సుకుమార్ ప్రాజెక్టు అనగానే దాదాపుగా ఆ సినిమాకి సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ ఉంటాడనే విషయం అందరికీ తెలుసు. ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు, ప్రేక్షకులకు పాటల విందు చేశాయి. ముఖ్యంగా వీళ్ల కాంబినేషన్లో రూపొందే సినిమాల్లో దుమ్మురేపేసే ఐటమ్ సాంగ్ ఒకటి ఉంటుంది. థియేటర్స్ కి ఆడియన్స్ ను రప్పించే ఊపు .. ఉత్సాహం ఆ పాటకి ఉంటుంది. సినిమా విడుదల తరువాత అన్ని వేదికలపై ఆ పాటే మోగుతుంది. అలాంటి మాస్ మసాలా ఐటమ్ సాంగ్ ఒకటి ‘పుష్ప’ సినిమాలోను ఉందట.
దేవిశ్రీ ప్రసాద్ కసిగా చేసిన కసరత్తు నుంచి ఈ పాట పుట్టిందని అంటున్నారు. సుకుమార్ మాములుగా సాగే కథలోనే ఐటమ్ సాంగ్స్ అదరగొట్టేస్తూ ఉంటాయి. అలాంటిది ఈ సారి కథా నేపథ్యమే దట్టమైన అడవిలో .. గిరిజన గూడాల మధ్య సాగుతుంది. ఇక స్మగ్లింగ్ కి అలవాటు పడిన మాస్ కుర్రాళ్లు ఎలా ఉంటారో .. వాళ్లు ఏం కోరుకుంటారో తెలిసిందే. ఇలాంటి వాతావరణంలో సాగే ఐటమ్ ఉధృతిని మాటల్లో చెప్పడం కష్టమే అవుతుంది. అలాంటి ఐటమ్ సాంగ్ లో బాలీవుడ్ బ్యూటీ చెలరేగిపోనున్నట్టు కొన్ని రోజుల క్రితం వార్తలు షికారు చేశాయి.
తాజాగా ఈ ఐటమ్ సాంగ్ కోసం ‘ఊర్వశి రౌతేలా‘ను ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. ఈ బాలీవుడ్ భామను చూడగానే మత్స్య కన్యలా .. మైనాన్ని కరిగించిపోసిన బొమ్మలా కనిపిస్తుంది. ఫిట్ నెస్ లో పీహెచ్ డీ చేసినట్టుగా అనిపిస్తుంది. ఇక ఈ చేపకళ్ల సుందరి డాన్స్ చూడటానికి రెండుకళ్లూ సరిపోవు .. ఆ ఆనందాన్ని అనుభవించడానికి ఒక మనసు సరిపోదు. అలాంటి ఈ సుందరి ఇంతవరకూ తెలుగు తెరను పులకరింపజేయలేదు. ఆ అవకాశం ‘పుష్ప’ సినిమాకు దక్కింది .. ఆ అదృష్టం కుర్ర ప్రేక్షకులకు చిక్కింది. త్వరలోనే బన్నీ – ఊర్వశి రౌతేలా ఐటమ్ సాంగ్ ను చిత్రీకరించనున్నట్టు తెలుస్తోంది.
Must Read ;- సుకుమార్ అంటే ఓ ప్రయోగం .. ఓ సాహసం