నిజమే… ఐదు రోజుల క్రితం ముగిసిన తిరుపతి లోక్సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నిక ఫలితం రాష్ట్రంలోని రెండు ప్రధాన పార్టీల అధినేతల తలరాతలను మార్చేయనుందన్న విశ్లేషణలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. తిరుపతి ఉప ఎన్నిక ఫలితం వచ్చే నెల 2న వెల్లడి కానుంది. ఈ ఫలితం తీరును బట్టి ప్రధాన ప్రతిపక్షం తెలుగు దేశం పార్టీకి సంబంధించి ఏపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుల భవిష్యత్తు నిర్ధారించబడుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. తిరుపతి ఫలితంలో ఈ రెండు పార్టీలకు ఏ మేర ఓట్లు వచ్చాయన్న అంశంపైనే వీరిద్దరి భవితవ్యం ఆధారపడి ఉంటుందన్న వాదనలూ ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఈ విశ్లేషణలకు సంబంధించి ప్రస్తుతం జరుగుతున్న వాదోపవాదాలు ఏమిటన్నవిషయం పరిశీలిస్తే..
అభ్యర్థిని ముందే ప్రకటించిన టీడీపీ
తిరుపతి ఎంపీగా ఉన్న వైసీపీ నేత బల్లి దుర్గా ప్రసాదరావు అనారోగ్య కారణాలతో మృత్యువాత పడిన నేపథ్యంలో తిరుపతి లోక్సభ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది. ఈ ఉప ఎన్నికలో తమ అభ్యర్థిగా బల్లి దుర్గాప్రసాదరావు కుటుంబ సభ్యులనే వైసీపీ ఎంపిక చేసి ఉంటే… ఉప ఎన్నిక ఏకగ్రీవం అయ్యే అవకాశాలుండేవి. అయితే ఆ సంప్రదాయానికి నీళ్లు వదిలిన వైసీపీ… బల్లి దుర్గాప్రసాదరావు కుటుంబ సభ్యులకు కాకుండా తనకు వ్యక్తిగత ఫిజియోగా వ్యవహరిస్తున్న గురుమూర్తి పేరును వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ఈ విషయాన్ని ముందే పసిగట్టిన టీడీపీ ముందే అభ్యర్థిని ప్రకటించేసింది. అదే సమయంలో జనసేనతో పొత్తు పెట్టుకున్న బీజేపీ కూడా తన అభ్యర్థిగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారిణి రత్నప్రభను ఎంపిక చేసింది. ఇక గెలుపు ధీమాతో జబ్బలు చరుచుకున్న వైసీపీ… గురుమూర్తి విజయం ఖాయమంటూ ప్రచారం మొదలెట్టేసింది. అదే సమయంలో వైసీపీకి ఓటమి దక్కేలా టీడీపీ కూడా పక్కాగా ప్లాన్ రచించింది. ఎన్నికల ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కించింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తనదైన శైలిలో యువ రక్తాన్ని బరిలోకి దించేసి నిజంగానే కొత్త శైలి ప్రచారాన్ని ఊర్రూతలూగించారు. బీజేపీ కూడా ఏకంగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను పిలిపించి మరీ ప్రచారం చేయించింది.
అచ్చెన్న ఆడియో టేపును పెద్దగా పట్టించుకోని పార్టీ
ఇక్కడి దాకా బాగానే ఉన్నా… ఎన్నికల ప్రచారం ముగుస్తున్న వేళ… పార్టీ వ్యవహార శైలిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లుగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఓ వీడియో టీడీపీ శిబిరంలో పెను కలకలమే రేపింది. పార్టీ స్టాండ్, పార్టీ అధినాయకత్వంపై అచ్చెన్న చేసినట్లుగా భావిస్తున్న సదరు వ్యాఖ్యలు నిజంగానే టీడీపీ శ్రేణులను కలవరపాటుకు గురి చేశాయి. అయితే పార్టీ అధినాయకత్వం మాత్రం అచ్చెన్న ఆడియో టేపును పెద్దగా పట్టించుకోనట్టే వ్యవహరించింది. అంతేకాకుండా అచ్చెన్నతోనే కలిసి పని చేసింది. ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న దరిమిలా అచ్చెన్నను పల్లెత్తు మాట కూడా అనకుండానే తన హూందాతనాన్ని ప్రదర్శించింది. ఈ వీడియో బయటకు వచ్చిన రోజు టీడీపీ ప్రచారం కాస్తంత తగ్గినా… మరుక్షణమే ప్రచార పర్వంలో ఏమాత్రం తొట్రుపాటు లేకుండా పార్టీ అధిష్ఠానం జాగ్రత్తలు తీసుకుంది.
Also Read ;- టీడీపీ నిబద్ధత కలిగిన పార్టీ.. పక్కా నిదర్శనం ఇదిగో!
