అపోలో లాంటి సంస్థ ఇప్పుడు తృణ ధాన్యాల మీద దృష్టి పెట్టడం విశేషమే. ప్రకృతికి దగ్గర ఉండే జీవన విధానమే ఆరోగ్య పరిరక్షణకు ఉపయోగపడుతుందని అపోలో హెల్త్ కేర్ అంటోంది. ఈ విషయం మీద ఈ సంస్ధ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే డెక్కన్ అభివృద్ధి సంఘం (డి.డి.ఎస్.) బృహత్తర కార్యక్రమాలను చేపట్టింది. ఐదు వేలమంది మహిళా వ్యవసాయదారుల జీవన ప్రమాణాలను మెరుగుపర్చే దిశగా అడుగులు వేస్తోంది. తృణ ధాన్యాల వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంచటానికి కృషి చేస్తోంది. దాని కోసం 4 వేల కిలోల తృణ ధాన్యాలను అపోలో హెల్త్ కేర్ సేకరించింది.
ఇలా ప్రతి నెలా వెయ్యి కిలోల సేకరణను లక్ష్యంగా పెట్టుకుంది. దీని ద్వారా సంగారెడ్డి జిల్లాలోని మహిళా వ్యవసాయ దారులకు అండగా నిలుస్తోంది. హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రులకు సంబంధించిన వంటశాలల్లో ఈ తృణ ధాన్యాల వాడకాన్ని పెంచుతున్నారు. వైద్యులంతా వీటినే తింటున్నారట. ఇలా చేయడం వల్ల క్రమంగా ఆహారపు అలవాట్లలో మార్పు వస్తుందని, మరిన్ని వర్గాలకు ఈ విషయం చేరుతుందని అపోలో హెల్త్ కేర్ గ్రూప్ ఆకాంక్షిస్తోంది.
అపోలో హాస్పిటల్స్ గ్రూప్ కార్పొరేట్ సామాజిక బాధ్యత విభాగం వైస్ ఛైర్మన్ ఉపాసన కొణిదెల ఈ విషయం మీద మాట్లాడుతూ మెరుగైన ఆరోగ్యాన్ని పెంపొందించడంతో పాటు ఇలాంటి విద్యకు సరైన నైపుణ్యం కల్పించే ఏర్పాటును అపోలో సంస్థ లక్ష్యంగా పెట్టుకుందని వివరించారు. ఈ విషయంలో మహిళా వ్యవసాయదారులకు తాము అండగా నిలుస్తున్నామన్నారు. సాధారణంగా మనం వరి, గోధుమలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నామని, వీటిని అధికంగా వినియోగించడం వల్ల జీవన శైలికి సంబంధించి అనేక అనారోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయన్నారు.
కిలో వరి పండించడానికి 4 వేల లీటర్ల నీరు అవసరమవుతుంది. ఈ పంటల వల్ల ఎక్కువ నీటి వాడకం పెరిగి పర్యావరణం మీద ప్రభావం పడుతుంది. వరితో పోల్చి చూస్తే తృణ ధాన్యాలను పండించడానికి 25 నుంచి 30 శాతం సాగు నీరు సరిపోతుంది. అందువల్ల ఇలాంటి పంటల ఉత్పత్తి మీద ఎక్కువగా దృష్టి పెట్టడం మంచిదని కూడా అపోలో హెల్త్ కేర్ సూచిస్తోంది.
ఈ తృణ ధాన్యాలలో ప్రొటీన్లు, పీచుపదార్థాలు, ఇనుము, కాల్షియం బియ్యంలో కంటే ఎంతో ఎక్కువగా ఉంటాయి. వీటిని తినడం వల్ల పోషక పదార్థాలు మన శరీరానికి ఎక్కువగా అందుతాయి. తృణ ధాన్యాల వాడకం వల్ల మధుమేహం బాగా తగ్గిపోతుంది. అందుకే మెరుగైన ఆహారపు అలవాట్లను ఎంచుకోమంటున్నారు ఉపాసన. వారానికి ఒకసారి స్థానికంగా పండించే తృణ ధాన్యాలను తినాలని కూడా ఆమె చెబుతున్నారు. ప్రతి మనిషిలోనూ ఇలాంటి సంకల్పం ఉండాలని, ఆ తర్వాత క్రమంగా వీటిని తినడానికి అలవాటు పడతారని సూచించారు.
Must Read ;- ‘ప్రేగు ఇన్‌ఫెక్షన్’కు చెక్ పెట్టాలంటే ఈ ఆహారం తీసుకుంటే సరి..!











