అవతల ఉన్నది మోదీ అయినా.. అమిత్ షా అయినా..దేశంలో ఏ లీడర్ అయినా మా సారు కేసీఆర్ రంగంలోకి దిగనవంత వరకే.. ఒక్కసారి రంగంలోకి దిగితే ఆయన వాగ్ధాటి ముందు అంతా అవుట్. తెలంగాణ కోసం చావునోట్లో తలపెట్టి బయటపడిన కేసీఆర్ మాటలకు తెలంగాణ ప్రజలు అంత విలువ ఇస్తారు.
-ఇదీ టీఆర్ఎస్ కేడర్ చెప్పే మాట
మాకు ఎవరి సాయం అవసరం లేదు. మేం ఇతర పార్టీల్లా కాదు..మాది ఉద్యమం నుంచి పుట్టిన పార్టీ..తెలంగాణ కోసం ఏర్పాటైన పార్టీ.. మేం ఎవ్వరిపై ఆధారపడేది లేదు.
-ఇదీ క్షేత్రస్థాయిలో, ద్వితీయ శ్రేణి నాయకత్వం మొన్నటి వరకు చెప్పిన మాట.
ప్రస్తుత పరిస్థితుల్లో ఈ మాటలు చెప్పే అవకాశం లేదనిపిస్తోంది. ఎందుకంటే..దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో టీఆర్ఎస్ అలర్ట్ అయింది. అదే సమయంలో బీజేపీ పుంజుకుంది. ఇక కాంగ్రెస్‌కు కొత్త పీసీసీ ఎవరనే అంశాన్ని బట్టి ఆ పార్టీ పరిస్థితి ఏంటనే అంచనాకు వస్తుంది. ఇలాగే కొనసాగితే రానున్న కాలంలో తమకు ఓటర్లు దూరం అయ్యే ప్రమాదం ఉన్న ఆలోచన టీఆర్‌ఎస్‌లో మొదలైందని చెబుతున్నారు. అందులో భాగంగానే..ఎల్ ఆర్ ఎస్, నియంత్రిత సాగు లాంటి అంశాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం వెనక్కి తగ్గడం, కేంద్ర స్థాయిలో బీజేపీతో సామరస్యంగా వెళుతోందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇన్నాళ్లు..కేసీఆర్ చెప్పిందే శాసనంగా అమలైన వేళ.. తాజా పరిస్థితి టీఆర్ఎస్ శ్రేణులకు కొంత షాకింగ్ అనే చెప్పవచ్చు.
పీకేతో కేటీఆర్ మూడు గంటలు చర్చలు
ఇక ఇటీవల జరిగిన పరిణామాలు చూస్తే.. ఏపీలో జగన్‌ని కలిసేందుకు వచ్చిన ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే..తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్‌నూ కలిశారు. దాదాపు మూడు గంటలపాటు చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. ఆ చర్చలు ఏంటనే విషయం బయటకు చెప్పకపోయినా.. అందరికీ తెలిసిన అంశమే. ఎన్నికల వ్యూహకర్త పీకేతో ఎన్నికలకు సంబంధించి కాకుండా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్‌గా కేటీఆర్ వేరే అంశంపై చర్చలు జరిపే అవకాశమే లేదు. ఇదే అంశానికి సంబంధించి తాజాగా మరో పరిణామం చోటుచేసుకున్నట్లు చెబుతున్నారు.
పీకే టీం వ్యూహాల అమలు పరిశీలన
ప్రస్తుతం పశ్చిమబంగాల్‌లో పీకే టీఎంసీ తరఫున పని చేస్తున్నారు. మమతా బెనర్జీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడాన్ని టాస్క్‌గా ఎంచుకున్నారు. అయితే, ప్రత్యేక పిలుపు మేరకు ఏపీ సీఎంతో భేటీ అయ్యారు. ఏపీలో పంచాయతీ ఎన్నికలు లేదా రానున్న ఎన్నికల (జమిలి కూడా కావచ్చు) పై ఏపీ సీఎం జగన్ తో పీకే చర్చలు జరిగాయని, ఇక్కడా అలాంటి చర్చలే జరిగాయని తెలుస్తోంది. అయితే వైసీపీ, పీకే టీం 2016 నుంచి కలసే పనిచేస్తోంది. సో కొంత పరస్పర అవగాహన ఉంటుంది. రానున్న కాలంలో వైసీపీ వ్యూహకర్తలకు పీకే వ్యూహాలు చెబితే సరిపోతుంది. కాని తెలంగాణలో పీకే టీం ఇప్పటి వరకు డైరెక్ట్ ఎంట్రీ కాలేదు. దీంతో టీఆర్ఎస్ మరో స్టెప్ తీసుకుందని తెలుస్తోంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో పీకే మార్గదర్శకత్వం అవసరమని పార్టీలో చాలా మంది భావిస్తున్నా, పీకే టీం వ్యూహాల అమలు ఎలా జరుగుతుందో తెలుసుకునేందుకు ఫస్ట్ టీంని అక్కడికి పంపనున్నట్లు తెలుస్తోంది. కొంతమందిని ఇప్పటికే ఏపీకి పంపినట్లు తెలుస్తోంది. మరికొంత మందిని ఓ నమ్మకమైన నాయకుడి ఆధ్వర్యంలో పశ్చిమబెంగాల్‌కు పంపి క్షేత్ర స్థాయిలో పరిశీలించేందుకు సిద్ధమైందని, ఆ టీం వెనక్కి వచ్చాక..మరో టీంని పంపడం, అలా విడతల వారీగా పంపి..టీఆర్ఎస్ కార్యాచరణ టీంకి శిక్షణ ఇచ్చే పని మొదలు చేయనున్నారని తెలుస్తోంది.
వాస్తవానికి ఈ ప్రతిపాదన ఇప్పటిది కాదని, దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాల తరువాత సోషల్ మీడియాలో బీజేపీ కంటే టీఆర్ఎస్ వెనుక బడిందన్న కామెంట్లు రావడం, పార్టీ సోషల్ మీడియా విభాగాన్ని అధికారికంగా ఏర్పాటు చేయడం అందులో భాగంగానే జరిగాయని తెలుస్తోంది. మొత్తం మీద నా మాటే శాసనం అనే పరిస్థితి మారితే.. మొత్తానికే మోసం వస్తుందన్న ఆలోచనతో టీఆర్ఎస్ పార్టీ తన వ్యూహాలను మార్చేందుకు కసరత్తు చేస్తోందని ప్రచారం జరుగుతోంది.