(శ్రీకాకుళం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
రాజకీయంగా అభివృద్ధి చెందాలన్నా, లబ్ధి పొందాలన్నా దేవుడిని వేడుకోవాలి తప్ప వాడుకోవడం తగదని విశాఖ రేంజ్ డీఐజీ ఎల్‌కేవీ రంగారావు అన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని సంతబొమ్మాళి పాలేశ్వరస్వామి ఆలయాన్ని ఆయన పరిశీలించారు. ఆలయం ఎదురుగా సంతబొమ్మాళి-కోటబొమ్మాళి రహదారి మధ్యభాగంలో ఈనెల 14వ తేదీన నంది విగ్రహం ఏర్పాటు వివాదాస్పదం కావడంతో ఆయన ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. పోలీసులు తొలగించిన నంది విగ్రహం, రహదారి మధ్యలో సిమెంటు దిమ్మ కూలగొట్టిన ప్రదేశాలనూ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ఆలయ ఆర్చకులు, గ్రామానికి చెందిన కొంతమంది స్థానికులతోనూ మాట్లాడారు. తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ దీని వెనుక ఓ రాజకీయ పార్టీకి చెందిన వారు ఉన్నట్లు తమకు ప్రాథమిక సమాచారం ఉందని, ఇప్పటికి ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరు పరిచినట్లు తెలిపారు. ప్రజల్లో అభద్రతకు గురిచేసి, విడదీసే ప్రయత్నాల్లో దేవుడ్ని వాడుకోవడం ఏ రాజకీయ పార్టీకి తగదన్నారు. డీజీపీ ఆదేశాల మేరకు ఆలయాల పరిరక్షణకు వీడీసీ సిబ్బందిని నియమించామని తెలిపారు. ఆయన వెంట జిల్లా ఎస్పీ అమిత్‌బర్దార్, డీఎస్పీ శివరామిరెడ్డి, తదితరులున్నారు.
Must Read ;- సంతబొమ్మాళిలో నందేశ్వరుని విగ్రహం అపహరణ











