ఒకప్పుడు ఫలానా హీరో దగ్గర ఫలానా ఖరీదైన కారు ఉందని గొప్పగా చెప్పుకునేవారు. ప్రత్యేక ఆకర్షణ కోసం ఆ కార్లను సినిమాల్లోను వాడేవారు. ఆ తరువాత ఫలానా హీరో ‘కారవాన్’ ఓ ప్రత్యేక ప్రపంచంలా ఉంటుందని గొప్పగా చెప్పుకోవడం మొదలైంది. దాంతో హీరోలు ఉపయోగించే కారవాన్ లలో ఎవరు ఉపయోగించేది ఎక్కువ ఖరీదు? అనేది అభిమానులలో ఆసక్తిని రేకెత్తించే అంశంగా మారింది. ఇంకా ‘కారవాన్’ల గురించే మాట్లాడుకుంటున్నారా? కాస్త పైకి చూడండి .. కందిరీగల్లా ఎగురుతున్న మా విమానాలు కనిపిస్తాయని టాలీవుడ్ హీరోలు అంటున్నారు.
అవును .. ఇప్పుడు తెలుగు హీరోలు ఛార్టెడ్ ఫ్లైట్ లపై దృష్టి పెట్టినట్టుగా కనిపిస్తోంది. మన సినిమాల హిట్లు మన చేతుల్లో లేకపోయినా, మన ప్రయాణాలు మన చేతుల్లో ఉండాలనే ఆలోచనను బలంగానే చేశారనిపిస్తోంది. ఇటీవల చిరంజీవి ఫ్యామిలీ .. నిహారిక పెళ్లికి తమ సొంత విమానంలో వెళ్లి వచ్చారని అంటున్నారు. దీని విలువ 100 కోట్లకి పైనే ఉంటుందని చెప్పుకుంటున్నారు. చిరూ .. నాగ్ మంచి ఫ్రెండ్స్ .. కనుక, చిరూ బాటలోనే నాగ్ నడిచాడనే అంటున్నారు. నాగార్జునకి కూడా ఓ ఛార్టెడ్ ఫ్లైట్ ఉందని చెబుతున్నారు. ఇటీవల తన ‘వైల్డ్ డాగ్’ సినిమా షూటింగుకు ఆయన తన ఛార్టెడ్ ఫ్లైట్ లోనే చక్కర్లు కొట్టాడని చెప్పుకుంటున్నారు.
ఛార్టెడ్ ఫ్లైట్ కొనడానికి సీనియర్ హీరోలు మాత్రమే అయ్యుండాలనే రూలేం లేదుగదా, అంటూ ఎన్టీఆర్ కూడా రంగంలోకి దిగేసి చాలా రోజులే అయిందని వినికిడి. ఓ 80 కోట్లు ఆయన ఆ ఫ్లైట్ కోసం ఖర్చు చేశాడని అంటున్నారు. రీసెంట్ గా బన్నీ కూడా తన సొంత విమానంలోనే నిహారిక పెళ్లికి వెళ్లి వచ్చినట్టుగా చెబుతున్నారు. ఫ్లాట్లు కొన్నంత తేలికగా వీళ్లు ఛార్టెడ్ ఫ్లైట్ లు కొనడం విశేషమే. రానున్న రోజుల్లో ‘కారవాన్’ ప్లేస్ లో ఛార్టెడ్ ఫ్లైట్ లు కనిపించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉండదేమో!











