వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలే కాదు.. వారి బంధువుల సైతం ప్రభుత్వ అండతో దాడికి దిగుతున్నారు. వైసీపీ నేత రేవతి టోల్ గేట్ వద్ద 80-90 రూపాయిలు కట్టకపోగా టోల్ సిబ్బందిపై చేయి చేసుకున్నారు. చివరికి వివాదం పోలీసులకు వరకు చేరింది. రేవతిపై కేసు కూడా నమోదైంది. తన ఆధిపత్యం చూపించాలన్న ప్రయత్నంలో పార్టీ పరువు తీస్తున్న సంగతి మరిచిపోతున్నారు ప్రభుత్వ నేతలు. ఈ సంఘటన జరిగి రెండు రోజులు కూడా గడవకముందే మరో వివాదం రేవతి మెడకు చుట్టుకుంది.
బిల్లు కట్టమంటే దాడి చేస్తారా
వైసీపీ నేత రేవతి మేనల్లుడు వంశీ కాలికి గాయం అవడంతో గుంటూరు దాచేపల్లిలోని క్రాంతి హాస్పిటల్ లో చికిత్స చేయించుకున్నాడు. హాస్పిటల్ నుండి డిశ్చార్జి అవుతున్న సమయంలో బిల్లు కట్టమని అడిగిన సిబ్బందిపై విరుచుకుపడ్డారు. ఇంత బిల్లు ఎలా అయిందంటూ ఊగిపోయాడు. సిబ్బందిని అనుచిత పదజాలంతో దూషించాడు. దానికి సిబ్బంది సర్ధిచెప్పడానికి ప్రయత్నించడంతో, వంశీ మరింత రెచ్చిపోయాడు. నాకెంత బలం ఉందో తెలుసా? నేనెవరి మనిషినో మీకు అర్ధమవుతుందా? అంటూ సిబ్బందిపై బెదిరింపులకు దిగాడు.
పోలీసులేం చేయలేరు
రాష్ట్రంలో పోలీసుల పరిస్థితి ఎలా ఉందో మరోసారి వంశీ మాటలతో బయటపడింది. బిల్లు కట్టకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తాం అని సిబ్బంది అనడంతో, పోలీసులకు చెప్పినా ఏం జరగదు. పోలీసులు నన్నేం చేయలేరు. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి. ఎవరొచ్చినా నాకేం ఇబ్బందిలేదంటూ రెచ్చిపోయాడు వంశీ. అంతా జరిగాక సినిమా ఫక్కీలో పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ చేస్తున్నాం అని వివరణ ఇచ్చారు. సిసి కెమెరా ఆధారంగా విచారణ చేపట్టి నిందులపై చర్యలు చేపడదామని చెప్పుకొచ్చారు.
నేతలపై వెల్లువెత్తుతున్న విమర్శలు
రాష్ట్రంలోని అధికార నేతలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని గర్వంతో ఎవరిని లెక్కచేయకుండా ప్రవర్తిస్తున్నారని అందరూ విమర్శిస్తున్నారు. నోటికొచ్చినట్లు మాట్లాడడం, ఎవరైతే మాకేంటి అన్నట్లుగా ప్రవర్తించడం, ఇలాంటి ఈ మధ్య కాలంలో బాగా పెరిగిపోతున్నాయి. రేవతి మాత్రమే కాదు, మీడియా సమావేశమని కూడా చూడకుండి అనిల్ కుమార్ ఓ దినపత్రికకు వార్నింగ్ ఇవ్వడం, రాయడానికి కూడా వీలుకానటువంటి బాషను ఉపయోగించడం విమర్శలకు దారితీస్తుంది. వీరి ప్రవర్తనపై సిఎం చర్యలు చేపట్టకపోతే, ‘చెడు వినకు, చెడు మాట్లాడకు, చెడు కనకు’ అన్నట్లుగా బతకాల్సిన పరిస్థితి తొందరలో రాకమానదు.
Must Read ;- నన్నేం పీకలేరు!.. అనిల్ లేటెస్ట్ బూతు ఎటాక్!