తెలుగు తెరపై ఇప్పుడు కుర్రహీరోల మధ్య పోటీ మామూలుగా లేదు. ఎవరికి వారు కొత్త కొత్త కాన్సెప్టులతో ముందుకు వెళుతున్నారు. తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ విషయంలో నిఖిల్ ఒక అడుగు ముందే ఉన్నాడనిపిస్తుంది. ‘కార్తికేయ’ .. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ .. ‘అర్జున్ సురవరం’ సినిమాలు అందుకు నిదర్శనంగా కనిపిస్తాయి. ఒక కథకు .. మరో కథకు ఎలాంటి దగ్గర పోలికలు లేకుండా నిఖిల్ జాగ్తత్తలు తీసుకుంటూ ఉంటాడు. పరాజయం పాలైనా .. ఒక ప్రయత్నం చేశాడు .. ప్రయోగం చేశాడని అనిపించుకుంటూ ఉంటాడు.
నిఖిల్ తాజా చిత్రంగా ’18 పేజెస్’ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో ఆయన జోడీగా అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. లాక్ డౌన్ కారణంగా వాయిదాపడిన షూటింగు తాజాగా మొదలైంది. హైదరాబాద్ – సారథీ స్టూడియోలో వేసిన ప్రత్యేకమైన సెట్ లో ఈ సినిమా షూటింగు జరుగుతోంది. నాయికా నాయకుల మధ్య ముఖ్యమైన సన్నివేశాలను దర్శకుడు పల్నాటి సూర్యప్రతాప్ చిత్రీకరిస్తున్నాడు. గీతా ఆర్ట్స్ 2 – సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో నిఖిల్ ఒక ఇంట్రెస్టింగ్ రోల్ చేస్తున్నాడు.
ఇక ఈ సినిమా తరువాత ఆయన ‘కార్తికేయ 2‘ చేయనున్నాడు. చందూ మొండేటి దర్శకత్వంలో గతంలో వచ్చిన ‘కార్తికేయ’ అనూహ్యమైన విజయాన్ని సాధించింది. నిఖిల్ కెరియర్లో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాగా నిలిచింది. ఆ సినిమాకి సీక్వెల్ గా ‘కార్తికేయ 2’ చేయడానికి రంగంలోకి దిగారు. అయితే ఈ ప్రాజెక్టు కూడా లాక్ డౌన్ కారణంగానే ఆగింది. ఇప్పుడు ఈ సినిమా కూడా తిరిగి పట్టాలెక్కడానికి సిద్ధమవుతోంది. రెండు మంచి బ్యానర్లు .. ఇద్దరూ కుర్ర దర్శకులు .. విభిన్నమైన కథాంశాలు కావడం వలన, ఈ ఏడాదిలో నిఖిల్ రెండు హిట్లు కొట్టేలానే కనిపిస్తున్నాడు.
Must Read ;- క్రేజీ అనుపమ..ఐ లవ్ యూ అనుపమ అంటున్నారు!
https://www.youtube.com/watch?v=MCfRAA74vuI











