తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యిలో కల్తీ జరిగిందన్న ఇష్యూ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఐతే ఈ కేసులో ఇప్పుడు షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. అత్యంత పవిత్రమైన శ్రీవారి లడ్డూ ప్రసాదం కోసం వైసీపీ హయాంలో సరఫరా చేసినది కల్తీ నెయ్యి కాదు, అసలు నెయ్యే కాదని తేలింది. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు నియమించిన సీబీఐ సిట్ కోర్టుకు తెలిపింది. కెమికల్స్‌తో నెయ్యిలా కనిపించే మిశ్రమాన్ని తయారు చేసే బోలేబాబా డెయిరీ వాటిని వైష్ణవి, AR డెయిరీల పేరుతో టీటీడీకి సరఫరా చేసిందని CBI సిట్ స్పష్టం చేసింది. నిందితుల బెయిల్ పిటిషన్లను కొట్టి వేయాలని చెబుతూ దాఖలు చేసిన అఫిఢివిట్ లో ఈ సంచలన విషయాలు ఉన్నాయి.
నిజానికి భోలేబాబా డెయిరీకి పాలు, నెయ్యి ఉత్పత్తి చేసే వ్యవస్థ లేవని స్పష్టం చేసింది సీబీఐ సిట్. తమ నుంచి పాలు సేకరించలేదని రైతులే చెప్పారంది. భోలేబాబా డెయిరీ కేవలం పామాయిల్, రసాయనాలు, ముడిపదార్థాలతో నకిలీ నెయ్యి తయారుచేసి ఏఆర్ డెయిరీ, వైష్ణవి డెయిరీ ద్వారా తితిదేకి సరఫరా చేసినట్లు తమ విచారణలో తేలిందని పేర్కొంది సిట్. ముందుగా రచించిన ప్రణాళిక ప్రకారమే ఏఆర్ డెయిరీ, వైష్ణవీ డెయిరీ ముందుపెట్టి భోలేబాబా డెయిరీ వ్యవహారాన్ని నడిపింది
ఈ నెయ్యి మాఫియా ..సాక్షుల్ని బెదిరిస్తోంది. సాక్షులు వేసినట్లుగా తప్పుడు పిటిషన్లు వేస్తోంది. ఎవరూ సీబీఐ సిట్ ముందు హాజరు కాకుండా.. కాపలా కాస్తున్నారు. ఈ కేసులో సాక్షిగా ఉన్న సంజీవ్ జైన్ తిరుపతి ఎయిర్ పోర్టులో దిగితే అతన్ని కిడ్నాప్ చేసి..చెన్నై తీసుకెళ్లి ఢిల్లీ ఫ్లైట్ ఎక్కించారట. మరో వ్యక్తి పేరుతో తప్పుడు పిటిషన్ దాఖలు చేశారు. ఆ వ్యక్తి తాను పిటిషన్ దాఖలు చేయలేదని హైకోర్టుకు ఫిర్యాదు చేశారు.
వైసీపీ హయాంలో శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని కూడా కల్తీ చేశారని చంద్రబాబు ఆరోపించినప్పుడు వైసీపీ నేతలు భగ్గుమన్నారు. దేవుడిని కించ పరుస్తున్నారని ఆరోపించారు. ఎంత తప్పు చేసినా బయటకు చెప్పరని అనుకున్నారు. కానీ అసలు చేసిన ఘోరం గురించి ప్రజలకు తెలియాలని చంద్రబాబు చెప్పారు. వారు సుప్రీంకోర్టు వరకూ వెళ్లారు. సుప్రీంకోర్టు సిట్ ను నియమించింది. ఆలస్యంగా జరుగుతున్నా అన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
అసలు ఆ నెయ్యిని టీటీడీ ఎందుకు తీసుకుంది అన్న దగ్గర నుంచి పూర్తి వివరాలను సీబీఐ సిట్ త్వరలోనే బయట పెట్టనుంది. వైవీ సుబ్బారెడ్డి మాజీ పీఎను కూడా ప్రశ్నిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంతో పాటు టీటీడీలో జరిగిన అన్ని దందాలు బయటకు రానున్నాయి. నెయ్యి మాఫియా స్థానిక ముఠానేనని స్పష్టమవుతోంది. త్వరలోనే అందరి లెక్కలు తేలనున్నాయి.