టాలీవుడ్ సీనియర్ నటుడు వీరయ్య గట్టు అనే పొట్టి వీరయ్య (74) కన్నుమూశారు. హైద్రాబాద్ చిత్రపురి కోలనీలో నివాసముంటున్న వీరయ్యకు గతంలో కొంత అనారోగ్యం చేసి తర్వాత కోలుకున్నారు. అయితే ఈ ఉదయం పుచ్చకాయ తిన్న వెంటనే గుండెనొప్పి రావడంతో .. సమీపంలోని సన్ షైన్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. రేపు జూబ్లీ హిల్స్ లోని మహాప్రస్థానంలో వీరయ్య అంత్యక్రియలు జరగనున్నాయి.
కేవలం రెండడుగులు ఎత్తు మాత్రమే ఉండే పొట్టివీరయ్య .. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషలతో పాటు ఒరియా భాషలతో కలుపుకొని దాదాపు 500 సినిమాల్లో నటించారు. 1969 లో విఠలాచార్య దర్శకత్వంలో రూపొందిన యన్టీఆర్ ‘అగ్గివీరుడు’ సినిమాతో తన నట జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత తాను తెరకెక్కించిన చాలా జానపద చిత్రాల్లో వీరయ్య కు విఠలా చార్య అవకాశాలిచ్చారు. ఆ సినిమాలతో తెచ్చుకున్న పేరుతో, తన రూపంతో .. వివిధ భాషల్లో ఎన్నో చిత్రాల్లో హాస్యపాత్రల్లో ఆయన నటించారు. బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచి కలర్ మూవీస్ వరకూ ఉన్న జెనరేషన్స్ లో నటించి మెప్పించారాయన. వీరయ్యకి ఇద్దరు పిల్లలు. వీరయ్య మృతికి పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియ చేశారు.
Must Read : విక్టరీ వెంకటేష్ మూడు సినిమాలతో అంతేగా అంతేగా !











