టార్గెట్ చేసింది ఏదైనా సరే సొంతం కావాల్సిందే అన్నట్లుగా వ్యవహరిస్తుంటారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. తాను అనుకున్నది ఏదైనా సరే.. సామ.. దాన.. దండోపాయాల్లో దేన్నైనా వినియోగించే గుణం ఆయనకు కాస్తంత ఎక్కువే. అనుకోని రీతిలో దుబ్బాక ఉప ఎన్నిక అధికార పార్టీకి వ్యక్తిగత అంశంగా మారటమే కాదు, బయటకు తీసుకోలేనంత లోతుల్లోకి వెళ్లిపోయిన పరిస్థితి. దుబ్బాకలో గెలుపు టీఆర్ఎస్ జీవన్మరణ అంశంగా తయారు చేసుకోవటమే గులాబీ బ్యాచ్ చేసిన అతి పెద్ద తప్పు.
అనూహ్య పరిణామాలు
ఉప ఎన్నికలో తెలంగాణ అధికారపాక్షం పాల్గొంటుందన్నట్లుగా వ్యవహరించి ఉంటే పరిస్థితి ఇప్పటిలా ఉండేది కాదు. అందుకు భిన్నంగా వ్యవహరించటంతో ఏం చేసైనా సరే.. దుబ్బాకలో గెలవటం అనివార్యమన్న పరిస్థితికి తెచ్చుకున్నారు. పోలింగ్‌కు మరి కొద్ది గంటలు మాత్రమే ఉన్న వేళ ఇప్పటికే పలు అనూహ్య పరిణామాలు చోటు చేసుకోవటం తెలిసిందే. భారీ ఎత్తున హవాలా సొమ్ములు ఎన్నికల వేళ బీజేపీ నేతలు పంచుతున్నట్లుగా పలు సందర్భాల్లో పట్టుబడటం, కమలనాథుల మీద మరింత సానుభూతి పెంచేలా చేస్తుంది.
టీఆర్ఎస్ మైండ్ గేమ్
తాజాగా హైదరాబాద్ లో అల్లర్లు ఇతర అంశాల్ని తెర మీదకు తెచ్చిన గులాబీ అధినాయకత్వం ఈ రోజున మరిన్ని వ్యూహాల్ని అమలు చేయనున్నట్లు చెబుతున్నారు. ఇందులో ప్రధానమైనది మైండ్ గేమ్‌గా చెబుతున్నారు. గత ఎన్నికల సమయంలో హైదరాబాద్ మహా నగరంలో వివిధ నియోజకవర్గాల్లో పోటీ చేసిన బలమైన బీజేపీ అభ్యర్థుల్ని వారి అనుచర గణాన్ని భారీ ఎత్తున అధికార పార్టీలో మార్చే ప్రక్రియ జరుగుతుందంటున్నారు. దీనికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ పూర్తి అయినట్లుగా తెలుస్తోంది. ఇదే జరిగితే, కమలనాథులపై కొత్త ఒత్తిడి పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. దీంతో బీజేపీ బలం కాస్త బలహీనం కావటమే కాదు.. నైతిక స్థైర్యం దెబ్బతినే అవకాశం ఉంది. పార్టీలోకి చేరే వారితో బీజేపీ బొక్కలు చెప్పించే వీలుందన్న మాట వినిపిస్తోంది. ఏమైనా.. పోలింగ్ పూర్తయ్యే వరకు లభించే ఏ చిన్న అవకాశాన్ని విడిచిపెట్టకూడదన్న పట్టుదలతో టీఆర్ఎస్ నేతలు ఉన్నట్లుగా చెబుతున్నారు. మరి.. తుది ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.











