ఈ మధ్య కాలంలో తెలుగు .. తమిళ భాషల్లోను వెబ్ సిరీస్ లు జోరందుకుంటున్నాయి. సినిమాల్లో అవకాశాలు అంతగా లేనివాళ్లు మాత్రమే వెబ్ సిరీస్ ల దిశగా అడుగులు వేస్తారనే భావనతో కొంతమంది ఉండేవారు. కానీ వెండితెరపై మంచి క్రేజ్ ఉన్నవారు కూడా వెబ్ సిరీస్ లను ఒక సరికొత్త ఫ్లాట్ ఫామ్ గా భావిస్తున్నారు. వెబ్ సిరీస్ లు చేయడానికి ఉత్సాహాన్ని చూపుతున్నారు. దాంతో మంచి రచయితలు .. సాంకేతిక నిపుణులు ఎంతో ఆసక్తిగా రంగంలోకి దిగుతున్నారు. ఈ నేపథ్యంలో వెబ్ సిరీస్ లు తమ రూపు రేఖలను మార్చుకుంటున్నాయి.
సినిమాల మాదిరిగానే వెబ్ సిరీస్ లు కూడా ఇతర భాషల్లోకి డబ్ అవుతూ ఉండటం మంచి పరిణామం. ముఖ్యంగా ‘హాట్ స్టార్’లో స్ట్రీమింగ్ అవుతున్న వెబ్ సిరీస్ కి మంచి ఆదరణ లభిస్తోంది. అలా ఇప్పుడు ‘ట్రిపుల్స్’ ఆకట్టుకుంటోంది. ‘స్టోన్ బెంచ్’ బ్యానర్ పై కల్యాణ్ సుబ్రమణియన్ నిర్మించిన ఈ వెబ్ సిరీస్ కి, చారుకేశ్ శేఖర్ దర్శకుడిగా వ్యవహరించాడు. బాలాజీ జై రామన్ రచించిన ఈ కథలో, తమిళ హీరో ‘జై’ .. ‘వాణి భోజన్ నాయకా నాయికలుగా నటించగా, వివేక్ ప్రసన్న .. రాజ్ కుమార్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే కథతో ఈ వెబ్ సిరీస్ కొనసాగుతోంది.
కథలోకి వెళితే .. రామ్ కుమార్ ( జై) మాధూ .. చెన్నూ ముగ్గురూ మంచి స్నేహితులు. జీవితంలో స్థిరపడటం కోసం ఏం చేయాలి? అనే విషయంపై తీవ్రంగా ఆలోచించి, ఏదైనా ఒక సాఫ్ట్ వేర్ సంస్థలో ‘కేఫ్’ ఓపెన్ చేయాలని నిర్ణయించుకుంటారు. అయితే అందుకు అవసరమైన డబ్బు తమ దగ్గర లేకపోవడంతో ఓ రౌడీని ఆశ్రయిస్తారు. దందాలు చేయగా వచ్చిన డబ్బును అతను వడ్డీకి తిప్పుతుంటాడు. ఈ ముగ్గురు మిత్రులు కలిసి అతని దగ్గర అప్పుగా 20 లక్షలు తీసుకుంటారు. ఓ శుభముహూర్తాన ఒక సాఫ్ట్ వేర్ సంస్థలో కేఫ్’ పెడతారు.
వాణి భోజన్ ఆ సంస్థలో హెచ్ ఆర్ గా పనిచేస్తూ ఉంటుంది. తొలి చూపులోనే రామ్ కుమార్ ఆమెపై మనసు పారేసుకుంటాడు. తెలివిగా ఆమె దృష్టిని తన వైపుకు తిప్పుకుని వలలో పడేస్తాడు. ఒకరిని ఒకరు అర్థం చేసుకున్న తరువాత పెళ్లి చేసుకుంటారు. కొత్త ఇల్లు .. కొత్త కాపురం .. కొత్త ఉత్సాహంతో వాళ్ల జీవితం సాగిపోతూ ఉంటుంది. అయితే ఎంత ఫాస్టుగా వాళ్లిద్దరూ ఒక కప్పు కిందకు చేరతారో, అంతే ఫాస్టుగా విడిపోతారు. అందుకు గల కారణాలు ఏమిటనేది మాత్రం సస్పెన్స్. విడాకులు తీసుకున్న రెండే నెలలకి రామ్ కుమార్ మళ్లీ పెళ్లికి సిద్ధపడతాడు. మైథిలీ అనే అమ్మాయితో అతని పెళ్లికి ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి.
రామ్ కుమార్ పెళ్లిలో అతని స్నేహితులిద్దరూ హడావిడి చేస్తుంటారు. ఇతర బంధుమిత్రులతో అక్కడ అంతా సందడిగా ఉంటుంది. పెళ్లి కొడుకైన రామ్ కుమార్ కి మనసంతా అదోలా ఉంటుంది. మొదటిభార్యతో విడిపోయిన రెండు నెలల్లోనే రెండో పెళ్లికి ఒప్పుకోవడం అతనికి ‘గిల్ట్’ గా అనిపిస్తూ ఉంటుంది. పెళ్లికి సమయం దగ్గర పడుతుంటుంది. అదే సమయంలో ఆ కల్యాణ మంటపంలోకి రామ్ కుమార్ మొదటి భార్య అడుగుపెడుతుంది. అందుకు కారణం ఏమిటి? ఆ తరువాత చోటుచేసుకునే పరిణామాలు ఎలాంటివి? అనేవి ఉత్కంఠగా మారనున్నాయి. అనూహ్యమైన మలుపులతో సాగే ఈ వెబ్ సిరీస్ నెటిజన్లను ఒక రేంజ్ లో ఆకట్టుకునేలానే కనిపిస్తోంది.