సినిమా రంగ సమస్యలపై ఏపీ సీఎం జగన్మోహనరెడ్డితో భేటీకి సినీ పెద్దలు సమాయత్తమవుతున్నారు. సెప్టెంబరు 4న ఈ భేటీ జరగనుంది. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, దిల్ రాజు, సురేష్ బాబు తదితర సినీ పెద్దలు ఈ భేటీలో పాల్గొననున్నారు. ఈ సమావేశంలో ఎలాంటి అంశాలను చర్చించాలన్నదానిపై కసరత్తులు పూర్తి చేశారు. ఇప్పటిదాకా చిన్న సినిమాలే విడుదలయ్యాయికానీ పెద్ద సినిమాలనను మాత్రం విడుదల చేయలేదు. అక్టోబరులో పెద్ద సినిమాల విడుదలకు రంగం సిద్దమవుతోంది. అందువల్ల ఈలోపు చర్చలు పూర్తి చేసి 100 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లను సిద్ధం చేయించాలన్న యోచనలో సినీ పెద్దలు ఉన్నారు.
దీనిపై మెగాస్టార్ ఇంట్లోనే సినీ పెద్దలంతా సమావేశమై చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. సెకండ్ వేవ్ తర్వాత కొన్ని సినిమాలు విడుదలైనా వాటికి లభించిన స్పందన అంతంత మాత్రమే. థియేటర్లనీ ఇంకా తెరవలేదు. కొన్ని థియేటర్లను మాత్రమే ప్రారంభించారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రాగానే మిగిలిన థియేటర్లను ప్రారంభించడానికి ఎగ్జిబిటర్లు సిద్ధంగా ఉన్నారు. పెండింగ్ సమస్యల పరిష్కారం దిశగా పావులు కదుపుతున్నారు. తెలంగాణ వరకూ ఎలాంటి ఇబ్బందీ లేదు. ఏపీలో మాత్రం ప్రధానంగా టిక్కెట్ల రేట్ల విషయంలో సందిగ్ధం నెలకొంది. విద్యుత్ బకాయిలు మాఫీ చేయమని అడుగుతున్నారు.
ప్రధాన సమస్యలన్నీ సీఎం ముందు ఉంచి వాటికి ఎలాంటి పరిష్కార మార్గాన్ని లభిస్తుందో తెలుసుకున్న తర్వాతే ఏపీలో పూర్తి స్థాయిలో థియేటర్లు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అక్టోబరు మొదటి వారం నుంచే పెద్ద సినిమా విడుదల సందడి ప్రారంభమవుతుంది. అప్పటికీ క్లారిటీ రాకపోతే పెద్ద సినిమా వాయిదా అనివార్య మవుతుంది. విడుదలయ్యే వాటిలో మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’, బాలకృష్ణ ‘అఖండ’, మల్టీస్టారర్ మూవీ ట్రిపుల్ ఆర్ లాంటివి ఉన్నాయి.
Must Read ;- ఇంటిలోనే సినిమా ‘హాలు’.. ఎంతలో ఎంత మార్పు?