అజిత్ హీరోగా బోనీకపూర్ నిర్మించిన ‘వలీమై’ సినిమా ఈరోజు విడుదలైంది. దాదాపు రెండున్నరేళ్ల తర్వాత అజిత్ సినిమా విడుదల కావడంతో పాటు అజిత్ కు తమిళంలో ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. హెచ్ వినోద్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను జీస్టూడియోస్ తో కలిసి బోనీకపూర్ నిర్మించారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదలైంది. మరి సినిమా ఎలా ఉందో చూద్దాం.
కథలోకి వెళితే..
డ్రగ్స్ రాకెట్ కు సంబంధించిన కథ ఇది. కొలంబియా నుంచి డ్రగ్స్ ఎలా సరఫరా అవుతుంటాయి? అవి ఎక్కడెక్కడి ఎలా చేరతాయనే దాని మీద దృష్టి పెట్టి రూపొందించారు. ఏసీపీ అర్జున్ (అజిత్) విజయవాడ నుంచి విశాఖపట్నానికి బదిలీపై వస్తాడు. విశాఖలో అంతా అరాచక వాతావరణం ఉంటుంది. యూత్ మాదక ద్రవ్యాల మత్తులో ఉంటారు. దొంగతనాలు, హత్యలు, డ్రగ్స్ రాకెట్ వెనక ఉన్నది ఒక్కటే గ్యాంగ్ అని భావిస్తాడు అర్జున్. ఈ వ్యవహారన్ని నడిపిస్తున్నది విలన్ కార్తికేయ గ్యాంగ్. బైక్ లపై విన్యాసాలు చేయడం ఈ గ్యాంగ్ ప్రత్యేకత. హీరో, విలన్ ల మధ్య ఎలాంటి పోరు నడిచింది? విలన్ ఆటను హీరో ఎలా కట్టించాడు అన్నదే సినిమా.
ఎలా తీశారు? ఎలా చేశారు?
తెలుగు సినిమాకు తమిళ పేరేంటో ఎవరికీ అర్థం కాదు. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా పేరు మార్చి ఉంటే బాగుండేదని అందరూ భావించారు. వలిమై అంటే శక్తి అట. శక్తికి పర్యాయపదంగా తెలుగు వారు వలిమైని భావించాలన్న మాట. సినిమా చివరి వరకూ మనం చూసినా వలిమై అంటే ఏంటో మనకు అర్థం కాదు. ఛేజింగ్స్ కోసమే సినిమా అన్నట్టుగా దర్శకుడు హెచ్. వినోద్ తీశాడు. అజిత్ రేసర్ కాబట్టి అతన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ఛేజింగ్స్ పెట్టి ఉండొచ్చు. దానికి తగ్గ విలనే దొరికాడు. కార్తికేయకు విలన్ గా తమిళంలో ఇది తొలి సినిమా. అంతకుముందు నాని గ్యాంగ్ లీడర్ లో విలన్ గా చేసిన తర్వాత వచ్చిన అవకాశం ఇది.
రొటీన్ సెంటిమెంట్ మోతాదు మించింది. మితి మీరిన యాక్షన్, మూడు గంటల నిడివి ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టాయి. ఇంతకుముందు ఖాకీ చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు కాబట్టి ఏదో ఊహించుకుని వెళితే మాత్రం నిరాశ తప్పదు. హీరోయిజం ఎలివేషన్ ఉంటే చాలు సినిమా హిట్ అయిపోతుంది అనుకుంటే తప్పులో కాలేసి నట్టేనని ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. రేసింగ్ బైక్ ల విన్యాసాలు ఆకట్టుకుంటాయి కానీ సినిమా అంతా అలా ఉంటే కష్టమే కదా. విలన్ క్రైమ్ నెట్ వర్క్ మీద దర్శకుడు బాగానే కష్టపడ్డాడు. కొలంబియా నుంచి డ్రగ్స్ ఎలా వస్తాయో చూపడంలో సక్సెస్ అయ్యాడు.
యాక్షన్ మోతాదు, సెంటిమెంట్ మోతాదు మించకుండా రెండున్నర గంటల్లో ముగించి ఉంటే బాగుండేది. హీరోయిన్ లేని హీరో, విలన్ ల సినిమా ఇది. హ్యుమాఖురేషి ఉన్నా హీరోయిన్ గా భావించలేం. తమిళ వారికి అజిత్ ఎలా కనెక్ట్ అవుతాడో గానీ తెలుగు వారికి మాత్రం నిరాశను మిగిల్చాడు. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు వలిమై మీద రేపు భీమ్లా నాయక్ వచ్చి పడుతున్నాడు. వలిమై ఎలా కోలుకుంటాడో చూడాలి. ఒకవేళ ఈ సినిమా జనాన్ని మెప్పించి ఉంటే మాత్రం భీమ్లా నాయక్ లోనూ దడ పుట్టేది. ఇక భీమ్లానాయక్ రెచ్చిపోవడమే.
నటీనటులు: అజిత్, కార్తికేయ, హ్యుమా ఖురేషి, రాజ్ అయ్యప్ప, సుమిత్ర, అచ్యుత్ కుమార్, యోగిబాబు తదితరులు.
సాంకేతికవర్గం: సంగీతం: యువన్ శంకర్ రాజా, నేపథ్య సంగీతం: జీబ్రాన్, కెమెరా: నీరవ్ షా
నిర్మాత: బోనీకపూర్
దర్శకత్వం: హెచ్. వినోద్
విడుదల తేదీ: 24-02-2022
ఒక్క మాటలో: శక్తి పేరుతో సుత్తి
రేటింగ్: 2/5