తెలుగు రాష్ట్రాల్లో రెండు రియాల్టీ షోలలో ఎవరు ఎక్కువ క్రేజ్ సంపాదించారన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. బిగ్ బాస్ 5 కు అక్కినేని నాగార్జున హోస్ట్ గా చేస్తుండగా, మరో షోకు జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.
బిగ్ బాస్ షో మొదటి వారం మాత్రం చప్పగా కొనసాగింది. ఎవరు మీలో కోటీశ్వరులు మాత్రం మొదటి రెండు వారాలు దూసుకుపోయింది. తాజా సమాచారం ప్రకారం ఎవరు మీలో కోటీశ్వరులు షోను వెనక్కి నెట్టేసి బిగ్ బాస్ 5 దూసుకు పోతోంది. ప్రస్తుతం బిగ్ బాస్ 5 షోకు 15. 71 టీఆర్పీ ఉంది. అయితే ఇది నాగ్ గత షోలతో పోలిస్తే మాత్రం వెనకబడే ఉంది. మున్ముందు ఈ షో ఇంకా ముందుకెళుతుందేమో చూడాలి.
ఎన్టీఆర్ షో ఎందుకు వెనకబడింది?
జెమినీ టీవీలో ప్రసారమవుతున్న ఎవరు మీలో కోటీశ్వరులుకు మొదట్లో మంచి హైప్ ఏర్పడింది. ఈ గేమ్ షో కర్టెన్ రైజర్ కు 11. 4 రేటింగ్ వచ్చింది. దానికి కారణం జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా రావడమే. అలాగే ప్రారంభ షోకు హీరో రామ్ చరణ్ ముఖ్య అతిథిగా వచ్చి హాట్ సీటులో కూర్చున్నాడు. ఆ తర్వాత మాత్రం అంత స్పందన రాలేదు. దాదాపు మూడు వారాలుగా ఈ షో కొనసాగుతోంది. ప్రస్తుతం దీని టీఆర్పీ 7.30 ఉంది. మొదటి వారం మాత్రం 5.62 రేటింగ్ రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అప్పటికి బిగ్ బాస్ 5 ప్రారంభం కాలేదు కూడా. అయితే క్రమంగా టీఆర్పీ పెరుగుతున్నా బిగ్ బాస్ 5ను మాత్రం దాటలేకపోతోంది.
బిగ్ బాస్ 5 రేంజ్ ఏమిటి?
నాగ్ హోస్ట్ గా కొనసాగుతున్న బిగ్ బాస్ 5 తాజా టీఆర్పీ వచ్చింది. దాని ప్రకారం 15.71 టీఆర్పీ దక్కింది. ఎన్టీఆర్ షోతో పోలిస్తే ఇది ఎంతో ముందుంది. మొదటి వారం మాత్రం షో బాగా డల్ అయ్యింది. సరయు ఎలిమినేషన్ ఊహించని రీతిలో ఉంది. ఆ తర్వాత షో మీద కొంచెం ఆసక్తి పెరిగింది. కాకపోతే కంటెస్టెంట్ లలో కొందరు బూతు పురాణాలు వల్లె వేయడం ఇంటిల్లిపాదీ షో చూడాలంటే ఇబ్బంది పడేలా ఉంది. అసలు 19 మంది కంటెస్టెంట్ లలతో వారి పేర్లు గుర్తుంచుకోవడం కూడా కష్టమైంది.
రెండో వారం ఎలిమినేషన్ కు సమయం దగ్గరవుతోంది. మునుపటి షోలతో పోలిస్తే మాత్రం బిగ్ బాస్ షో వెనకబడే ఉందని చెప్పాలి. బిగ్ బాస్ మొదటి సీజన్ లో 16.18 రేటింగ్ ఉంది. దీనికి జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించారు. ఆ తర్వాత నాని హోస్ట్ గా వ్యవహరించిన షో రేటింగ్ 15.05 ఉంది. ఆ తర్వత నాగర్జున హోస్ట్ గా వచ్చిన బిగ్ బాస్ 3కి 17.9 రేటింగ్ దక్కింది.
బిగ్ బాస్ 4 మాత్రం 18.5 రేటింగ్ కు దూసుకెళ్లింది. ఇప్పటికే అగ్రస్థానంలో బిగ్ బాస్ 4 మాత్రమే ఉంది. ఈసారి షో పాత రికార్డులను చెరిపేసి ముందుకు దూసుకుపోతుందా అనే విషయంలో అనుమానాలు ఉన్నాయి. వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఏదైనా మిరాకిల్ జరిగితే తప్ప ఇప్పట్లో షో దూసుకెళ్లే అవకాశాలు అయితే లేవు. రేటింగ్స్ కోసం బూతును ఆశ్రయించకుండా ఉంటే మేలన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
Must Read ;- సరయు ఇంటికి.. బిగ్ బాస్ షాకింగ్ ట్విస్ట్











