( విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
విశాఖ స్టీల్ ప్లాంట్ ట్రేడ్ యూనియన్ నాయకులు, ఇతర కార్మిక పక్షాలతో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి నిర్వహించిన సమావేశం పాత చింతకాయ పచ్చడిలా సాగిందన్న విమర్శలొస్తున్నాయి. సుమారు గంటకు పైగా విశాఖ విమానాశ్రయం లాంజ్‌లో భేటీ అయిన ఈ సమావేశంలో 14 కార్మిక సంఘ నేతలు ఈ సమస్య నుంచి ఎలా గట్టెక్కాలి అన్న దానిపై వినతి పత్రం సమర్పించారు. విశాఖ ఉక్కుకు సొంత గనులు కేటాయించడంతో పాటు, రుణాలను ఈక్విటీ గా మార్చడం వంటి అంశాలను పొందుపరిచారు. వాటిని ఎంతో ఓపికగా విన్న ముఖ్యమంత్రి… ఇప్పటివరకు వైఎస్ఆర్ సీపీ నేతలు చెప్పిన అంశాలనే పునరుద్ఘాటించారని తెలుస్తోంది. ఇప్పటికే ప్రధాన మంత్రికి లేఖ రాశానని… అందులో పలు సూచనలు చేశానని, ఇది కేంద్రం పరిధిలో ఉన్న అంశమని, రాసిన లేఖకు స్పందించి నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నానని కార్మిక సంఘాలకు స్పష్టం చేశారు. అదేవిధంగా అవసరం మేరకు రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేస్తామని హామీ ఇచ్చారు. తాను దేవుడిని నమ్ముతానని… మనకు అంతా మంచే జరుగుతుందని హితబోధ చేశారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభమయ్యాక ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి కేంద్రానికి లేఖ రాశారు. అప్పటి నుంచి ఆ లేఖ గురించి వైఎస్ఆర్ సీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఉదరగొట్టని క్షణం లేదు. నేరుగా ముఖ్యమంత్రి ని కలిసి స్పష్టమైన హామీ తీసుకోవాలని ఆశించిన కార్మిక సంఘాల నాయకులు పాత పాటనే వల్లె వేయడంతో నిరాశ చెందారు.
విశాఖ వాసులకు కంటిమీద మీద కునుకు లేదు
విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తామని కేంద్రం ప్రకటించినప్పటి నుంచి విశాఖ వాసులకు కంటిమీద మీద కునుకు లేకుండా పోయింది. ఇక స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ అంశంపై ఒక్క మాట కూడా మాట్లాడకపోవడంపై ప్రజల్లో అసంతృప్తి ఉన్నప్పటికీ ఎవరు వ్యక్త పరచ లేదు. అయితే, విశాఖలోని శ్రీ శారదా పీఠం వార్షికోత్సవానికి రెక్కలు కట్టుకొని వాలిన ముఖ్యమంత్రి తీరుపై ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. పది రోజుల నుంచి ఉత్తరాంధ్ర అట్టుడుకుతున్నా ‘ మీకు అండగా ఉంటా… ప్రైవేటీకరణను అడ్డుకుంటా.. ఆ బాధ్యత నాది’ అని ఒక్క ప్రకటన కూడా చేయలేని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. బుధవారం శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర ఆశీస్సుల కోసం రావడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. పనిలో పనిగా ఉద్యమ శిబిరాలను సందర్శిస్తారని అంతా భావించినా, శిబిరాల వద్దకు వెళ్లేందుకు ముఖ్యమంత్రికి తగినంత సమయం లేకపోవడంతో కార్మిక సంఘాల నేతలతో విశాఖ విమానాశ్రయంలోనే సమావేశం అయ్యారు.
Must Read ;- వీరికి పోస్కోపై ఎందుకంత ప్రేమో.. లోగుట్టు పెరుమాళ్లకెరుక!
ముఖ్యమంత్రి ఎందుకు నోరు మెదపరు..
