ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ టిక్ టాక్ ను సొంతం చేసుకోవాలని ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ చర్చలు జరుపుతున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 15 నాటికీ తమ చర్చలు పూర్తవుతాయని మైక్రోసాఫ్ట్ ప్రతినిధులు ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మీడియా సంస్థ ‘బ్లూంబెర్గ్’ రాసిన ఓ కథనం మార్కెట్ వర్గాలను సందేహాలలోకి నెట్టింది. సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ కూడా టిక్ టాక్ ను సొంతం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తోందని కథనాన్ని ప్రచురించింది. మైక్రోసాఫ్ట్ లాంటి ట్రిలియన్ డాలర్ల సంస్థను కాదని 20 బిలియన్ డాలర్ల సంస్థ టిక్ టాక్ ను ఎలా సొంతం చేసుకుంటుందనే చర్చ జరుగుతోంది. చైనా సంస్థ బైట్ డ్యాన్స్ కు చెందిన టిక్ టాక్ ను ఎవరు సొంతం చేసుకోనున్నారో తెలియాలంటే కొన్ని రోజులు ఆగవలసిందే.
సరిహద్దులలో ఉద్రిక్తతల నేపథ్యంలో మొదటగా చైనాకు చెందిన 59 యాప్ లను భారత ప్రభుత్వం నిషేదించిన సంగతి తెలిసిందే. ఆ 59 యాప్ లలో టిక్ టాక్ కూడా ఉంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ యాప్ ను గూగుల్, యాపిల్ ప్లే స్టోర్ తొలగించాయి. భారత్ లాంటి పెద్ద మార్కెట్ ను కోల్పయి తీవ్ర ఇబ్బందులలో చిక్కుకున్న టిక్ టాక్ కు అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూడా షాక్ ఇచ్చాడు. కరోనా మహమ్మారి పుట్టుకకు చైనా కారణమని చాలా రోజులుగా విమర్శలు చేస్తున్న ట్రంప్ జాతీయ భద్రతను దృష్టిలో పెట్టుకుని చైనా తయారు చేసిన టిక్‌టాక్‌ను నిషేధిస్తామని ప్రకటించాడు. ప్రకటించిన మేరకు టిక్‌టాక్ యాప్‌తో అమెరికాలోని అన్ని సంస్థలూ 45 రోజుల్లోగా లావాదేవీలు రద్దు చేసుకోవాలని ఆదేశాలు జారీ చేశాడు. మైక్రోసాఫ్ట్ సంస్థ టిక్ టాక్ తో చర్చలు జరుపుతున్న సమయంలో ఈ ఆదేశాలు రావడం గమనార్హం. వేరే దేశాల సంస్థలు టిక్ టాక్ ను టేకోవర్ చేస్తే ట్రంప్ ఎలా స్పందిస్తాడనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.