అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఒక కొలిక్కి వస్తున్నాయి. డెమోక్రాట్ అభ్యర్థి జో బైడెన్ విజయం దాదాపుగా ఖరారైంది. అధ్యక్షపీఠం అధిరోహించడానికి అందుకోవాల్సిన మ్యాజిక్ ఫిగర్ 270 కాగా, బైడెన్ అందుకే కేవలం 6 సీట్ల దూరంలోనే ఉన్నాడు. ఇప్పటికే బైడెన్‌కు 264 సీట్లు లభించాయి.
ప్రస్తుత అధ్యక్షుడు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కు ఇప్పటిదాకా కేవలం 214 ఓట్లు మాత్రమే లభించాయి. బరిలో ఉన్న ఇతర అభ్యర్థులకు ఒక్క సీటు కూడా దక్కలేదు.
ఈ లెకక ప్రకారం.. అమెరికాలో మొత్తం ఎలక్టోరల్ ఓట్ల సంఖ్య 538 కాగా, ఇంకా 60 స్థానాల ఫలితం తేలవలసి ఉంది. ఈ 60 స్థానాల ఫలితాలు వెలువడేక్రమంలో.. జో బైడెన్‌కు మరో 6 సీట్లు దక్కితే చాలు.. ఆయన అధ్యక్షుడు అయినట్టే. విజయానికి చాలా స్వల్పదూరంలోనే బైడెన్ ఉన్నారు.
కీలకమైన మిషిగన్ ఫలితాలు ట్రంప్ తలరాతను మార్చేశాయి. అక్కడ బైడెన్ పైచేయి సాధించడంతో అదివరకు కొన్ని కీలక రాష్ట్రాల్లో ట్రంప్ ముందంజలో ఉన్నప్పటికీ ఫలితం మారిపోయింది. మిషిగన్ ఫలితాలపై ట్రంప్ అక్కడి రాష్ట్ర కోర్టును ఆశ్రయించారు. భారత కాలమానం ప్రకారం… బుధవారం సాయంత్రం నుంచే.. తాను కోర్టును ఆశ్రయిస్తానని.. లెక్కింపు నిలిపివేయాలని రకరకాలుగా కొత్త పాట ఎత్తుకుంటూ.. ట్రంప్.. తనలోని ఓటమి భయాన్ని బయటపెట్టుకున్నారు. దానికి తగ్గట్టుగానే ఫలితాలు తేలబోతున్నాయి. జో బైడెన్.. స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించేశారు.

సులువుగా జరిగేనా..
అమెరికాలో అధ్యక్ష స్థానానికి ఎన్నికలు జరిగినప్పుడు అధికార బదలాయింపు అనేది చాలా సరళమైన ప్రక్రియ. ఓడిపోయిన వారు జెంటిల్‌మెన్ షేక్ హ్యాండ్ లాగా.. చేతులు కలిపి.. గెలిచిన వారికి అధికారం అప్పగించి సీటునుంచి దిగిపోతారు. అయితే.. ఓడిపోయిన వారు ఆ రకంగా ప్రజాతీర్పును గౌరవించకుండా.. సీటు దిగనని మొండికేస్తే పరిస్థితి ఏంటి? కొత్త క్వర్రీలు పెడితే, కొన్ని చోట్ల ఎన్నికలను రద్దు చేస్తే.. ఎలాంటి పరిస్థితి తలెత్తుతుంది. ఇలాంటి భయాలకు అక్కడ పరిష్కారం లేదు. అధికార బదలాయింపులో సమస్య ఏర్పడితే మార్గమేంటనే సూత్రాలు అక్కడి రాజ్యాంగంలో లేవు. వారు అలాంటి ఆలోచన చేయలేదు. ఇప్పుడు ట్రంప్- ఆల్రెడీ మొండికేయడం ప్రారంభించిన నేపథ్యంలో అధికార బదలాయింపులో కొత్త చిక్కులు వస్తే ఏమవుతుందో వేచిచూడాలి.











