విక్టరీ వెంకటేశ్ లాస్ట్ ఇయర్ ఎండింగ్ లో ‘వెంకీ మామ’ సినిమాతో మేనల్లుడు నాగచైతన్య తో వినోదాన్ని, మంచి ఎమోషన్స్ ను పండించి.. అభిమానులకు మంచి ఫీస్ట్ ఇచ్చాడు. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా చెప్పుకోదగ్గ వసూళ్ళనే రాబట్టింది. ఆ తర్వాత వెంకీ వెంటనే తమిళ ‘అసురన్’ రీమేక్ వెర్షన్ ‘నారప్ప’ సినిమా మొదలుపెట్టాడు. శ్రీకాంత్ అడ్డాల దర్వకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ కు లాక్ డౌన్ అడ్డుపడింది. తిరిగి మళ్ళీ షూటింగ్ ను మొదలుపెట్టిన చిత్ర బృందం.. ఈ సినిమా చిత్రీకరణను చాలా వరకూ పూర్తి చేసింది.
ఇందులో విక్టరీ వెంకటేష్ ఇంతకు ముందెన్నడూ కనిపించని రీతిలో మేకోవర్ అయ్యాడు.. ఇద్దరు పిల్లలకు తండ్రిగా..రైతుగా కనిపించబోతున్నాడు. మధ్య వయస్కుడిగా నటిస్తోన్న ఆ పాత్రను తమిళంలో ధనుష్ పోషించిన రీతిలోనే రక్తికట్టించేందుకు రెడీ అవుతున్నాడు. రేపు వెంకీ 60వ పుట్టినరోజును పురస్కరించుకొని నిర్మాతలు నారప్ప టీజర్ ను విడుదల చేశారు.
టీజర్ లో వెంకటేశ్ కత్తి పట్టుకొని ఆవేశంగా నడుస్తూ వచ్చి.. సింహంలా గర్జిస్తూ ప్రత్యర్ధుల మీద విరుచుకుపడే తీరు ఆకట్టుకుంటుంది. ఒరిజినల్ వెర్షన్ అసురన్ లో ధనుష్ మాదిరిగానే గెటప్ ను, కాస్ట్యూమ్స్ ను అచ్చుగుద్దినట్టు దించేశారు. అయితే తమిళ వెర్షన్ లో ఆ పాత్ర ధనుష్ వయసుకు ఎక్కువైనట్టుగా కనిపిస్తుంది కానీ.. ఇందులో వెంకీకి సరిగ్గా సరిపోయింది. మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. వెంకీ కెరీర్ లో 74వ సినిమాగా వస్తోన్న నారప్ప .. ప్రేక్షకుల్ని ఏ రేంజ్ లో అలరిస్తాడో చూడాలి.
Must Read ;-, నలుగురూ దూకుతుంటే ‘నారప్ప’ ఊరుకుంటాడా?