పేదవాని సొంతింటి కల రాజకీయ క్రీనీడలో చిక్కుకుంది. అక్రమాలు అరికట్టడానికి రివర్స్ టెండరింగ్ అని వైసీపీ., మా మీద కోపంతో పేదల ఆశల్ని సమాధి చేయొద్దని టీడీపీ…, మీ పంతాలకు పేదల బతుకుల్ని ఎందుకు ఛిద్రం చేస్తున్నారని వామ పక్షాలు ఆందోళనకు దిగుతున్నాయి. అయినా.., నెల్లూరు జిల్లాలో టిడ్కో హౌసింగ్ నిర్మాణాల్లో మాత్రం కదలిక రావడం లేదు.
నాలుగేళ్లుగా ఎదురు చూపులు..!
నెల్లూరు జిల్లాలో టీడీపీ హయాంలో.., 58,235 ఇళ్లు మంజూరయ్యాయి. వీటిలో 17,415 నిర్మాణాలు పూర్తయ్యాయి. నెల్లూరు నగరపాలక సంస్థ, జిల్లాలోని పురపాలక సంఘాల పరిధిలో నాలుగేళ్ల కిందటే నిర్మాణాలు ప్రారంభించగా వాటిలో చాలా ఇళ్ల నిర్మాణం పూర్తయి రెండేళ్లకు పైగా అయ్యింది. ఎన్నికలకు కొన్ని నెలల ముందు లబ్ధిదారులకు టీడీపీ ప్రభుత్వం ఇళ్లు కేటాయించగా, వారు తమ సొంత ఇళ్లలో పాలు కూడా పొంగించారు. ఆ తర్వాత ఎన్నికలు రావడం, కొత్త ప్రభుత్వం కొలువుదీరడంతో గృహప్రవేశాలు ఆగిపోయాయి. పూర్తయిన ఇళ్లలో చేరుతామని, తాళాలు ఇవ్వాలని లబ్ధిదారులు రెండేళ్లుగా కోరుతున్నా.., వైసీపీ ప్రభుత్వం వారికి నేటికీ స్పష్టత ఇవ్వడం లేదు.
దీంతో నెల్లూరు నగరం, కావలి, గూడూరు, నాయుడుపేట, ఆత్మకూరు, సూళ్లూరుపేట, నాయుడుపేట పట్టణాల్లోని గృహ సముదాయాల్లో చిల్లచెట్లు పెరిగాయి. కొన్నిచోట్ల గృహాల అద్దాలు పగిలిపోయాయి. కిటికీలు, విద్యుత్తు సామగ్రి మాయమై అంధవికారంగా కనిపిస్తున్నాయి. ఏడాదిన్నరగా ఇళ్లు ఇస్తామని ప్రభుత్వం చెబుతున్నా నేటికీ ఆచరణకు నోచుకోలేదని లబ్ధిదారులు వాపోతున్నారు. కనీసం పూర్తి చేసిన ఇళ్లను ఇస్తే తమకు అద్దెల భారం తగ్గి కుటుంబ ఖర్చులు తగ్గుతాయని లబ్ధిదారులు కోరుతున్నారు.
Also Read ;- ఎట్టెట్టా జయరాం! ఇట్టినా భూములు మింగినది ఇట్టేనా?
గతంలో నో అన్న కలెక్టర్ పై బదిలీ వేటు..!
ఇళ్ల పట్టాల పంపిణీ కోసం ప్రభుత్వం సేకరించిన భూములపై అవినీతి మరకలు కనిపిస్తున్నాయి. అధికార పార్టీ నేతలు ఈ భూముల కొనుగోళ్లలో అధికారులపై ఒత్తిడి తెచ్చి, అధిక ధరకు ప్రభుత్వం నుంచి కొనుగోలు చేయించి, ప్రజా ధనాన్ని జేబులో వేసుకుంటున్నారు అని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి ఉదాహరణగా గతంలో వైసీపీ నేతలు ఒత్తిడి తలొగ్గని కలెక్టర్ శేషగిరి బాబు, జేసీ వినోద్ కుమార్ లపై పడిన బదిలీ వేటు నిదర్శనం. కావలి రైల్వే లైన్ అవతల వైపు తిప్ప పరిధిలో గల 115 ఎకరాలను వైసీపీ నేతలు ఇంటి స్థలాల కోసం ఎంపిక చేశారు.
