టైటిల్ చూసి హాలీవుడ్ సినిమాలో వైష్ణవ్ తేజ నటిస్తున్నాడని అనుకుంటున్నారా? అబ్బే లేదండీ.. అతడి తాజా చిత్రానికి ఆ టైటిల్ ఫిక్స్ చేయాలని దర్శక, నిర్మాతలు భావిస్తున్నారట. ఆ మేరకు టైటిల్ రిజిస్ట్రేషన్ కూడా అయిపోయిందని సమాచారం. ఉప్పెన సినిమా విడుదల కాకుండానే.. వైష్ణవ్ తేజ క్రిష్ దర్శకత్వంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా తన రెండో సినిమాని మొదలు పెట్టడం.. అది పూర్తయిపోవడం కూడా జరిగిపోయాయి. ప్రముఖ నవలాకారుడు సన్నపురెడ్డి వెంకట్రామిరెడ్డి రాసిన ‘కొండపొలం’ అనే నవల ఆధారంగా క్రిష్ ఈ సినిమాను తెరకెక్కించారు.
ఒక అడవిని నమ్ముకుని.. ఆ చుట్టు ప్రక్కల గ్రామాల్లో పశువులు మేపే కొందరి జీవితాలు .. ఎంతలా స్ట్రగుల్ అయ్యాయి? అనేదే ‘కొండపొలం’ నవల కథాంశం. ఈ కథను క్రిష్ తనదైన శైలిలో తెరకెక్కించినట్టు సమాచారం. కథ ప్రకారం ఈ సినిమా అడవుల నేపథ్యంలో సాగుతుంది కాబట్టి.. ఈ సినిమాకి ‘జంగిల్ బుక్’ అనే క్రేజీ టైటిల్ ఫిక్స్ చేయబోతున్నట్టు సమాచారం. నిజానికి ఈ సినిమాకి నవల పేరునే టైటిల్ గా పెట్టాలని భావించారట. అయితే ‘జంగిల్ బుక్’ అనే టైటిల్ .. ప్రపంచ వ్యాప్తంగా బాగా గుర్తింపుపొందింది కాబట్టి.. ఈ టైటిల్ ఫిక్స్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట దర్శక నిర్మాతలు.
ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతోంది. ఆగష్ట్ లో విడుదలకు సిద్ధం కానున్న ఈ మూవీలో విజువల్ ఎఫెక్ట్స్ కూడా మెప్పిస్తాయట. ఉప్పెన సినిమా బ్లాక్ బస్టర్ అయిన నేపథ్యంలో వైష్ణవ్ తేజ రెండో సినిమాకి మంచి హైప్ ఏర్పడింది. మొదటి సినిమా సముద్రం బ్యాక్ డ్రాప్ లో సాగితే.. రెండో సినిమా అడవుల నేపథ్యంలో ఉండనుండడం విశేషం. మరి ఈసినిమాకి జంగిల్ బుక్ అనే టైటిలే ఫిక్స్ చేస్తారో లేదో చూడాలి.