కాకినాడ కాజా
కాకినాడ అంటే చాలా మందికి మొదటగా గుర్తొచ్చేది కాకినాడ కాజానే. అందులోనూ కోటయ్య కాజా అంటే ఇంకాఎక్కువ పేరు. విదేశాల్లో ఉండే తెలుగువారు కూడా కాకినాడ కాజాను రుచి చూడాలనుకుంటారు. గొట్టం కాజా, మడత కాజా, చిట్టి కాజా అని రకరకాలుగా ఉంటాయి. అన్నీ తియ్యగా ఉండేవే. అందులో గొట్టం కాజాకు ఉండే ప్రత్యేకత వేరు. వీటిని నెయ్యి, వనస్పతితో కూడా తయారు చేస్తారు. గొట్టం కాజాను కొరకగానే అందులో ఉన్న పాకం నోటిని తియ్యగా చేసేస్తుంది. ఆ థ్రిల్ తినే వారికి మాత్రమే తెలుస్తుందంటారు.
తాపేశ్వరం కాజా
తూర్పుగోదావరి జిల్లా తాపేశ్వరం కాజాకు చాలా పేరుంది. మైదాపిండితొ మడతలుపెట్టి కాజాలను కొత్తరూపంలో తయారుచేసి, పంచదారపాకం పట్టి అమ్మగా వాటి కమ్మదనం, రుచి కారణంగా అతి తక్కువకాలంలోనే ప్రాచుర్యములోకి వచ్చింది. తాపేశ్వరం కాజాగా ఖ్యాతి సంపాదించింది. సత్తిరాజు, రామస్వామి అనే వ్యాపారులు మొదటగా తాపేశ్వరం కాజాను పరిచయం చేశారు. మొదట వీళ్లు శుభకార్యాలకు పిండివంటలు తయారు చేసి అందించేవారు. వంటలు వండేటప్పుడు రకరకాల ప్రయోగాలు చేసేవారు. వీళ్ల ఇద్దరి నుంచి ఎంతో మంది ఈ స్వీటును తయారు గురించి తెలుసుకొని, జీవనోపాధి పొందుతున్నారు.
ఆత్రేయపురం రేకులు
పూతరేకులు ఆంధ్ర ప్రాంతానికి చెందిన అత్యంత ప్రసిద్ధ మిఠాయి. కొన్నిప్రాంతాలలో వీటిని పోరచుట్టలు అని కూడా పిలుస్తారు. ఇది కేవలం కొన్ని ప్రాంతాలలో మాత్రమే పరిమితం. ఒక్కో చోట పూతరేకులు టెస్ట్ ఒక్కో విధంగా ఉంటుంది. ఆత్రేయపురంలో మాత్రం దీని టెస్ట్ అమోఘం. ఈ రేకులో తీపిపదార్థాలను వేసి పొరలుపొరలుగా మడిచిపెట్టి పూతరేకులను తయారుచేస్తారు. ఈ తీపి పదార్థాలు రకరకాలుగా ఉంటాయి. నెయ్యి, బెల్లం వేసి వేసి తయారుచెయ్యడం సంప్రదాయికంగా వస్తున్న పద్ధతి. అలాగే పంచదార పొడి వేసి కూడా తయారుచేస్తారు. జీడిపప్పు, బాదం పప్పు వేసి తయారుచెయ్యడం ఒక పద్ధతి. మధుమేహవ్యాధి ఉన్నవారికోసం సుగర్‌ఫ్రీ పూతరేకులను కూడా తయారుచేస్తున్నారు.
Must Read ;- బీట్ ది హీట్ : సమ్మర్ కేర్ ఇలా..
మామిడి తాండ్ర
సీజన్‌తో సంబంధం లేకుండా మామిడి రుచిని జిహ్వపై నిలుపుతుంది మామిడి తాండ్ర. సంవత్సరం పొడవునా మధురమైన మామిడి రుచిని అందిస్తుంది. మామిడి తాండ్ర తయారీతో రెండు రాష్ట్రాల్లో పేరు తెచ్చుకుంది విజయనగరం జిల్లా లక్కవరపుకోట మండల పరిధిలోని భీమాళి గ్రామం. మిగతా గ్రామాలతో పోలిస్తే భీమాళిలో తయారైన మామిడి తాండ్ర రుచి భిన్నంగా బాగుంటుందని ప్రశస్తి. ఈ గ్రామంలో ఏటా సుమారు 10 లక్షల కేజీల మామిడి తాండ్ర ఉత్పత్తి అవుతుందని అంచనా. ఏప్రిల్ నెల ఆఖరి వారం నుంచి జూన్ వరకు దీన్ని తయారుచేస్తుంటారు. ఈ మూడు నెలలే తాండ్ర తయారీకి అనుకూల వాతావరణాన్ని కలిగి ఉంటాయి. ఇదివరకు కోల్‌కతా, ఢిల్లీ వంటి ప్రదేశాలకు తాండ్రను ఎగుమతి అవుతుంది.
తిరుపతి లడ్డు
ఎవరైనా తిరుపతి వెళ్లామని చెప్పగానే… గల్లీ నుంచి ఢల్లీ దాకా అడిగే ప్రశ్న ఒక్కటే తిరుపతి లడ్డు తెచ్చావా అని. తిరుపతిలో ఇతర ప్రసాదాలు ఎన్నో తయారవుతున్న లడ్డుకు మాత్రం చాలా క్రేజ్ ఉంది. పదిహేనేళ్ళ క్రితం ఎన్ని కావాలంటే అన్ని అమ్మేవారు. ఇప్పుడు ఆ సదుపాయం లేదు. ఈ లడ్డు తయారీ కోసం ప్రత్యేకమైన పద్ధతులను పాటిస్తారు. ఈ ప్రసాదం తయారీ కోసం స్వచ్ఛమైన శనగ పిండి, పటిక బెల్లం, నెయ్యి, ఎండు ద్రాక్ష, యాలుకలు, జీడీపప్పు, కర్పూరం మొదలైన పదార్ధాలు ఉపయోగిస్తారు. రాష్ట్ర పర్యటనలకు దేశవిదేశ ప్రముఖులు వచ్చినా.. విదేశీ పర్యటనలకు ఏపీ ప్రజాప్రతినిధులు వెళ్లినా లడ్డూ ప్రసాదాన్ని సదరు విదేశ ప్రముఖులకు పంపిణీ చేయడాన్ని ఇక్కడ అనవాయితీగా వస్తోంది.
అన్నవరం ప్రసాదం
చాలా ఆలయాల్లో లడ్డూ ప్రసాదం.. ప్లాస్టిక్ పొట్లాల్లో ఇస్తారు. కానీ అన్నవరంలో మాత్రం విస్తరాకులోనే ఇస్తారు. అదే ఇక్కడి ప్రత్యేకత. సహజమైన విస్తరాకుల్లో మాత్రమే రంధ్రాల వల్ల గాలి తగులుతుంది. ఆకు వల్ల ప్రసాదంలో నెయ్యి కారిపోయే అవకాశం ఉండదు. దీంతో ప్రసాదం క్వాలిటీగా, మధురంగా ఉంటుంది. ఆకులోని రసాన్ని పీల్చుకున్న ప్రసాదం మరితం రుచిగా ఉంటుందట. ఆహార భద్రత, నాణ్యత ప్రమాణాల విభాగంలో ఐఎస్ ఓ గుర్తింపు కూడా ఇచ్చింది.
బందరు లడ్డు
బెల్లం తునక.. బంగారు పుడక (శనగ పిండితో చేసే సన్నపూస) కలిస్తే బందరు లడ్డూ రెడీ అవుతుంది. నోట్లో వేయగానే నేతిని ఊరిస్తూ తీయగా గొంతులోకి జారిపోతుంది. తియ్యటి రుచుల్ని భలే పంచుతుంది. లడ్డూ తయారీకి కనీసం 12 గంటల సమయం పడుతుంది. ఇందులో శనగపిండి, బెల్లం, నెయ్యి, పటిక బెల్లం, యాలకుల పొడి, సుగంధ ద్రవ్యాలు, జీడిపప్పు, బాదం పప్పు వినియోగిస్తారు. తొలుత శనగ పిండిని నీట్లో కలిపి నేతి బాండీలో కారప్పూస మాదిరిగా పోస్తారు. అలా వచ్చిన పూసను ఒకపూట ఆరబెట్టి రోకలితో దంచి పొడి చేస్తారు. ఆ పొడిని శుద్ధమైన బెల్లం పాకంలో వేసి లడ్డూ తయారీకి అనువుగా మారేంత వరకు కలుపుతారు. ఈ మిశ్రమాన్ని కొంతసేపు ఆరబెట్టి మళ్లీ రోకళ్లతో దంచుతూ మధ్య మధ్యలో నెయ్యి దట్టిస్తారు. ఒకరు పిండిని తిప్పుతుండగా మరొకరు రోకలితో మిశ్రమాన్ని దంచి జీడిపప్పు, యాలకుల పొడి, పటిక బెల్లం ముక్కలు కలుపుతారు.
మాడుగుల హల్వా
విశాఖ జిల్లా మాడుగుల గ్రామానికి చెందిన మిఠాయి వ్యాపారి దంగేటి ధర్మారావుకు 1890 ప్రాంతంలో కొత్తరకమైన మిఠాయి తయారుచేయాలన్న ఆలోచన వచ్చింది. అంతే.. బూడిద గుమ్మడి, కొబ్బరి కాయ రసంతో హల్వా తయారుచేశారు. దీని తయారీ ఎలాంటే.. ముందుగా మేలు రకం గోధుమలు 3 రోజులు నానబెట్టి రోటిలో రుబ్బి గోధుమ పాలు తీయాలి. వాటిని ఒక రోజు పులియబెట్టాలి. ఆ తరువాత గోధుమ పాలు, నెయ్యి కలిపి దగ్గరకు మరిగే వరకు కలపాలి. ఆ పాకాన్ని దించి వాటిపై ఫ్లేవర్ కోసం జీడిపప్పు బాదం పప్పు వేయాలి. మాడుగుల హల్వా యవ్వన శక్తి పెంచడంతోపాటు శరీర స్థితిని నిలకడగా ఉంచుతుందని స్థానికుల నమ్మకం.
పెనుగొండ కజ్జికాయలు
బందరు లడ్డు, తిరుపతి లడ్డు, మామిడి తాండ్రాకు ఎలా పేరుందో ఆంధ్రప్రదేశ్ లో పెనుగొండ కజ్జికాయలకు పేరుంది. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో కజ్జికాయలు తయారవుతాయి. పెనుగొండ వెళ్లినవాళ్లు ఎవరైనా కజ్జికాయల రుచి చూడనది తిరిగిరారు. ఆంధ్రప్రదేశ్ లో ఉండేవాళ్లు, దేశ విదేశాలకు పంపుతారంటే కజ్జికాయలు ఎంత టేస్టో అర్థం చేసుకోవచ్చు. ఈ కజ్జికాయలతో పాటు నెల్లూరు మలై కాజాకు కూడా బాగా డిమాండ్ ఉంది.
Also Read ;- పెరుగు ప్రయోజనాలివే : తెలిస్తే తినకుండ ఉండలేరు!