టీటీడీ పరిధిలోని పలు సమస్యలపై చర్చించడానికి పాలకమండలి భేటీ నిర్వహించింది. సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపినట్లు తెలుస్తుంది. తిరుమల లోకి వాతావరణాన్ని సంరక్షించడానికి ఏం చేయాలని చర్చించినట్టు తెలుస్తుంది. అంతేకాదు, తిరుమల ఉపాలయాలకు అందించాల్సిన సేవల గురించి కూడా చర్చకు వచ్చింది.
పాలకమండలి నిర్ణయాలివే
తిరుమలలో పర్యావరణం పరిరక్షణ కోసం ఎలక్ట్రిక్ బస్సులు వాడకంతో పాటు సోలార్ పవర్, హైడల్ పవర్ లకు ప్రాధాన్యత ఇవ్వాలని పాలకమండలి నిర్ణయం తీసుకుంది. తిరుమలలో వివిధ కాటేజీల మరమ్మతుల కోసం 29 కోట్లు కు ఆమోదం తెలిపింది. పేద ప్రజలకు ఉపయోగపడే టీటీడీ కల్యాణమస్తూ పథకాన్ని పున: ప్రారంభించాలని కమీటీ నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఈ పథకాన్ని అన్ని జిల్లా కేంద్రాల్లో అములుచేయాలని నిర్ణయించింది. దీని ద్వారా పేదలకు వివాహాలు జరిపించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. తిరుచానూరు పద్మావతి అమ్మవారి సూర్యప్రభవాహనం ని 11 కేజీల బంగారంతో స్వర్ణమయం చేయాలని నిర్ణయించారు. తిరుపతి బాల మందిరం పాఠశాలలో అదనపు గదులు, హాస్టల్ భవన నిర్మాణానికి అవసరమయ్యే 10 కోట్లు కేటాయింపునకు మండలి ఆమోద ముద్ర వేసింది. శ్రీవారి నగదు డిపాజిట్లను బ్యాంకుల్లోనే కొనసాగించాలని పాలక మండలి నిర్ణయించింది.
వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు
వైకుంఠ ఏకాదశి సందర్భంగా పదిరోజులపాటు వైకుంఠ ద్వారం తెరిచి ఉంచాలని నిర్ణయించారు. మఠాధిపతులు, పీఠాధిపతులు అభిప్రాయాల సేకరణ అనంతరం పది రోజుల పాటు వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంచాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేశారు. మొత్తం 26 మంది మఠాధిపతులు, పీఠాధిపతులు అభిప్రాయాలు తీసుకున్నట్లు టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి స్వయంగా వెల్లడించారు. వైకుంఠ ద్వారాలు పది రోజులపాటు తెరచిఉంచే సాంప్రదాయం చాలా వైష్ణవ ఆలయాల్లో ఉందని, కాబట్టి ఎటువంటి దోషం లేదని తెలియజేశారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా డిసెంబర్ 25 నుండి 10 రోజులపాటు వైకుంఠ ద్వారాలు తెరుచుకోబోతున్నాయి.
తిరుమల ఆస్తులివే
టీటీడీ చైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి తిరుమల ఆస్తులకు సంబంధించిన శ్వేత పత్రం విడుదల చేశారు. 1974 నుండి 2014 వరకు మొత్తం టీటీడీ ఆస్తుల వివరాలిలా ఉన్నాయి. దేశవ్యాప్తంగా టీటీడీకి 1,128 ఆస్తులు ఉన్నాయిని తెలిపారు. అందులో 8,088.89 సెంట్ల ఎకరాల స్థలాలు ఉన్నట్లు వెల్లడించారు. వ్యవసాయ ఆస్తులు 233 అందులో మొత్తం 2085.41 సెంట్లు. వ్యవసాయేతర ఆస్తులు 895, మొత్తం 6003.48 సెంట్లు. 1974 నుండి 2014 వరకు అమ్మబడిన ఆస్తులు మొత్తం 141, 335.23 సెంట్లు, వ్యవసాయ ఆస్తులు మొత్తం 61 293.02 సెంట్లు, వ్యవసాయేతర ఆస్తులు 80, 42.21 సెంట్లు. ఆస్తులు అమ్మగా వచ్చిన ఆదాయం 6 .13 కోట్లు.