తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు జారీ చేస్తున్న సర్వదర్శనం టోకెన్లను టిటిడి నిలిపివేసింది. ఈనెల 30 తేదీ వరకు సర్వదర్శనం టోకెన్లను నిలిపివేస్తున్నట్లు శనివారం సాయంత్రం టీటీడీ అధికారికంగా ప్రకటించింది. కేవలం ఆన్లైన్లో బుక్ చేసుకున్న భక్తులకు మాత్రమే దర్శనం ఉంటుందని స్పష్టం చేసింది.
తిరుమలలో గత మార్చి 17వ తేదీన ఒక భక్తునికి కరోనా లక్షణాలు కనిపించడంతో శ్రీవారి దర్శనాలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. తర్వాత జూన్ నెలలో మూడో వారం నుంచి పరిమితంగా భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతిస్తున్నారు. గత వారం వరకు రోజుకు 12 వేల మంది భక్తులకు టోకెన్లు జారీ చేశారు. అయితే అయితే తిరుపతిలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు అవుతుండడంతో, టోకెన్లు పొందినప్పటికీ భక్తులు చాలామంది దర్శనానికి రాలేదు. గత నెల 28 తేదీన జరిగిన పాలకమండలి సమావేశంలో రోజుకు మూడు వేల సర్వదర్శనం టోకెన్లు ఇవ్వాలని నిర్ణయించింది.
ఈ మేరకు గత శనివారం నుంచి తిరుపతిలో భూదేవి కాంప్లెక్స్ వద్ద సర్వదర్శనం టోకెన్లు ఇస్తున్నారు. ఇందుకోసం వేలాది మంది భూదేవి కాంప్లెక్స్ వద్ద గంటల తరబడి ఎదురుచూస్తున్నారు.అయితే తిరుపతిలో పాజిటివ్ కేసులు తగ్గకపోగా, పెరటాసి నెల మొదలు కావడంతో తమిళనాడు నుంచి భక్తులు అదిక సంఖ్యలో వస్తున్నారు. అంతేకాక ఈ నెల 18 తేదీ నుంచి బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించాలి ఉంది. వీటన్నింటి నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా తిరుపతిలో సర్వ దర్శనం టోకెన్లు జారీని నిలిపివేస్తూ టిటిడి నిర్ణయం తీసుకుంది. దీంతో కేవలం ఆన్లైన్లో బుక్ చేసుకున్న భక్తులకు మాత్రమే సి వారి దర్శనం లభించనుంది.











