ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుపతికి వచ్చే శ్రీవారి భక్తుల వసతి కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు ఆధ్యాత్మిక నగరి రూపురేఖలను సమూలంగా మార్చేలా కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతిలో సుమారు రూ.3,200 కోట్ల భారీ వ్యయంతో నిర్మించతలపెట్టిన ఇంటిగ్రేటెడ్ పిలిగ్రిమ్ టౌన్‌షిప్, TTD ఉద్యోగుల లేఅవుట్‌లో మౌలిక వసతుల కల్పన, తుడా మాస్టర్ ప్లాన్ రహదారుల విస్తరణ పనులకు సీఎం చంద్రబాబు వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేయనున్నారు. ప్రస్తుతం తిరుమలకు రోజూ 80 వేల నుంచి 90 వేల మంది భక్తులు వస్తుండటంతో కొండపై అందరికీ వసతి దొరకడం కష్టంగా మారింది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు తిరుపతిలోని అలిపిరి సమీపంలో ఉన్న SV జూపార్కు వద్ద 20 ఎకరాల విస్తీర్ణంలో రూ.2,750 కోట్లతో ఈ మెగా పిలిగ్రిమ్ టౌన్‌షిప్‌కు శ్రీకారం చుట్టారు.
ఈ భారీ టౌన్‌షిప్ ద్వారా ఒకేసారి ఏకంగా 26 వేల మంది భక్తులకు వసతి సౌకర్యం అందుబాటులోకి రానుంది. ఇందులో జి+9 విధానంలో నిర్మించే నాలుగు బ్లాకుల్లో 10 వేల మందికి, జి+4 విధానంలో నిర్మించే మరో నాలుగు పిల్‌గ్రిమ్ ఎమినిటీ కాంప్లెక్స్ బ్లాకుల్లో 16 వేల మంది భక్తులకు వసతి సౌకర్యాలు కల్పిస్తారు. సొంత వాహనాల్లో తిరుపతికి వచ్చే భక్తుల కోసం జి+5 అంతస్తుల్లో దాదాపు 4,500 వాహనాలు పట్టేలా మల్టీలెవల్ పార్కింగ్ సదుపాయం నిర్మిస్తున్నారు. దీనికి తోడు జి+3 భవనంలో సెంట్రలైజ్డ్ కిచెన్‌తో ఒకేసారి 6,000 మంది అన్నప్రసాదాలు స్వీకరించేలా భవనాన్ని అందుబాటులోకి తెస్తున్నారు. కొండపైకి వెళ్లే భక్తుల కోసం జి+2 విధానంలో 30 బస్ బేలను ఏర్పాటు చేయడంతో పాటు శ్రీవారి వైభవాన్ని చాటిచెప్పేలా డిజిటల్ మ్యూజియం, థియేటర్, గ్యాలరీలను కూడా ఈ ప్రాజెక్ట్‌లో పొందుపరిచారు.
మరోవైపు వడమాలపేట మండలం పాదిరేడు అరణ్యం వద్ద 432 ఎకరాల పరిధిలో ఇళ్ల స్థలాలు పొందిన 5,192 మంది టీటీడీ ఉద్యోగుల దశాబ్దాల నిరీక్షణకు సీఎం చంద్రబాబు మౌలిక వసతుల కల్పన ద్వారా తెరదించారు. స్థలాలు ఇచ్చినా మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్న ఉద్యోగుల విజ్ఞప్తిపై సీఎం సానుకూలంగా స్పందించారు. టీటీడీ బోర్డు ఛైర్మన్ బి.ఆర్.నాయుడు, అధికారుల సమక్షంలో తీసుకున్న నిర్ణయం మేరకు సుమారు రూ.230 కోట్ల వ్యయంతో ఈ లేఅవుట్‌లో పక్కా బీటీ రోడ్లు, డ్రెయిన్లు, వర్షపు నీటి కాల్వలు, మంచి నీటి పైప్‌లైన్లు, భూగర్భ మురుగునీటి వ్యవస్థ, విద్యుత్ లైన్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తున్నారు.
తిరుపతి నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకుని, తిరుచానూరు ఆలయానికి వెళ్లే రహదారులతో పాటు నగరంలోని ముఖ్యమైన మార్గాలను విస్తరించేందుకు తుడా సిద్ధమైంది. సుమారు రూ.250 కోట్ల వ్యయంతో చేపట్టనున్న మాస్టర్ ప్లాన్ రహదారుల అభివృద్ధి పనులకు కూడా చంద్రబాబు శ్రీకారం చుడుతున్నారు. తుడా, టీటీడీల ఉమ్మడి భాగస్వామ్యంతో చేపడుతున్న ఈ భారీ అభివృద్ధి ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే శ్రీవారి భక్తులకు వసతి, రవాణా కష్టాలు తీరడమే కాకుండా, తిరుపతి ఆధ్యాత్మిక నగరిగా సరికొత్త శోభను సంతరించుకోనుంది.