వీర్రాజుకు క్గాస్ పీకిన నడ్డా
ఇక బీజేపీ విషయానికి వస్తే… ఎన్నికల ప్రచారానికి సంబంధించి హడావిడి మొదలయ్యేదాకా అభ్యర్థి గురించి తేల్చుకోలేకుండానే సాగిన బీజేపీ… తీరా నామినేషన్ల గడువు సమీపిస్తున్న తరుణంలో కర్ణాటక కేడర్ ఐఏఎస్, ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి ఇటీవలే రిటైర్ అయిన రత్నప్రభను తన అభ్యర్థిగా ప్రకటించింది. అంతేకాకుండా తన మిత్రపక్షం జనసేన ఇక్కడి నుంచి పోటీ చేస్తానని ఒత్తిడి తెచ్చినా.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఎంతమాత్రం పట్టించుకున్నట్లుగా కనిపించలేదు. అభ్యర్థిని జాతీయ నాయకత్వం నిర్ధారిస్తుందంటూ ప్రకటనలు గుప్పించిన వీర్రాజు… పార్టీ అధిష్ఠానాన్ని తనదైన శైలిలో మేనేజ్ చేసుకుని రత్నప్రభ అభ్యర్థిత్వాన్ని ఓకే అనిపించుకున్నారు. రత్నప్రభ అభ్యర్థిత్వం ఖరారు కాగానే… ఎందుకనో గానీ… ఎన్నికల ప్రచారంలో పాలుపంచుకునే విషయంలో జనసేనాని పవన్ కల్యాణ్ పెద్దగా ఆసక్తి చూపలేదు. ఈ విషయాన్ని అంతగా పట్టించుకోని వీర్రాజు… తిరుపతి ఎన్నికలో తమదే గెలుపు అని జబ్బలు చరుచుకుని, అదే విషయాన్ని అధిష్ఠానానికి చెప్పి పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను ప్రచారానికి పిలుచుకువచ్చారు. అప్పటిదాకా వీర్రాజు చెప్పినదంతా నిజమేనని నమ్మిన నడ్డా… తీరా తిరుపతిలో అడుగు పెట్టగానే పార్టీ పరిస్థితి ఏమిటో? ఎన్నికల్లో పార్టీ ఏ మేర సత్తా చాటగలదో ఇట్టే గ్రహించేశారు. దీంతో అక్కడికక్కడే వీర్రాజును లెఫ్ట్ అండ్ రైట్ క్లాస్ పీకిన నడ్డా… అసలు బూత్ కమిటీలు లేకుండా ఎన్నికల బరిలోకి ఎలా దిగారంటూ వాయించేశారట. నిజాలు దాచి ఎన్నికల బరిలోకి దిగిన పార్టీని విజయతీరాలకు చేర్చాల్సిన బాధ్యత నీదేనని, పార్టీకి ఎలాంటి ఫలితం వచ్చినా… బాధ్యత వహించాల్సిందేనని కూడా వీర్రాజుకు నడ్డా చెప్పి మరీ ఢిల్లీ వెళ్లారట.
ఇద్దరి పరిస్థితి ఇలా..
మొత్తంగా అటు ఆడియో టేపుతో అచ్చెన్న, ఇటు నడ్డా రాకతో వీర్రాజుల పరిస్థితి అయోమయంలో పడిపోయింది. 2019 సార్వత్రిక ఎన్నికలో బీజేపీకి నోటా కంటే కూడా తక్కువ ఓట్లే వచ్చాయి. తాజాగా ఈ ఎన్నికలో బీజేపీ అభ్యర్థి రత్నప్రభకు గెలుపు మాట అటు పక్కనపెడితే… కనీసం డిపాజిట్ అయినా దక్కి తీరాలి. లేదంటే మాత్రం… బీజేపీ ఏపీ అధ్యక్షుడిగా వీర్రాజు రాజీనామా చేయక తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే గ్రౌండ్ రిపోర్ట్ చూసినా… ఇప్పుడు బీజేపీకి డిపాజిట్ దక్కే పరిస్థితి అయితే కనిపించడం లేదు. అంటే… తిరుపతి ఫలితం తర్వాత వీర్రాజు తట్టా బుట్టా సర్దేసుకోవాల్సిందేనన్న మాట. ఇక అచ్చెన్న విషయానికి వస్తే… పార్టీకి వీర విధేయుడిగా ఉంటూ వస్తున్న కారణంగా ఆయనకు ఈ మధ్యనే పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు దఖలు పడ్డాయి. తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలోనూ అచ్చెన్న తన శక్తి మేర ప్రచారంలో పాలుపంచుకున్నారు. పార్టీ శ్రేణులను కదిలించారు కూడా. అయితే సరిగ్గా పోలింగ్ దగ్గరపడుతున్న దరిమిలా…ఎవరో ఓ పార్టీ కార్యకర్త రెచ్చగొడితే ముందూ వెనుకా చూసుకోకుండా పార్టీపై దురుసు వ్యాఖ్యలు చేసి అడ్డంగా బుక్కైపోయారన్న వాదనలు వినిపిస్తున్నాయి. 2019 ఎన్నికల్లో పార్టీ అభ్యర్థికి దాదాపు 5 లక్షల మేర ఓట్లు వచ్చాయి. ఇప్పుడు పార్టీ శ్రేణులు, అధినాయకత్వం మొత్తం రంగంలోకి దిగి శ్రమించారు. ఇలాంటి నేపథ్యంలో అచ్చెన్న ఆడియో టేపు పార్టీని ఇరుకున పెట్టేసింది. ఇప్పుడు పార్టీ అభ్యర్థి పనబాకకు 5 లక్షల కంటే తక్కువ ఓట్లు పోలైతే మాత్రం అచ్చెన్న కుర్చీ కిందకు నీళ్లు రావడం ఖాయమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఆ పరిస్థితి వచ్చే అవకాశాలే లేవన్నది విశ్లేషకుల మాట.
Must Read ;- తిరుపతిలో వైసీపీ గళం మూగబోయింది.. రీజనేంటో తెలుసా?