పెళ్లి అనేది ఓ మధుర జ్ఞాపకం. మరి అలాంటి తంతుని సాదాసీదాగా కానిచ్చేస్తే మజా ఏం ఉంటుంది! అందుకే ఆహ్వాన పత్రికల దగ్గర నుంచి విందు భోజనాల వరకూ ఏదో ఒక ప్రత్యేకత చాటాలని చాలామంది కోరుకుంటుంటారు.అదే ఆలోచనతో ఓ వ్యక్తి తన కుమార్తె వివాహానికి చేయించిన ఆహ్వాన పత్రిక ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది.
సాధారణంగా పెళ్ళి శుభలేఖలో వధూవరుల పేర్లతో పాటు ఆహ్వానితులుగా వారి తల్లిదండ్రులు, కుటుంబ పెద్దలు, సమీప బంధువుల పేర్లు ముద్రణ వేయించడం చూసుంటాం. కానీ తమిళనాడులోని తంజావూరు జిల్లా మలాపురం పంచాయతీ అధ్యక్షుడైన రమేష్ తన కుమార్తె వివాహానికి వినూత్నంగా చేయించిన ఆహ్వాన పత్రిక ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
పంచాయతీ అధ్యక్షుడైన రమేష్ కుమార్తె షాలిని వివాహం ఈ నెల 24వ తేదీన జరగనుంది.ఈ క్రమంలో తన కుమార్తె వివాహంలో ప్రత్యేకత ఉండాలని ఇలా అచ్చు వేయించారో లేక వేరే ఏదైనా కారణమో తెలియదు కానీ రమేష్ చేయించిన ఆహ్వాన పత్రిక అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. ఆ ఆహ్వాన పత్రికను చూసిన అందరూ ఇదేమిటి అని అవాక్కవుతున్నారట .
రమేష్ తన కుమార్తె శాలిని పెళ్ళి శుభలేఖలో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న మలాపురం పంచాయతీ పరిధిలోని 5 గ్రామాల్లో 900 కుటుంబాల పేర్లను చేర్చారు. అవే పత్రికలను తన బంధువులతో పాటు స్నేహితులతో పాటు ఆ ఐదు గ్రామాల ప్రజలకు పంచిపెట్టారు. ఇక ఆ పత్రికను చూసిణ వారంతా ఔరా అంటుండగా,ఆ గ్రామాల వాసులు మాత్రం తమ పేర్లను శుభలేఖలో అచ్చు వేయడాన్ని చూసి మురిసిపోతున్నారట.
ఇదిలా ఉంటే ఈ వివాహ పత్రిక పై రమేష్ మాత్రం.. తన పంచాయతీ అంతా ఒకే కుటుంబమన్న భావనతో తాను ఈ పనికి పూనుకున్నానని చెబుతున్నారట.మరోవైపు ఆ ఇంట శుభకార్యం తమ ఇంట్లోనే అన్నట్టు పెళ్లిపనులను 5 గ్రామాల ప్రజలు భుజాన వేసుకుని నడిపిస్తున్నారట.ఇక ఈ పెళ్లి ఆహ్వాన పత్రిక పై అందరి పేర్లను పొందుపరచడం ద్వారా..రమేష్ కుల, మతాలకు అతీతంగా అందరూ ఒకే కుటుంబం అన్న నానుడిని తెలిపారంటూ ఆయన మిత్రులు అభినందిస్తున్నారట.