భూమిలో కొంత విస్తీర్ణానికి గతంలో భూ వినియోగ మార్పిడికి అనుమతించారు. దీంతో ఆ భూమి మొత్తం విలువ పెరిగిపోయింది. లేదంటే రిజిష్టర్ ఆఫీసు రికార్డు ప్రకారం ఎకరం రూ.12 లక్షలు మాత్రమే వచ్చేది. కానీ, ఆ ధర ఎకరాకు రూ.24 లక్షలు పెరిగింది. దీన్ని కూడా కాదని.., రాజకీయ నేతలు ఒత్తిడితో పేదల ఇళ్ల పట్టాల పంపిణీకోసం ఈ స్థలాన్ని ఎకరం ధర రూ.60 లక్షలు అని చెప్పి.. రూ.55 లక్షలకు తగ్గించారు. ఈ ఫైలుపై సంతకం పెట్టాల్సిందిగా అప్పటి నెల్లూరు కలెక్టర్ శేషగిరిబాబుపై ఒత్తిడి తెచ్చారు. ఇది తన మెడకు చుట్టుకుంటుందని అర్థమైన ఆయన… సెలవు పెట్టి వెళ్లిపోయారు. ఆయన సెలవులో ఉండగానే ట్రాన్స్ ఫర్ జరిగింది. ఇది మచ్చుకు ఓ నియోజకవర్గంలో జరిగిన సంఘటన. పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీలో ప్రతి నియోజకవర్గంలోనూ ఇలాంటి వివాదాస్పద భూముల కొనుగోళ్లు చాలా జరిగాయని ప్రతి పక్షాలు ఆరోపిస్తున్నాయి.
ఇళ్ల పట్టాల పంపిణీపై ప్రభుత్వం దృష్టి…!
టిడ్కో హౌసింగ్ నిర్మాణాలను పక్కన పెట్టిన వైసీపీ ప్రభుత్వం ఇళ్ల పట్టాల పంపిణీపై దృష్టి సారించింది. ఇప్పటికే జిల్లాలో అనేక చోట్ల ప్లాట్లు వేసి.., 2,00,000 మందికి పట్టాలు ఇవ్వడానికి వెంచర్లు కూడా సిద్ధం చేస్తున్నారు. కానీ, అధిక భాగం వెంచర్లు ముంపు ప్రాంతాల్లో వేయడం వలన ప్రజలు వీటిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అసలు పూర్తైన టిడ్కో ఇళ్లలో అనర్హుల పేర్లు ఉంటే వాటి తొలగించి అర్హులకు ఇవ్వొచ్చు కదా.., ఈ ముంపు ప్రాంతాల్లో ఇళ్ల పట్టాలు ఇచ్చి మా బతుకులతో ఎందుకు ఆడుకోవడం అని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చూడాలి…, ఇప్పటికైనా ప్రభుత్వం టిడ్కో నిర్మాణాలు పూర్తిచేసి పేదలకు అందిస్తుందో..? లేక తను అనుకున్నట్లే ఇళ్ల పట్టాల పంపిణీపై మాత్రమే దృష్టి పెట్టి.. పేదల ఆశలను నిండా. మూయించుతుందో అంటే వేచి చూడాల్సిందే…!
Also Read ;- సీఎస్‌కు బాబు లేఖ : ఇళ్ల స్థలాల కొనుగోళ్లలో భారీ కుంభకోణం!