(శ్రీకాకుళం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
శ్రీకాకుళం జిల్లాలో పలుచోట్ల నామినేషన్ల సందర్భంగా ఘర్షణలు జరిగాయి. సంతబొమ్మాళి మండలంలోని హనుమంతునాయుడుపేటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ వేయనీయకుండా టీడీపీ మద్దతుదారు సిల్లా గౌతమిని ప్రత్యర్థులు అడ్డుకున్నారు. రెండుసార్లు నామినేషన్ పత్రాలు చించివేసి భౌతికదాడికి పాల్పడ్డారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నేత సగ్గు రామిరెడ్డి వర్గీయులు అడ్డుకుంటున్నారని స్థానికులు చెబుతున్నారు. విశాఖ డీఐజీ ఎల్‌కెవి రంగారావుకి విషయం తెలియడంతో.. గౌతమితో ఆయన మాట్లాడారు. దగ్గరుండి నామినేషన్ వేయించాలని ఎస్ఐకి ఆదేశాలు జారీ చేశారు.
టెక్కలి మండలంలో ..
శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం అయోధ్యాపురం, శాసనం సహా మరికొన్ని పంచాయతీల్లో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అయోధ్యాపురం సర్పంచ్ అభ్యర్థిగా తెదేపా బలపరిచిన వ్యక్తి నామినేషన్ వేసేందుకు వెళ్తుండగా ఆ పత్రాలను వైకాపా కార్యకర్తలు లాక్కుని, చించివేసి సమీపంలోని బావిలో పడేశారు. తర్వాత పోలీసుల సాయంతో ఆ అభ్యర్థి నామినేషన్ వేయాల్సి వచ్చింది. శాసనంలో పోటీ చేసేందుకు ఓ అభ్యర్థి వెళ్లగా కొందరు ఆ పత్రాలను లాక్కుని వెళ్లేందుకు యత్నించారు. పోలీసులు రావడంతో పక్కకు వెళ్లిపోయారు. ఆ నామినేషన్ పత్రాలు పూర్తిగా నలిగిపోయాయి. ఇటువంటి ఘటనలకు పాల్పడితే తీవ్ర చర్యలు ఉంటాయని ఉన్నతాధికారులు, ఎన్నికల సంఘం హెచ్చరిస్తున్నా ఫలితం కనిపించలేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Must Read ;- పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ దురాగతాలు..
నిమ్మాడలో ఉద్రిక్తత
శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో ఉద్రిక్తత నెలకొంది. వైఎస్ఆర్ సిపి బలపరిచిన అభ్యర్థి కింజరాపు అప్పన్నను నామినేషన్ వేయకుండా టిడిపి నేతలు అడ్డుకున్నట్లు తెలిసింది. అప్పన్న నామినేషన్ వేస్తున్న సందర్భంగా పెద్దెత్తున టిడిపి కార్యకర్తలతో నామినేషన్ కేంద్రంలోకి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్న హరిప్రసాద్ చొచ్చుకొచ్చినట్లు వైసీపీ వర్గీయులు ఆరోపిస్తున్నారు. నామినేషన్ కేంద్రం నుండి బలవంతంగా టెక్కలి వైసీపీ కో ఆర్డినేటర్ దువ్వాడ శ్రీనివాసరావు, సర్పంచ్ అభ్యర్థి అప్పన్నను .. హరిప్రసాద్ అతని అనుచరులు బయటకు గెంటి వేసినట్లు ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా దువ్వాడ శీనివాసరావు కారుపై దాడికి యత్నించగా తప్పించుకుని ఎస్పీకి ఫిర్యాదు చేశారని ఆ వర్గీయులు చెబుతున్నారు.
ముగిసిన తొలిదశ నామినేషన్లు
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల తొలిదశ నామినేషన్లు ముగిసాయి. తొలివిడత ఎన్నికలు జరిగే 168 మండలాల్లో ప్రత్యేక నిఘా పెట్టారు. సోమవారం ఉదయం 8 గంటల నుంచి ఎన్నికల నామినేషన్ల పరిశీలిస్తారు. ఫిబ్రవరి 3న నామినేషన్ల అభ్యంతరాలపై తుది నిర్ణయం తీసుకుంటారు. ఫిబ్రవరి 4న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. ఫిబ్రవరి 9న ఉదయం 6:30 నుంచి మధ్యాహ్నం 3:30 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఫిబ్రవరి 9న సాయంత్రం 4 గంటల నుంచి ఓట్లు లెక్కించి అదే రోజు ఫలితాలను వెల్లడిస్తారు.
Also Read ;- బెదిరింపులు.. వైసీపీకి ఓటేయకపోతే రేషన్, పింఛన్ కట్ !