ప్రేక్షకుల గుండె లోతుల్ని స్పృశించాడు. నటనలో అందులోని కుక్క కూడా అతన్ని మించి పోయింది. ఇక రిషబ్ విషయానికి వస్తే కాంతారాలోని శివ పాత్రతో అతను శివతాండవమే చేశాడు. అందుకే భారతీయ సినిమా వీరి ముగ్గురి గురించి మాట్లాడే రోజు వచ్చింది. అంకెలు తొమ్మిదే ఉన్నా అనంతమైన సంఖ్యలకు ఎలా దారి తీస్తాయో.. నవ రసాలు అనే తొమ్మిది అనంతమైన రసాలను పుట్టిస్తాయి. అప్పుడే రసాస్వాదన కలుగుతుంది. శెట్టి త్రయం సత్తా ఏమిటో ఇప్పుడు తెలిసింది… అసలు ఫ్లాష్ బ్యాక్ ఇప్పుడు మొదలవుతుంది. కాంతారా నుంచి ప్రేక్షకులు వెనక్కి వెళ్లడం మొదలుపెట్టారు. వీరు చేసిన సినిమాలన్నీ చూడటం మొదలుపెట్టారు. కాబట్టి కుక్కపిల్ల, అగ్గిపుల్ల, సబ్బు బిళ్ల… కాదేదీ సినిమాకి అనర్హం. సినిమా ఫార్ములానే వీరు మార్చేస్తున్నారు.. కొంగొత్త లోకానికి దారులు తెరుస్తున్నారు.