విహారయాత్రకు మాల్దీవులకు వెళ్లిన పలువురు సినీ తారలు తిరిగి తాము ఉంటున్న ఊర్లకు తిరిగొచ్చేశారు కోవిడ్ కారణంగా గత తొమ్మిది నెలలుగా అన్ని భాషల చిత్రాల షూటింగులు ఆగిపోయి…కొద్ది రోజుల క్రితం కొన్ని చిత్రాల షూటింగులు ఇప్పటికే మొదలు కాగా ఇంకొన్ని ఇప్పుడిప్పుడే మొదలు కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో మళ్లీ షూటింగులోకి ప్రవేశించే లోపు హాలీడేస్ ఉన్న తారలు కాస్త ఆటవిడుపుగా కొద్దిరోజుల పాటు విహార యాత్రలు చుట్టి వచ్చారు. అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్, కోలీవుడ్ తారలు సంఖ్యాపరంగా ఎక్కువ మంది ఈ సారి మాల్దీవులను ఎంచుకోవడం ఓ విశేషం.
ఈ వరుసలోనే తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన తాప్సి పన్ను ఇప్పడు ఎక్కువగా బాలీవుడ్ చిత్రాలను చేస్తున్న విషయం తెలియంది కాదు. అయితే మొదట్లో తనకు అవకాశాలు ఇచ్చి, తనకు మంచి కెరీర్ ను ప్రసాదించిన టాలీవుడ్, కోలీవుడ్ లను మరచిపోకుండా అడపాదడపా ఇక్కడి సినిమాలను అంగీకరిస్తోంది తాప్సి కూడా ఇటీవల మాల్దీవులలో కొద్దిరోజుల పాటు విహరించి తిరిగి తన చిత్రాల షూటింగులలో పాల్గొనేందుకు ముంబైకి చేరుకుంది.
అలాగే మరో అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఇటీవల కొద్దిరోజులు మాల్దీవులలో ఆహ్లాదభరితంగా షికారు చేసి తన షూటింగుల నిమిత్తం తిరిగి వచ్చేసింది. ప్రస్తుతం రకుల్ తెలుగులో రెండు సినిమాలు, హిందీలో మూడు సినిమాలు ఇంకా తమిళంలోనూ చేస్తోంది. ఇక నాగచైతన్య, సమంత దంపతులు కూడా ఇటీవల మాల్దీవులలో సందడి చేశారు. నాగచైతన్య బర్త్ డే సందర్భంగా సరదాగా గడిపి రావాలని ఈ దంపతులు మాల్దీవులను తమ విహారానికి ఎంచుకున్నారు. ఎప్పటికప్పుడు అక్కడ వారు తీసుకున్న ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు కూడా. దాదాపు వారం రోజులపాటు అక్కడ ఉల్లాసంగా గడిపిన ఈ జంట తిరిగి హైదరాబాద్ చేరుకుంది.
హైదరాబాద్ ఎయిర్ పోర్టులో ఈ జంటను చూసిన వారు తమ మొబైల్ కెమెరాలను క్లిక్ మనిపించారు. ఇక నాగచైతన్య నటించిన `లవ్ స్టోరీ’ చిత్రం విడుదలకు సిద్ధమౌతోంది. దీనికి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. దీని తర్వాత విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ‘థాంక్యూ’ అనే చిత్రంలో నాగచైతన్య నటించబోతున్నారు.
సమంత విషయానికి వస్తే.. `ఆహా’ ఓటీటీ ప్లాట్ ఫామ్ కోసం `సామ్ జామ్’ వెబ్ సిరీస్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో పాటు కోలీవుడ్లో విజయ్ సేతుపతి హీరోగా నటించనున్న చిత్రంలోనూ ఆమె నటించనున్నారు. వీరే కాకుండా మాల్దీవులకు విహారానికి వెళ్లిన ఇంకొందరు తారలు కూడా స్వస్థానాలకు చేరుకొని తిరిగి తమ చిత్రాల షూటింగులలో పాల్గొనేందుకు సన్నద్ధమవుతున్నారు..