హైదరాబాద్‌లో మొహర్రం ఊరేగింపునకు హైకోర్టు అనుమతి నిరాకరించింది. అంబారి ఊరేగింపు కు అనుమతి ఇవ్వాలని హైకోర్టు లో ఫాతిమా సేవా దల్ పీటీషన్ వేసింది. ఈ నెల 30న పాతబస్తీ డబీర్‌పురా బీబీకా అలావా నుంచి చాదర్ ఘాట్ వరకు మొహర్రం ఊరేగింపునకు అనుమతి ఇవ్వాలని పిటీషనర్ కోరారు. ఊరేగింపుకు ఇతర రాష్ట్రాల నుంచి ఏనుగులను సొంత ఖర్చులతో తెప్పించుకుంటామని, రాష్ట్ర ప్రభుత్వం అనుమతించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఊరేగింపుకు అనుమతులు ఇచ్చేలా పోలీసు కమిషనర్‌ను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు.
హైకోర్టు ఈ పిటిషన్ పై విచారణను ఇవాళ చేపట్టింది. పిటిషనర్ తరపు కౌన్సిల్ పాండురంగారావు తమ వాదనలను వినిపించారు. తరతరాలుగా వస్తున్న సంప్రదాయాలను దృష్టిలో పెట్టుకొని ఈ ఊరేగింపుకు అనుమతి ఇవ్వాలని కోరారు. మంగళవారం మొహర్రం ఊరేగింపునకు సంబంధించి ఓ వ్యాజ్యాన్ని విచారించిన ఉన్నత న్యాయస్థానం నిరాకరించిందనే విషయాన్ని తెలియచేసిన హైకోర్టు తాము ఈ విషయం లో స్పందించలేమని తేల్చిచెప్పింది. సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ తాము మొహర్రం ఊరేగింపునకు ఆదేశాలు జారీచేయలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రస్తుత పరిస్థితులలో కేంద్ర హోం మంత్రిత్వశాఖ మార్గదర్శకాల ప్రకారం ఊరేగింపులకు అనుమతి ఇవ్వరాదని వెల్లడించింది.
మసీదులు, దేవాలయాల్లో మతపరమైన కార్యకలాపాలకు సంబంధించి ఏదైనా సమస్యలు ఉంటే పరిస్కారం కనుగొనవచ్చని హైకోర్ట్ అభిప్రాయపడింది. కరోనా సమయంలో సభలు, సమావేశాలు,ఊరేగింపులకు అనుమతి లేదనే విషయాన్ని కోర్టు గుర్తు చేసింది. కొన్ని రోజుల కిందట వినాయక చవితి ఉత్సవాలకు కూడా కోర్ట్ అనుమతి నిరాకరించిన సంగతి తెలిసిందే. ప్రజల నమ్మకాలు, విశ్వాసాలు కంటే వారి ప్రాణాలు తమకు ముఖ్యమని హైకోర్టు తమ ఉద్దేశాన్ని స్పష్టం చేసింది.