గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ ఇప్పట్లో కేసుల నుంచి బయటపడేలా కనిపించట్లేదు. మరికొన్ని రోజులు ఆయన జైలు జీవతం గడపాల్సి వచ్చేలా ఉంది. తాజాగా వంశీకి బెయిల్ పొందే అర్హత లేదని, ఒక నేరం నుంచి బయట పడడానికి మరో నేరం చేశారని సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు కోర్టుకు తెలిపారు. ఆయన బయటకు వస్తే బాధితుడు ముదునూరి సత్యవర్ధన్‌కు ప్రాణహాని ఉంటుందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సాక్షులనూ ప్రభావితం చేస్తారని, ఆధారాలను తారుమారు చేసే అవకాశం ఉందని చెప్పారు.
విజయవాడ జిల్లా జైలులో ఉన్న వల్లభనేని వంశీ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై స్థానిక SC, ST అట్రాసిటీ కోర్టులో వాదనలు జరిగాయి. ప్రాసిక్యూషన్ తరపున పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. తెలుగుదేశం ఆఫీసుపై దాడి కేసులో వంశీ నిందితుడని, ఇదే కేసులో మరో నిందితుడికి హైకోర్టు ముందస్తు బెయిల్ తిరస్కరించిందని, వంశీ దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా ఇటీవల హైకోర్టు తోసిపుచ్చిందని పోసాని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఫిర్యాదుదారు సత్యవర్ధన్‌ను వంశీ బెదిరించారని, ఒక కేసు నుంచి బయటపడడం కోసం మరో నేరం చేశారని తెలిపారు.
అట్రాసిటీ కేసుల్లో బెయిల్ కోసం స్థానిక కోర్టులను ఆశ్రయించిన తర్వాత హైకోర్టుకు వెళ్లాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని, దీనికి విరుద్ధంగా వంశీ ముందుగా హైకోర్టుకు వెళ్లిన తర్వాత ఈ కోర్టుకు వచ్చారని వివరించారు. వాదనలు విన్న న్యాయాధికారి హిమబిందు విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు. ఇక గన్నవరంలో టీడీపీ ఆఫీసుపై జరిగిన దాడి కేసులో వంశీ బెయిల్ పిటిషన్‌పై విచారణను సీఐడీ కోర్టు ఈనెల 24వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయాధికారి తిరుమలరావు ఆదేశాలు ఇచ్చారు.
ఇదే కేసులో వంశీని మరోసారి మూడు రోజుల పోలీసు కస్టడీకి అప్పగిస్తూ విజయవాడ సీఐడీ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే మూడు రోజులపాటు కస్టడీకి తీసుకుని విచారించారు.