గుంటూరు కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. 15 సంవత్సరాల తరవాత గుంటూరులో కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్నాయి. చివరగా గుంటూరులో 2005లో కార్పొరేషన్ ఎన్నికలు జరిగాయి. 2005లో కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థులుగా కన్నా నాగరాజు, రాయపాటి మోహనకృష్ణ చెరి రెండున్నరేళ్లు పదవి నిర్వహించారు. ఆ తరవాత గుంటూరు శివారులోని 10 గ్రామాలు కార్పొరేషన్లో విలీనం చేయడంతో వారు కోర్టును ఆశ్రయించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు గుంటూరు కార్పొరేషన్ ఎన్నికలు నిలిచిపోయాయి. దాదాపు 15 సంవత్సరాల తరవాత గుంటూరు కార్పొరేషన్‌కు ఎన్నికలు జరుగుతున్నాయి. ఎలాగైనా గుంటూరులో విజయం సాధించాలని అధికార, ప్రతిపక్ష పార్టీలు పావులు కదుపుతున్నాయి.
టీడీపీ మేయర్ అభ్యర్థిగా కోవెలమూడి రవీంధ్ర
గుంటూరు టీడీపీ మేయర్ అభ్యర్థిగా కోవెలమూడి రవీంధ్రను ప్రకటించింది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్న కోవెలమూడి రవీంధ్రకు పార్టీలో మంచి ఆదరణ ఉంది. గతంలో ఎలాంటి పదవులు నిర్వహించకపోవడంతో అవినీతి ఆరోపణలు కూడా లేవు. టీడీపీ మేయర్ అభ్యర్థిగా కోవెలమూడి రవీంధ్ర పేరు ప్రకటించడంతో ప్రచారం జోరందుకుంది. గుంటూరులో కమ్మ, బీసీ సామాజికవర్గాలు అత్యధికంగా ఉన్నాయి. టీడీపీ కమ్మ సామాజికవర్గానికి చెందిన కోవెలమూడి రవీంధ్రను మేయర్ అభ్యర్థిగా రంగంలోకి దింపడంతో, వైసీపీ బీసీ అస్త్రం ప్రయోగించింది. ఇరు పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. రాజధాని తరలించడం, పన్నుల పెంపుదల వంటి అంశాలను టీడీపీ అభ్యర్థులు అస్త్రంగా వాడుతున్నారు. వైసీపీ గెలిస్తే పన్నులు 5 రెట్లు పెరిగిపోతాయనే అంశాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ల గలుగుతున్నారు. దీంతో టీడీపీ ప్రచారంలో దూసుకుపోతోంది. అయితే గుంటూరు సిటీలోని రెండు నియోజకవర్గాల్లో తూర్పు నుంచి వైసీపీ ఎమ్మెల్యే, పశ్చిమలో టీడీపీ అభ్యర్థులు గెలిచారు. పశ్చిమలో గెలిచిన మద్దాల గిరి కూడా వైసీపీలో చేరడంతో ఇక టీడీపీ కొంత బలహీనపడిందని చెప్పవచ్చు. మద్దాల గిరి సామాజిక వర్గానికి చెందిన వైశ్యులు వైసీపీ వైపు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. అయితే వారు నగరంలో పెద్దగా లేకపోవడంతో టీడీపీ అభ్యర్థులు లైట్ తీసుకుంటున్నారు.
Must Read ;- టీడీపీ దూకుడు, వైసీపీలో తడబాటు.. హాట్ హాట్‌గా విజయవాడలో ఎన్నికల ప్రచారం
వైసీపీ మేయర్ అభ్యర్థులుగా ఇద్దరు
గుంటూరు నగరంలో గెలవాలంటే కమ్మ సామాజిక వర్గం లేదంటే బీసీలను రంగంలోకి దించడం అనేది రాజకీయ పార్టీలు పాటిస్తున్న సూత్రమే. గతంలోనూ బీసీలు గుంటూరు నగర మేయర్‌గా పనిచేశారు. నగరంలో వారి జనాభా అధికంగా ఉండటంతో బీసీలకు వైసీపీ అవకాశం కల్పించింది. వైసీపీ ఆవిర్బావం నుంచి పార్టీలో పనిచేస్తున్న కాపటి మనోహర్ నాయుడు, పాదర్తి రమేష్ గాంధీలను మేయర్ అభ్యర్థులుగా ప్రకటించింది. పార్టీ గెలిస్తే చెరి రెండున్నరేళ్లు మేయర్ పదవిని పంచుకోనున్నారు. ఇద్దరూ బీసీ నాయకులు కావడం, అది కూడా వేరు వేరు బీసీ కులాలకు చెందిన వారు కావడంతో వైసీపీ బీసీ ఓట్లకు గాలం వేసిందనే చెప్పవచ్చు. ఇక ఇద్దరు మేయర్ అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇద్దరూ నగరంలో చెరో ప్రాంతంలో పట్టున్న నేతలు కావడంతో వైసీపీ గెలుపు ఖాయంగా కనిపిస్తోంది. టీడీపీ గుంటూరు పశ్చిమలో ప్రభావం చూపగలిగినా, తూర్పులో వైసీపీ గెలుపునకే ఎక్కవ అవకావాలు కనిపిస్తున్నాయి. 52 వార్డుల్లో 30 వార్డుల్లో వైసీపీ బలంగా ఉంది. మరో 22 వార్డుల్లో టీడీపీ ప్రభావం చూపుతోంది.
పడకేసిన నగరాభివృద్ధి
గత రెండేళ్లుగా గుంటూరు నగరాభివృద్ధి పడకేసింది. ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. ఇది అధికార పార్టీకి మైనస్. ఇక పన్నుల పెంపు అంశం తాత్కాలికంగా వాయిదా వేసినా, ఎన్నికలు అయిపోగానే భారీగా పన్నుల పెంపు బాధుడు ఉంటుందనే విషయం జనానికి అర్థమైపోయింది. ఈ అంశం అధికార పార్టీకి మైనస్ కాగా, ప్రతిపక్ష టీడీపీకి కలసివచ్చే అంశంగా ఉంది. టీడీపీ పాలనలో గుంటూరులో వెయ్యి కోట్లతో చేపట్టిన భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా వదిలేశారు. కేంద్రం నుంచి నిధులు రావాల్సి ఉన్నా, వైసీపీ నేతలు పట్టించుకోక పోవడంతో అవి నిలిచిపోయాయి. ఇవన్నీ వైసీపీ అభ్యర్థులను ఇబ్బంది పెట్టే అంశాలుగా ఉన్నాయి. ఇక గుంటూరు నగరం నడిబొడ్డులో ఉన్న కూరగాయల మార్కెట్ స్థలాన్ని అమ్మడానికి వైసీపీ ప్రభుత్వం వేలం నిర్వహించే ప్రయత్నం చేసింది. టెండర్లు కూడా పిలిచారు. పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. ఈ అంశం అధికార పార్టీ నేతలకు చుక్కలు చూపిస్తోంది. వైసీపీ గుంటూరులో గెలిస్తే కూరగాయల మార్కెట్ స్థలాన్ని మరలా అమ్ముతారంటూ టీడీపీ అభ్యర్థులు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇలా ఎవరికి వారు గుంటూరు కార్పొరేషన్లో పాగా వేసేందుకు ప్రచారంలో దూసుకుపోతున్నారు.
Also Read ;- టీడీపీ శ్రేణులకు మనోధైర్యం.. మూడువైపులా నేతల ప్రచారం