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు నోరు మెదపరని ఇప్పటికే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, ఇతర ఎమ్మెల్యేలు, వామపక్షాలు ప్రశ్నిస్తూనే ఉన్నాయి. ‘ఉద్యమకారులను ఓదార్చి ధైర్యం చెప్పే తీరిక లేదు గాని… దొంగ స్వామీజీకి మొక్కి దండాలు పెట్టడానికి ఖాళీ దొరికిందా’ అని చంద్రబాబు ప్రశ్నించడంతో ప్రజల్లోనూ ఆలోచన మొదలైంది. ఉద్యమం కన్నా… ప్రజల సమస్య కన్నా… స్వామీజీ వార్షికోత్సవం ఎక్కువ అయ్యిందా? అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సంఘాలు శిబిరం వద్దకు వచ్చి మద్దతు తెలుపుతూ ఉంటే సంబర పడిపోతున్న ట్రేడ్ యూనియన్లు, ఉద్యమకారులకు ముఖ్యమంత్రి భరోసా ఇచ్చి ఉంటే ఎంతో ధైర్యంగా ఉండేదని పేర్కొంటున్నారు.
పోస్కోతో సంప్రదించినప్పుడే..
రాష్ట్ర ప్రజల పట్ల ముఖ్య మంత్రికి చిత్తశుద్ధి ఉండి ఉంటే… పోస్కో ప్రతినిధులతో చర్చలు జరిపినప్పుడే అడ్డుకొని ఉండేవాడని చంద్రబాబు నాయుడు విమర్శించారు. విశాఖలో భూములు కొట్టేయడానికి పధకం ప్రకారం అధికార పార్టీ అడుగులు వేస్తోందని ఆరోపించారు. విశాఖ నగర ప్రజలు మంచివారని, వారి ఆత్మను కూడా అమ్ముకోవడం దుర్మార్గమని చంద్రబాబు మండిపడ్డారు. అయితే, పోస్కో విశాఖలో భూములు తీసుకునే అవకాశం లేదని ఇతర జిల్లాల్లో పెట్టే అవకాశం ఉందని సీఎం సూత్రప్రాయంగా కార్మిక వర్గాలకు స్పష్టం చేశారు. ఇప్పటికే పోస్కో ప్రతినిధులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున కడప, భావనపాడు, కృష్ణపట్నం పరిసరాల్లో ప్లాంటు ఏర్పాటుకు ప్రతిపాదించామని కార్మిక సంఘాలకు చెప్పారు.
Also Read ;- జగన్ ప్రకటనపై అనుమానాలెన్నో.. విశాఖ ఉక్కు భూముల విక్రయం సాధ్యమా..?
కానరాని భరోసా…!
ట్రేడ్ యూనియన్లు నిర్వహిస్తున్న రిలే శిబిరానికి బుధవారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెళతారనే అంతా భావించారు. ఆయనకు స్వామీజీ మీద ఉన్న భక్తి విశాఖ ప్రజలపై లేదని ఆయన చర్యల ద్వారా స్పష్టమయ్యిందన్న విమర్శలొస్తున్నాయి. గత పది రోజులుగా ట్రేడ్ యూనియన్లు, స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు, తెలుగుదేశం పార్టీ నేతలు వివిధ రకాలుగా ఆందోళనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నా… ఆయా శిబిరాలను సందర్శించేందుకు ముఖ్యమంత్రి ఆసక్తి చూపకపోవడంపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. విశాఖలో పర్యటించిన నారా లోకేష్ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు దీక్షా శిబిరాన్ని మాత్రమే సందర్శించారని, పక్కనే ఉన్న ట్రేడ్ యూనియన్ల శిబిరాన్ని ఎందుకు సందర్శించ లేదని మంత్రి ముత్తంశెట్టి ప్రశ్నించారు. మరి ముఖ్యమంత్రి విషయంలోనూ ఇలాగే స్పందించే ధైర్యం మంత్రికి ఉందా అని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నప్పటికీ ఇంత నిర్లక్ష్యంగా ముఖ్యమంత్రి ఎలా వ్యవహరిస్తారని నిలదీస్తున్నారు. సీఎం కార్మిక సంఘాలకు ఈ సందర్భంగా ఏం చెబుతారు అన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నప్పటికీ, ఆయన హామీ నీరుగార్చే విధంగా ఉందని ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటి వరకు ఉద్యమంపై పల్లెత్తి మాట్లాడని జగన్, స్టీల్ ప్లాంట్ కార్మికులకు ‘ నేను చూసుకుంటా… మీరు భయపడకండి… కేంద్రంతో మాట్లాడి నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా ఒత్తిడి చేస్తా’ అని పక్కా భరోసాని ఇస్తారని భావించినా.. కేంద్రం దృష్టికి తీసుకువెళతామని హామీ మాత్రమే ఇవ్వడంతో ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది.