కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం ఈపార్టీలను మద్దతు అడగక ముందే పార్లమెంట్ లోని తమ పార్టీ సభ్యులకు ఆదేశాలు జారీచేసి పార్లమెంటులో బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులకు మద్దతు ప్రకటిస్తూ తమ స్వామి భక్తిని తెలియచేస్తున్నాయి. అలాగే ప్రధాని నరేంద్రమోడీ అనుగ్రహం, కటాక్ష వీక్షణలకోసం చకోరపక్షులా ఈ రాజకీయ పార్టీల నాయకులు ఎదురు చూస్తున్నారు.
రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్ష పార్టీలైన వైస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు రెండు ప్రస్తుతం బీజేపీ పార్టీతో సాన్నిత్యం కోసం ఒకదానికి ఒకటి పోటీపడుతున్నాయి. కాగా రాష్ట్రంలో బీజేపీ నాయకులు మాత్రం తమ పార్టీ స్వంతంగానే బలపడుతుంది మాకు ఏ పార్టీ మద్దతు అక్కర్లేదు అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఒక ప్రక్క రాష్టం లో ఒక మతానికి చెందిన గుళ్ళు, విగ్రహాలు,రథాలు ధ్వంసం అవుతూవుంటే ఇదే అదునుగా ప్రతిపక్షాలు అధికార వైస్సార్ కాంగ్రెస్ పై దండయాత్ర సిద్ధంచేసుకుంటున్న తరుణంలో బీజేపీ పార్టీ నాయకులు ప్రతిపక్ష పార్టీలకన్నా ముందుగా నిరసన ప్రదర్శనలు చేపట్టి, రాష్ట్ర గవర్నర్ కు, కేంద్ర హోంమంత్రి కి ఫిర్యాదులు
చేపట్టి ప్రతిపక్ష పాత్ర పోషించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అయితే రాష్ట్రంలో ని బీజేపీ నాయకులు చేస్తున్న కార్యకలాపాలను వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గాని ఏమాత్రం పట్టించుకోకుండా కేంద్రంలోని బీజేపీ ని ప్రసన్నం చేసుకోవడం కోసం శతవిధాల ప్రయత్నిస్తున్నారు. గత ఎన్.డి.ఏ.ప్రభుత్వం లో భాగస్వామ్యం గా ఉన్న తెలుగుదేశం పార్టీ ఎన్నికల ముందు బీజేపీ తో తెగతెంపులు చేసుకుని, మధ్యలో కాంగ్రెస్ తో జతకట్టి మూడవ ఫ్రంట్ అంటూ హడావుడి చేసి తీరా ఎన్నికలలో ఘోరంగా ఓటమి పాలైంది.
ఇప్పుడు తన వ్యూహాన్నిమార్చుకుని బీజేపీకి దగ్గర అయ్యేందుకు ప్రయత్నిస్తోంది. మొన్నటి ఎన్నికల్లో బీజేపీని ఆ పార్టీ అధినేత నరేంద్రమోడీ ని దుమ్మెత్తిపోసిన తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు మోడీని ప్రసన్నం చేసుకునేందుకు తీవ్రంగా ప్రత్నిస్తున్నారు. త్వరలో జమిలి ఎన్నికలు వస్తాయనే ఆశతో ఈ పర్యాయం మూడో ఫ్రంట్ ఊసు ఎత్తకుండా ఒక్క బీజేపీ, మోడీయే దేశానికి శరణ్యం అంటూ చంద్రబాబు నాయుడు బీజేపీతో జతకట్టేందుకు సిద్ధమవుతున్నారు. దీనిలో భాగంగానే బీజేపీ ప్రభుత్వానికి మద్దతుగా పార్లమెంటు లో ప్రవేశపెట్టిన బిల్లులకు బేషరతుగా మద్దతు నిచ్చేందుకు ముందుకు వచ్చారు.
ఇక వైస్సార్ కాంగ్రెస్ పార్టీ సైతం బీజేపీ ప్రభుత్వాన్ని కానీ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ని కానీ పల్లెత్తు మాట అనకుండా తగు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. బీజేపీని కానీ, ప్రధాని మోడీని కానీ విమర్శిస్తే తమ పార్టీ అధినేత జగమ్మోహన రెడ్డి పై సీబీఐ కోర్టు లో పెండింగ్ ఉన్న కేసులను ఎక్కడ బయటకు లాగుతారో, బెయిల్ ఎక్కడ రద్దు అవుతుందో అని వారు సంకోచిస్తున్నారు. బీజేపీని కానీ ఆపార్టీ నాయకులను కాని విమర్శించేందుకు వైసీపీ నాయకులు భయపడుతున్నారు. అందుచేతనే పార్లమెంటు లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లులకు బీజేపీ వారు అడగకుండానే మద్దతునిస్తూ ఆపార్టీ కనుసన్నలలో వుంటున్నారు.
ఎన్.డి.ఏ.లోని మిత్ర పక్షమైన ఆకాలిదళ్ పార్టీ సైతం వ్యవసాయ బిల్లుకు మద్దతునీయకుండా ఎదురుతిరిగి నప్పటికి వైసీపీ సభ్యులు మాత్రం అటు లోక్‌సభ లోను ఇటు రాజ్యసభ లోను భేషరతుగా మద్దతునిచ్చి బీజేపీని, ప్రధానమంత్రి నరేంద్రమోదీని ప్రసన్నం చేసుకుంటున్నారు.
దక్షిణాది రాష్ట్రాలలో బీజేపీ బలపడి అధికారం చేజిక్కించుకోవాలని చూస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ తో శత్రుత్వం పెంచుకోవడానికి ప్రధాన రాజకీయ పార్టీలు వైస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం భయపడుతున్నాయి. అంతేకాక మోడీ అమిత్ షా లు ఎప్పుడు పిలుస్తారో అంటూ ఈ పార్టీల నాయకులు ఎదురు చూస్తున్నారు. బీజేపీ తో జత కట్టేందుకు ఎవరికి వారు పోటీపడుతున్నారు.
ఇందుకోసం ఢిల్లీ లో తమ పార్టీ నాయకులను అప్రమత్తం చేస్తూ తాజా సమాచారం కోసం ఈ పార్టీల అగ్ర నేతలు ఎదురుచూస్తున్నారు. వీరి ఎదురు చూపులు, నిరీక్షణ ఎప్పటికి తీరుతుందో బీజేపీ అధిష్టానం ఎప్పటికి ఎవరిని కరుణిస్తుందో చూడాలి.











