కరోనా తీవ్రత నేపథ్యంలో దేశంలో మార్చి 24 నుంచి కఠినమైన లాక్ డౌన్ ను అమలు చేసిన విషయం విదితమే. పలుమార్లు లాక్ డౌన్ ను పొడిగించిన కేంద్రం మే 31 నుంచి అన్ లాక్ చేస్తూవస్తోంది. ఇప్పటికే హోటల్స్, షాపింగ్ మాల్స్, దేవాలయాలు, యోగ సెంటర్లకు కేంద్రం అనుమతులు ఇస్తూ నిర్ణయం తీసుకొంది. స్కూళ్ళు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లు, థియేటర్లు, బార్లు, అంతరాష్ట్ర రవాణా సదుపాయాలు, మెట్రో సర్వీసులపై కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ నేపథ్యంలో కేంద్రం అన్ లాక్ 4.0లలో వీటికి అనుమతి ఇవ్వనుందని వార్తలు ప్రచారంలో ఉన్నాయి.
కానీ అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు అన్ లాక్ 4.0లలో కేంద్రం అంతరాష్ట్ర రవాణా, మెట్రో సర్వీసులకు మాత్రమే అనుమతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. స్కూళ్ళు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లు, థియేటర్లు, బార్లపై నిషేధాలను అలాగే కొనసాగించాలని కేంద్రం ఆలోచనగా ఉందని సమాచారం. కరోనా ఉదృతి తగ్గకపోవడంతో బాటు రికవరీ రేటు పెరిగేవరకు వీటికి అనుమతి ఇవ్వరాదని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినబడుతున్నాయి. అన్ లాక్ 4.0లో అంతరాష్ట్ర రవాణా, మెట్రో సర్వీసులకు అనుమతి ఇచ్చినా తుది నిర్ణయం మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలివేయాలని కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
కేంద్రం మార్గదర్శకాలను విడుదల చేయకముందే ఏపీ-తెలంగాణ ఆర్టీసీ అధికారులు అంతరాష్ట్ర రవాణా సౌకర్యాలపై చర్చలు జరిపారు. కర్ణాటక రాష్ట్రం కూడా ఇప్పటికే దాదాపు అన్నీ రంగాలకు అనుమతి ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఢిల్లీ సీఎం అరవింద్ క్రేజ్రీవాల్ మెట్రోను నడిపేందుకు అనుమతులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ కూడా వ్రాశారు. ఇదే సమయంలో చాలా రాష్ట్రాలు కేంద్రం అనుమతుల కోసం ఎదురుచూస్తుండగా కొన్ని రాష్ట్రాలు కరోనా తీవ్రత నేపథ్యంలో ఇంకా లాక్ డౌన్ ను అమలు చేయాలని నిర్ణయించుకోవడం గమనార్హం.