‘అజ్ఞాతవాసి’ సినిమా తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటుడిగా దాదాపు అజ్ఞాతవాసంలోకి వెళ్లిపోయారనే చెప్పాలి. మరో రెండు రోజుల్లో ‘వకీల్ సాబ్’ రిలీజవనుండటంతో అంతటా పవన్ కళ్యాణ్ ఫీవర్ అలుముకుని ఉంది. మరో పక్క కరోనా సెకండ్ వేవ్ ఫియర్ కూడా నెలకొని ఉంది.
వారానికి రెండు మూడు సినిమాలు విడుదలవుతున్న ఈ తరుణంలో ఈ నెల 9వ తేదీ ‘వకీల్ సాబ్’తో విడుదల చేయడానికి మరే నిర్మాతా సాహసించలేదు. సినిమా థియేటర్లు ప్రారంభమైన తర్వాత ఇప్పటిదాకా ఇంత హైప్ వచ్చిన సినిమా ఏదీ లేదు. పవర్ స్టార్ స్టామినా ఎలాంటిదో ఈ హైప్ చూస్తేనే అర్థమవుతోంది. ఇప్పటికే ఈ సినిమా సెన్సార్ కూడా పూర్తయింది. అంతటా పాజిటివ్ టాక్ అయితే ఉంది. బాలీవుడ్ లో అమితాబ్ తో రూపొందిన పింక్ రీమేక్ గా దీన్ని తెరకెక్కించారు. అయితే పవన్ కళ్యాణ్ పాత్ర నిడివి తక్కువ ఉందన్న వార్తలు రావడం పవన్ కళ్యాణ్ అభిమానులను ఒకింత నిరుత్సాహానికి గురిచేస్తోంది.
పింక్ లోని అమితాబ్ పాత్రతో పొలిస్తే ఇందులో ఆ పాత్ర పరిధిని చాలా పెంచారన్నది మనకున్న సమాచారం. మూడేళ్ల గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ ప్రేక్షకుల ముందుకు రావడంతో ఆయన అభిమానులు సంబరాల్లో మునిగితేలుతున్నారు. అసలు ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ తీసుకున్న రెమ్యూనరేషనే దాదాపు రూ. 50 కోట్లన్న టాక్ ఎప్పుడో వచ్చింది. ఆ ప్రకారం చూస్తే బడ్జెట్ పరంగానూ ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలోనే ఉంది. అలాంటప్పుడు ఎంత వసూలు చేస్తే సినిమా గట్టెక్కుతుందన్న దానిమీద ఎవరి లెక్కలు వారికున్నాయి.
బిజినెస్ మాటేమిటి?
అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా బిజినెస్ కొంత తగ్గే అవకాశం ఉందన్న వార్తలు వస్తున్నాయి. పొరుగున ఉన్న కర్ణాటకలో 50 శాతం ఆక్యుపెన్సీ మాత్రమే ఉంది. మహారాష్ట్రలో థియేటర్లు మూతపడ్డాయి. విడుదలకు ముందే అత్యధిక బిజినెస్ చేసిన సినిమాగానూ ‘వకీల్ సాబ్’వార్తల్లో ఉంది. దాదాపు 90 కోట్ల షేర్ సాధించగలిగితే ఈ సినిమా సేఫ్ జోన్ లోకి వెళ్లినట్టే. ఇప్పటి లెక్కల ప్రకారం 83.35 కోట్ల బిజినెస్ జరిగిందని అంచనా. ఇది కాకుండా మరో 6కోట్ల బిజినెస్ సొంత విడుదలలో ఉంది.
దూకుడు పెంచిన పవర్ స్టార్
ఇటు రాజకీయాలు, అటు సినిమాలతో పవన్ కళ్యాణ్ దూకుడు పెంచారు. 2018లో అజ్ఞాతవాసి తర్వాత ఆయన పూర్తిగా రాజకీయాలకే అంకితమయ్యారు. ఆ తర్వాత కరోనా కారణంగా కొంత గ్యాప్ వచ్చింది. ఇంత గ్యాప్ తర్వాత పవర్ స్టార్ గ్రాండ్ రీఎంట్రీ చేయబోతున్నారు. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’, మలయాళ చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ లో పవన్ కళ్యాణ్ బిజీగా ఉన్నారు. ఆ తర్వాత హరీష్ శంకర్ సినిమా సెట్స్ మీదకు వెళుతుంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమాని కూడా ఆయన అంగీకరించారు. ఓ పక్క షూటింగుల్లో పాల్గొంటూనే మరో పక్క రాజకీయ కార్యకలాపాలను కూడా ఆయన చురుకుగా నిర్వహిస్తున్నారు.
కరోనా సెకండ్ వేవ్ ప్రభావంతో సినిమా థియేటర్లలో ఆక్యుపెన్సీ తగ్గించవచ్చన్న వార్తలు కొంత ఇబ్బంది పెట్టినా అలాంటిదేమీ లేదని తేలడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. స్టార్ సినిమా కోసం ప్రేక్షకులు మొహం వాచి ఉండటంవల్ల కలెక్షన్ల వసూళ్లలో కొత్త రికార్డులను వకీల్ సాబ్ క్రియేట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. కాకపోతే కోవిడ్ సెకండ్ వేవ్ ప్రభావం రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందోనన్న ఆందోళన అందరిలోనూ ఉంది. ఇప్పటికే అన్ని చోట్లా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. కర్ఫ్యూ అమలు చేస్తున్న రాష్ట్రాలు కూడా పెరుగుతున్నాయి. ఏ కష్టం ఏం జరుగుతుందోనన్న ఆందోళన నెలకొని ఉంది. అకస్మాత్తుగా ప్రభుత్వం ఏదైనా కొత్త నిర్ణయం తీసుకుంటే మాత్రం ఇబ్బందికరమే.
– హేమసుందర్ పామర్తి
Must Read ;- ‘వకీల్ సాబ్’ తెరమీద 50 నిమిషాలే కనిపిస్తాడట