ఎదురు దెబ్బలు గులాబీ బాస్ కేసీఆర్‌కు కొత్తేం కాదు. ఆ మాటకు వస్తే.. తెలుగు రాష్ట్రాల్లో ఏ రాజకీయ పార్టీ అధినేత తినని దెబ్బల్ని ఆయన తిన్నారు. దెబ్బ తిన్న ప్రతిసారీ మరింత బలోపేతం అయ్యారే తప్పించి బలహీనం కావటం కనిపించదు. తనది కాని టైంలో తనకు సంబంధం లేనట్లుగా వ్యవహరించటం.. తనకు అనువైన సమయం కోసం ఎంతకాలమైనా వెయిట్ చేయటంలో ఆయనకున్న ఓపిక, సహనం మరే నేతకు లేదనే చెబుతారు. కళ్ల ముందు తాను ఎంతో శ్రద్ధగా నిర్మించుకున్న సామ్రాజ్యం కూలిపోతున్నప్పటికీ బ్యాలెన్స్ తప్పకుండా చూస్తుండి పోయారే తప్పించి హడావుడి పడలేదు. ఆగమాగం కాలేదు.
పట్టు దొరికితే..
అదే సమయంలో తనకు పట్టు దొరికినంతనే వడ్డీ.. చక్రవడ్డీతో సహా వసూలు చేస్తూ లెక్క సెట్ చేయటంలో తనకున్న టాలెంట్‌ను ఇప్పటికే పలుమార్లు చేతల్లో చేసి చూపించారు. అలాంటి గులాబీ బాస్‌కి దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం ఆయన అంచనాలకు భిన్నంగా వచ్చింది. ఎక్కడో జరిగే ఉప ఎన్నికల్లో ఓటమి కేసీఆర్‌ను అంతలా బాధించదు. కానీ తాను.. తన కొడుకు.. తన మేనల్లుడి నియోజకవర్గాల మధ్యలో ఉండే సురక్షిత నియోజకవర్గమైన దుబ్బాకలో పార్టీ ఓటమి. గెలుపు కోసం తానెన్ని ఎత్తులు వేయాలో వేసిన తర్వాత కూడా ఓటమికి గురవటం ఆయన జీర్ణించుకోలేనిదిగా చెబుతారు.
వ్యూహాలకు మరింత పదును
ఇలాంటి వేళ.. తన వ్యూహాలకు మరింత పదును పెట్టే అలవాటు కేసీఆర్ సొంతం. తాజాగా అలాంటి యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో జరగాల్సిన గ్రేటర్ ఎన్నికల్ని రెప్పపాటులో నిర్వహిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. తాజాగా మారిన పరిస్థితుల్లో ఈ నెలాఖరు.. డిసెంబరు మొదటి వారంలో గ్రేటర్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. దీనికి కారణం లేకపోలేదు. దుబ్బాక విజయానందం బీజేపీకి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చి.. గ్రేటర్ మీద గురి పెట్టేందుకు వీలుందన్న ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు సమాచారం.
అదే జరిగితే, గులాబీ పార్టీకి కొత్త తరహా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. అందుకే వారు అలెర్టు అయి.. తమ వ్యూహాన్ని అమలు చేసేందుకు అవసరమైన సమయాన్ని ఇవ్వకుండా వెనువెంటనే ఎన్నికల్ని నిర్వహించాలన్న యోచనలో కేసీఆర్ ఉన్నట్లుగా చెబుతున్నారు. ఏ మాత్రం టైమిచ్చినా కమలనాథులకు గ్రేటర్ ఎన్నికల్లో కలిసి వచ్చే అవకాశం ఉందంటున్నారు. మరో వారం పది రోజులు లేదంటే రెండు వారాల వ్యవధిలో నోటిఫికేషన్ జారీ అయితే.. అట్టే సమయం ఉండదన్నది కేసీఆర్ ఆలోచనగా చెబుతున్నారు.
పక్కా ప్లానింగ్‌తో..
ఇప్పటికే గ్రేటర్ ఎన్నికలపై పక్కా ప్లానింగ్‌తో ఉన్న తమకు వెనువెంటనే ఎన్నికలు లాభిస్తాయని.. గ్రేటర్ ఎన్నికల విజయం దుబ్బాక అపజయాన్ని మర్చిపోయేలా చేస్తుందన్న యోచనలో ఆయన ఉన్నారు. ముందు అనుకున్నట్లుగా 100కు పైగా డివిజన్లలో గెలిచే అవకాశం లేకున్నా 80-90కి ఏ మాత్రం తగ్గవని, వెంటనే ఎన్నికలు నిర్వహిస్తే ఈ స్కోరు మరింత మెరుగు పడే వీలుందన్న మాట వినిపిస్తోంది. అందుకే వెంటనే ఎన్నికలకు వెళ్లిపోతే కమలనాథులు ఉక్కిరిబిక్కిరి అవుతారని, ఆ తొందరలో తప్పులు చేసే వీలుందన్న అంచనాలో కేసీఆర్ ఉన్నట్లు చెబుతున్నారు. మొత్తంగా బీజేపీని టార్గెట్ చేస్తూ గ్రేటర్ ఎన్నికల వ్యూహాన్ని గులాబీ బాస్ సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది.