‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్ లో సెన్సేషన్ హిట్ అందుకొని.. సూపర్ డెబ్యూ హీరో అనిపించుకున్నాడు మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ. తొలి సినిమాతోనే రూ. 100కోట్ల క్లబ్ లోకి అవలీలగా చేరుకున్న అతడితో.. సినిమాలు చేయడానికి టాలీవుడ్ నిర్మాతలు పోటీ పడుతున్నారు. ఆల్రెడీ క్రిష్ దర్శకత్వంలో రెండో సినిమా టాకీ పార్ట్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. దీని తర్వాత రెండు సినిమాలు లైన్ లో ఉన్నాయి. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ మూవీ కి వైష్ణవ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆ సినిమాని తమిళ దర్శకుడు గిరీశయ్య డైరెక్ట్ చేయబోతున్నాడట.
విక్రమ్ తనయుడు ధ్రువ్ ఆదిత్యవర్మ సినిమాతో కోలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. నిజానికి అంతకన్నా ముందు బాలా దర్శకత్వంలో రూపొందిన ‘వర్మ’ సినిమా ఔట్ పుట్ సరిగా రాని కారణంగా.. అప్పటికప్పుడు దర్శకుడ్ని మార్చి.. మళ్ళీ ఫ్రెష్ గా సినిమాను మొదలు పెట్టారు. అలా తెరకెక్కిన సినిమానే ఆదిత్య వర్మ. దీంతో గిరీశయ్య అనే దర్శకుడు కోలీవుడ్ కు పరిచయమ్యాడు. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో .. గిరీశయ్య ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీలో క్రేజీ డైరెక్టర్ గా కితాబు అందుకుంటున్నాడు.
అతడి దర్శకత్వంలో సినిమాలు చేయడానికి పలువురు హీరోలు ప్రయత్నిస్తున్నారట. ఈ క్రమంలో అతడికి వైష్ణవ్ తేజని డైరెక్ట్ చేసే ఆఫర్ వచ్చిందట. బీ.వీ.యస్.యన్ ప్రసాద్ నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో కేతిక శర్మ కథానాయికగా నటిస్తోందట. ఈ బ్యూటీ ఆకాశ్ పూరి రొమాంటిక్ లో కథానాయికగా నటించింది. కేతిక, వైష్ణవ్ మీద టెస్ట్ కట్ చేయబోతున్నారట. ఏప్రిల్ నెల్లో సెట్స్ మీదకు వెళ్ళబోతున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్రస్తుతం జరుగుతోంది. త్వరలోనే సినిమా అనౌన్స్ మెంట్ రానుంది.
Must Read ;- త్రివిక్రమ్ కథతో ‘ఉప్పెన’ హీరో సినిమా.. ?