ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ (టీ పీసీపీ) అధ్యక్షుడి ఎంపిక ఖరారైపోయింది. రోజుల తరబడి సాగిన ఎంపిక ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఎట్టకేలకు ఖరారు చేసింది. మల్కాజిగిరీ ఎంపీగా కొనసాగుతున్న యువ రాజకీయవేత్త ఎనుముల రేవంత్ రెడ్డికి టీ పీసీసీ పగ్గాలు అప్పగిస్తూ కాంగ్రెస్ పార్టీ శనివారం రాత్రి ప్రకటించింది. వెరసి టీ పీసీసీ చీఫ్ పదవిపై కొనసాగుతున్న ఉత్కంఠ వీడిపోయిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
నలుగురిని దాటుకుని సాధించారు
టీపీసీసీ పదవి కోసం గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ లో సుధర్ఘ పోరాటమే సాగింది. ఈ పదవి తనకు కావాలంటే కాదు తనకే కావాలంటూ చాలా మంది నేతలు తమదైన శైలిలో పావులు కదిపారు. ఈ జాబితాలో పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వి. హన్మంతరావు, తూర్పు జయప్రకాశ్ రెడ్డి(జగ్గారెడ్డి), మరో మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్యలు ఉన్నారు. వీరిలో పొన్నాల కాస్తంత వెనుకబడ్డా… రేవంత్ రెడ్డితో కలిసి మిగిలిన నలుగురు తమదైన శైలిలో ఢిల్లీలో లాబీయింగ్ నడిపారు. రేవంత్‌తో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు ఏకంగా ఢిల్లీలో కూర్చుని మరీ పదవి సాధించుకునేందుకు తీవ్రంగా కసరత్తు చేశారు. అయితే చివరికి అందరినీ వెనక్కు నెట్టేసిన రేవంత్ రెడ్డి టీ పీసీసీ పీఠాన్ని కైవసం చేసుకున్నారు.
టీడీపీతో ప్రస్థానం మొదలు
టీడీపీతో రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన రేవంత్ రెడ్డి… పార్టీలో కీలక నేతగా ఎదిగారు. మిగిలిన నేతలతో పోలిస్తే వయసులో చిన్నవాడైనా తనదైన దూకుడును ప్రదర్శించిన రేవంత్ రెడ్డి… ఉమ్మడి రాష్ట్రంలోనే కీలక నేతగా ఎదిగారు. మహబూబ్ నగర్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం నుంచి పలుమార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన రేవంత్ రెడ్డి టీడీపీలో ప్రత్యేకించి చంద్రబాబుకు అత్యంత సన్నిహితుల్లో ఒకరిగా మెలిగారు. అయితే తెలుగు నేల విభజన తర్వాత చోటుచేసుకున్న ఓటుకు నోటు కేసులో చిక్కిన రేవంత్ ను టీఆర్ఎస సర్కారు ఓ రేంజిలో ఇబ్బంది పెట్టింది. అయినా కూడా వెనక్కు తగ్గని రేవంత్… టీఆర్ఎస్ పై తనదైన శైలి పోరును సాగించారు. కాలక్రమంలో తెలంగాణలో పార్టీ కొంతమేర బలహీనపడిన నేపథ్యంలో విధిలేని పరిస్థితుల్లో టీడీపీకి రాజీనామా చేసిన రేవంత్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత కొడంగల్ లో ఓటమిపాలైన రేవంత్ సార్వత్రిక ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. టీ పీసీసీ చీఫ్ గా రేవంత్ ఎంపిక నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో ఓ రేంజిలో జోష్ కనిపించే అవకాశాలు ఉన్నాయి.