మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఉప్పెన మూవీ టీజర్ వచ్చేసింది. వైష్ణవ్ తేజ్ కు హీరోగా ఇది తొలి సినిమా. హీరోయిన్ కృతి శెట్టికి ఇప్పటికే ఈ సినిమాతో మంచి క్రేజ్ వచ్చింది. ఇందులో ఓ కీలక పాత్రను విజయ్ సేతుపతి పోషించారు. బోగి రోజు సాయంత్రం 4.05 గంటలకు టీజర్ ను విడుదల చేశారు. ‘దేవుడే వరాలిస్తాడని నాకర్థమైంది. ఎవరికి పుట్టామో ఎవరికి తెలుస్తుంది? కానీ ఎందుకోసం పుట్టానో నా చిన్నప్పుడే తెలిసిపోయింది’ అనే హీరో చెప్పే డైలాగ్ తో ఇది ఓ ప్రేమ కథా చిత్రమని అర్థమవుతుంది.
ఆమెను చాటుగా చూస్తూ ప్రేమిస్తాడని కూడా తెలుస్తోంది. చిన్నప్పటి నుంచి ఆమెను ఆరాధించే పాత్రలా అనిపిస్తోంది. ఆమెను చాటుగా గమనిస్తూనే ఆరాధిస్తుంటాడు హీరో. ఆ విషయం ఓ డైలాగుతోనే చెప్పాశాడు. ఆమెను చూడనివ్వకుండానే ప్రేమించేస్తున్నానంటాడు. ‘వీడు ముసలోడవ్వకూడదే..’ అంటూ హీరోయిన్ తోనూ డైలాగ్ పలికిస్తాడు. సముద్రపు ఒడ్డున కర్రతో ‘లవ్ యూ ఐ’ అని హీరోయిన్ రాస్తుంది. ‘లవ్ యూ ఐ.. ఐ లవ్ యూ అని కదా రాయాలి’ అని హీరో అడుగుతాడు. మనమిద్దరి మధ్యలో ప్రేమెందుకని ప్రమని పక్కన పెట్టేశా’ అంటుంది హీరోయిన్. హీరో వైష్ణవ్ తేజ్ వాయిస్ డిటో అన్న సాయిధరమ్ తేజ్ వాయిస్ లానే ఉంది.
ఈ ఒక్క రాత్రి 80 సంవత్సరాలు గుర్తుండేలా బతికేద్దామా?’ అంటుంది హీరోయిన్. ప్రేమ ఫలించక చనిపోవాలనుకుంటారా? అనే సందేహాన్ని దర్శకుడు వదిలాడు. ఆ సముద్రం.. ఆ అలలు.. చూస్తుంటే ఇది ఓ మత్స్యకారుడి ప్రేమ కథలా తెలుస్తోంది. కత్తి పోట్లతో సముద్రం ఒడ్డున పడి ఉన్న దృశ్యం సినిమా కథనంతా చెప్పేసినట్టుగానే ఉంది. ఇది ప్రేమను మింగేసిన ఉప్పెన అనుకోవాలా.. ఓ జంట మధ్య ప్రేమను పొంగించిన ఉప్పెన అనుకోవాలా? అనే ప్రశ్నలను ప్రేక్షకులకు వదిలేశాడు దర్శకుడు ఈ టీజర్ లో. దర్శకుడు బుచ్చిబాబు సాన ఈ సినిమాతో ఓ ప్రేమకావ్యానికి నాంది పలికాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Must Read ;- ఫిబ్రవరి 5 న ‘ఉప్పెన’గా వచ్చేస్తున్న మెగా మేనల్లుడు