( విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
ప్రతిపక్షాల ఆస్తుల కూల్చివేతలో ప్రభుత్వం చూపించే చిత్తశుద్ధి… విద్యార్థుల తల్లిదండ్రుల సమస్యలపై చూపించి ఉంటే… ఎక్కడికక్కడ తల్లిదండ్రులు రోడ్డెక్కి నినదించే పరిస్థితి రాకపోయి ఉండేది. విద్యా హబ్‌గా వెలుగొందుతున్న విశాఖలో ఉన్నత విద్యనభ్యసించిన ఎందరో తల్లిదండ్రులు… ఫీజుల కోసం యాజమాన్యాలతో పోరాటం చేస్తున్నారు. కరోనా వైరస్ విపత్తును దృష్టిలో పెట్టుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్కూల్ యాజమాన్యాలు వసూలు చేయాల్సిన ఫీజులపై నియంత్రణ విధించాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ స్కూల్ తల్లిదండ్రులు సౌకర్యార్ధం 8 నెలల క్రితం ట్యూషన్ ఫీజు మాత్రమే వసూలు చేయాలని ఒక జీవోను విడుదల చేసింది. కానీ ఏపీలో చాలాచోట్ల ఈ ఆదేశాలు శతశాతం అమలవుతున్న దాఖలాలు లేవు. విశాఖలో ఉన్నటింపని స్కూల్ యాజమాన్యంతో పాటు మరికొన్ని పాఠశాలలు ఈ జి.ఓ. అమలు సాధ్యం కాదని తల్లిదండ్రులకు తెగేసి చెబుతున్నాయి. మొత్తం ఫీజు చెల్లిస్తేనే విద్యార్థులను ఆన్ లైన్ క్లాసులకు అనుమతిస్తామని ఎటువంటి భయం లేకుండా చెబుతున్నాయి. ఫీజులు చెల్లించని ఎందరో విద్యార్థులను ప్రస్తుతం నిర్వహిస్తున్న పరీక్షలకు సైతం అనుమతించడం లేదు.
ప్రముఖుల పిల్లలు అంతా అక్కడే..
విశాఖ నగరంలో బ్యూరోక్రాట్లు మొదలు… వ్యాపారవేత్తలు, పోలీసులు, రెవెన్యూ, జీవీఎంసీ ఇలా ఒక్కరు కాదు… డబ్బు, పలుకుబడి ఉన్న ప్రతి ఒక్కరూ తమ పిల్లలను టింపని స్కూల్లో చదివించేందుకు తొలి ప్రాధాన్యం ఇవ్వడంతో.. యాజమాన్యానికి కొమ్ములు వచ్చేశాయన్న విమర్శలొస్తున్నాయి. దీంతో పూర్తి ఫీజు చెల్లిస్తే గాని కుదరదని యాజమాన్య ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు. దీనిపై ఇప్పటికే పేరెంట్స్ కమిటీ స్కూల్ ఎదుట ఆందోళన చేసింది. డి. ఇ. ఓ, కలెక్టర్, జె. సి, ఎంపీ విజయ్‌సాయిరెడ్డి, విద్య శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌కి పలుమార్లు లేఖలు, వినతి పత్రాలను సమర్పించారు. దీనికి స్పందించిన డి. ఇ. ఓ. టింపని స్కూల్ కి షోకాజ్ నోటీస్‌లు కూడా ఇచ్చారు. దీనికి స్కూల్ యాజమాన్యం వింతగా సమాధానం ఇస్తూ ….ఏ ఒక్క తల్లితండ్రుల నుండి ఎటువంటి ఫిర్యాదులు రాలేదని యధావిధిగా అందరికి ఆన్ లైన్ తరగతులు నిర్వహిస్తున్నామని, ఫీజుల కోసం ఎటువంటి ఒత్తిడి పెట్టలేదని జవాబు ఇచ్చింది. దీనిపై మండిపడ్డ విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్ గేట్ ఎదుట “మే ఐ హెల్ప్ యు” నినాదంతో మిగిలిన విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర నుంచి ఫిర్యాదులు తీసుకునే కార్యక్రమాన్ని ప్రారంభించారు. తల్లిదండ్రులతో యాజమాన్యం ఎన్నో గొడవలు పడిన తర్వాత కూడ ఇటువంటి సమాధానం ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రుల సౌకర్యార్థం మరికొన్ని రోజులు స్కూల్ గేట్ వద్ద ఉండి ఫిర్యాదులు తీసుకుంటామని పేరెంట్స్ కమిటీ సభ్యులు స్పష్టం చేశారు. న్యాయం జరగకపోతే ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి స్పందించే విధంగా పోరాటం చేస్తామని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు హెచ్చరిస్తున్నారు.
తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుల విద్యాసంస్థలపై ఆగమేఘాలపై చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం, ఇతర విద్యాసంస్థల నుంచి సామాన్యులకు సమస్యలు ఎదురవుతున్నా స్పందించక పోవడం గమనార్హం.
Must Read ;- జగన్ నియోజకవర్గంలో దళిత మహిళపై దారుణం